04-11-2025 12:02:17 AM
							మేడ్చల్, నవంబర్ 3 (విజయ క్రాంతి): టిప్పర్ ల అతివేగం, ఓవర్ లోడ్ సామాన్య ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. మేడ్చల్ జిల్లాలో ఓవర్ లోడ్ తో కంకర టిప్పర్లు వెళ్తున్నప్పటికీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో 19 కంకర మిషన్లు ఉన్నాయి. వీటినుంచి డస్ట్, కంకర టిప్పర్లలో పరిమితికి మించి తరలిస్తున్నారు.
నిబంధనల ప్రకారం ఆరు టైర్ల టిప్పర్లలో 16200 కిలోలు, 10 టైర్ల టిప్పర్లలో 24500 కిలోలు, 12 టైర్ల టిప్పర్లలో 36000 కిలోలు మించకుండా మెటీరియల్ తీసుకెళ్లాలి. కానీ 30 నుంచి 40% వరకు ఎక్కువ మెటీరియల్ తీసుకెళ్తున్నారు. అధిక బరువుతో వాహనాలు వెళ్లడం వల్ల రోడ్లు ధ్వంసం అవుతున్నాయి. అంతేగాక పైన కవర్ వేయకుండా తీసుకెళ్లడం వల్ల కంకర రోడ్డు మీద పడడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందువుతోంది. డస్టును కూడా అలాగే తీసుకెళ్లడం వల్ల గాలికి డస్ట్ లేచి కళ్ళలో పడుతోంది.
అతివేగంగా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్
టిప్పర్లను డ్రైవర్లు అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతున్నారు. ఎదురుగా టిప్పర్ వస్తుందంటే వాహనదారులు భయపడిపోతున్నారు. డ్రైవర్లకు అనుభవం ఉండదు. డ్రైవింగ్ లైసెన్సు ఉండదు. టిప్పర్ కు ఇన్సూరెన్స్ ఉండదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బాధిత కుటుంబం రోడ్డున పడాల్సి వస్తోంది. అంతేగాక రాంగ్ రూటులో ఇష్టానుసారంగా నడుపుతున్నారు. ఇటీవల కాలంలో ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని డ్రైవర్లుగా నియమించుకుంటున్నారు. వారు ఎప్పుడూ గంజాయి, మద్యం మత్తులో ఉంటారు. మత్తులోనే టిప్పర్లు నడుపుతున్నారు.
వందల సంఖ్యలో టిప్పర్లు
ఒక్కో క్రషర్ నుంచి ప్రతి రోజు వందల సంఖ్యలో టిప్పర్లు నడుస్తున్నాయి. మేడ్చల్ మండలం రావల్కోల్ శివారులో బస్వాపూర్ రోడ్డులో రెండు కిలోమీటర్ల లోపల రెండు భారీ క్రషర్లు ఉన్నాయి. ఈ రోడ్డులో నడిచే టిప్పర్ల కోసమే పంచర్ షాపు ఉందంటే ప్రతిరోజు ఎన్ని టిప్పర్లు నడుస్తున్నాయో అర్థమవుతుంది. ప్రతిరోజు ఇక్కడ టిప్పర్లు బారులు తీరుతాయి. ఈ క్రషర్లకు ఏ అధికారి వెళ్లి తనిఖీ చేయరు. ఎంత తవ్వుతున్నది కూడా చూడరు.
చేవెళ్ల దుర్ఘటనతోనైనా అధికారులు కళ్ళు తెరవాలి
చేవెళ్ల బస్సు దుర్ఘటనతోనైనా అధికారులు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. కంకర టిప్పర్ ఓవర్ లోడ్ తో అతివేగంతో వచ్చి బస్సును ఢీ కొట్టినట్టు తెలుస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా వివిధ శాఖల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. రెగ్యులర్గా వాహనాలను తనిఖీ చేస్తే ప్రమాదాలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. టిప్పర్ యజమానులు అనుభవం, ఉన్నవారిని డ్రైవర్ గా నియమించుకుంటారు.
రవాణా శాఖ అధికారులు ఇప్పటివరకు టిప్పర్లను తనిఖీ చేసిన దాఖలాలు లేవు. మామూళ్ళు అందడంతో తనిఖీలు చేయడం లేదని తెలు స్తోంది. కంకర మిషన్లు ఎక్కువగా రాజకీయ నాయకులకు చెందినవి ఉన్నాయి. వీరు అన్ని నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. వివిధ శాఖల అధికారులు తనిఖీలు చేపట్టాలని, టిప్పర్లు అధిక లోడుతో వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.