04-11-2025 12:43:54 AM
							ఎన్ని అడ్డంకులొచ్చినా పూర్తిచేస్తాం
-ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ పూర్తికాదు
-తెలంగాణ ఉద్యమ ఆకాంక్షపై నీళ్లుచల్లిన కేసీఆర్
-స్వార్థ ప్రయోజనం కోసమే ప్రాజెక్టుల రీ డిజైన్
-ఎస్‌ఎల్బీసీతో ఉమ్మడి నల్లగొండకు శాశ్వత పరిష్కారం
-ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
-మంత్రులతో కలిసి మన్నేవారిపల్లిలో హెలీ మాగ్నేటిక్ సర్వే పరిశీలన
నాగర్‌కర్నూల్, నవంబర్ 3 (విజయక్రాంతి): ఎన్ని అడ్డంకులొచ్చినా ఎస్‌ఎల్బీసీని పూర్తి చేస్తామని, ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ పూర్తి కాదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎస్‌ఎల్బిసి సొరంగ మార్గంలో ప్రమాదం జరిగి పనులు నిలిచిపోగా తిరిగి పనులు ప్రారంభించాలనే ఉద్దేశం తో సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నేవారిపల్లిలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, బాలునాయక్‌లతో కలిసి హెలీ మాగ్నేటిక్ సర్వేను ప్రారంభించారు.
మాగ్నెటిక్ జియో ఫిజికల్ సర్వే నేషనల్ జియోఫిజికల్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్‌ఐ) శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు సీఎం తెలిపారు. హెలికాప్టర్‌కు ప్రత్యేకంగా అమర్చిన ట్రాన్స్‌మీటర్‌తో 200 మీటర్ల ఎత్తు నుండి వెయ్యి మీటర్ల వరకు భూమి పొరల్లో దాగి ఉన్న భూమి తీరును సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్లు సొంత రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ఏ ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు.
కృష్ణ నది నీటి ప్రవాహం 70% తెలంగాణలో, 30% ఆంధ్రాలో ప్రవహిస్తుండగా 1005 టీఎంసీలలో 70% తెలంగాణ వాటా ఉన్నప్పటికీ కేసీఆర్, హరీశ్‌రావు ఇద్దరూ రాయలసీమను రతనాలసీమగా మార్చేందుకు కృష్ణబోర్డు వద్ద 299 టీఎంసీలకే సంతకాలు చేసినట్లు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కృష్ణ నది నీటి వాటా హక్కు పొంద డం కోసం వాదనలు వినిపిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ, పాలమూరు జిల్లా ప్రాంత వాసులకు శాశ్వత పరిష్కారంగా ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్టును 20 ఏళ్ల క్రితమే ప్రారంభించగా నేటికీ పూర్తి కాలేదన్నారు. 9.5 కిలోమీటర్లు సొరంగ మార్గా న్ని ఏడాదికి ఒక కిలోమీటర్ చొప్పున బీఆర్‌ఎస్ ప్రభుత్వం తవ్వినా ఇప్పటికే ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు.
కానీ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందన్న అక్కసుతోపాటు కమిషన్లకు కక్కుర్తిపడి ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్టును కెసిఆర్ పట్టించుకో లేదన్నారు. ఇప్పుడు గనక పూర్తి చేయలేకపోతే మరి ఎప్పటికీ పూర్తి చేయలేమన్నారు. ఎస్‌ఎల్బిసి పూర్తి అయితే ఉమ్మడి నల్లగొండ, పాలమూరు జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు రోజుకు మూడు టీఎంసీల చొప్పున సాగు, తాగునీరు అందుతుందన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిపుణులైన ఆర్మీ అధికారులను డిప్యూటేష న్‌పై తీసుకురావడం జరిగిందన్నారు. టన్నెల్ లోపల చేసే పని క్రిటికల్ సిట్యూయేషన్ నేపథ్యంలో అందరితో సర్వేలు చేస్తున్నామన్నారు.
అటవీ ప్రాంతంలో టన్నెల్ చేయడం ఎంతో ఇబ్బంది అయినప్పటికీ తప్పకుండా పూర్తి చేసి తీరుతామన్నారు. అనవసరమైన ఆరోపణలు చిల్లర చేష్టలు మానుకోవాలని కేసీఆర్, హరీష్ రావు లకు సూచించారు. మన్నెవారిపల్లి, కేశ్య తండా, మర్లపాడు వంటి తండావాసులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద పరిహారం అందించేలా కలెక్టర్ ద్వారా నివేదికలు అందించాలని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. అన్ని తండాల వారికి డిసెంబరు 31లోగా సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటున్నట్లు తెలిపారు.
రెండేళ్లలో పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్
ఈ ప్రాజెక్టు పనులు 20 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నా గత ఐదేళ్ల క్రితం నుంచే ప్రారంభమయ్యాయని మంత్రి ఉత్తమ్ అభిప్రాయపడ్డారు. అందరి దృఢ సంకల్పంతో రెండేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పూర్తి చేయాలని ముందుకెళ్తున్నామని అన్నారు. ఈ టన్నెల్ పూర్తయితే శ్రీశైలం ప్రాజెక్టు కంటే ఎక్కువగా నీరు వస్తుందన్నారు. ప్రపంచంలోనే అత్యాధునికమైన హెలిబోన్ ఎలక్ట్రిక్ టెక్నాలజీ ద్వారా 44 కిలోమీటర్ల వరకు హెలీకాప్టర్ ద్వారానే సర్వే జరుగుతుందని చెప్పారు. భారత ఏరియల్ ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిక్ సర్వే ఎక్కడా నిర్వహించలేదని, ఇక్కడే ప్రథమం అని చెప్పారు. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.
నా జన్మ సార్థకతం అవుతుంది: మంత్రి కోమటిరెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తానే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టు ద్వారా నల్లగొండ జిల్లాను ఫ్లోరైడ్ నుంచి కాపాడాలని ఎన్నోసార్లు మాట్లాడినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఎస్‌ఎల్‌బీసీ గురించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అడగకుండానే ఈ ప్రాజెక్టుకు ఎంత ఖర్చయినా పూర్తి చేయాలని సంకల్పించారని దీంతో తన జన్మ సార్థకతం అవుతుందన్నారు. మూడు లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు, ఫ్లోరైడ్ లేకుండా చేయడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు.