calender_icon.png 4 November, 2025 | 7:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ కాలేజీలు బంద్

04-11-2025 12:48:20 AM

-రాష్ట్రవ్యాప్తంగా 2 వేల కళాశాలల మూత

-యాజమాన్యాలకు విద్యార్థి సంఘాల మద్దతు

-రోడ్లపైకి వచ్చి టీచర్లు, ఉపాధ్యాయుల ర్యాలీలు

-10 వేల కోట్ల బకాయిల్లో 50% విడుదలకు ‘ఫతి’ డిమాండ్

హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఫీజురీయింబర్స్ మెంట్ వర్తించే కాలేజీలన్నీ సోమవారం మూతపడ్డాయి. ఆయా కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల తరగతులను నిలి పివేశాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించారు. రూ.10 వేల కోట్ల పెండింగ్ బకాయిల్లో ప్రభుత్వం రూ.5 వేల కోట్లు ఇచ్చేవరకు వరకూ బంద్ కొనసాగుతుందని యాజమాన్యాలు స్పష్టం చేశాయి.

బంద్ పిలుపులో భాగంగా తొలిరోజు కార్యాచరణ విజయవంతమైందని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య (ఫతి) చైర్మన్ రమేష్ బాబు, వైస్ చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలోని ఫతే మైదాన్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 2 వేల కాలేజీయాజమాన్యాలు బంద్‌లో పాల్గొన్నా యని తెలిపారు. 8వ తేదీన ఎల్బీ స్టేడియంలో 30 వేల మంది కాలేజీ సిబ్బందితో భారీ సభ నిర్వహిస్తామని వెల్లడించారు.

11న పది లక్షల మంది విద్యా ర్థులతో సెక్రటేరియేట్‌కు లాంగ్ మార్చ్ చేపడతామన్నారు. రూ.1,200 కోట్ల టోకెన్ అమౌంట్‌లో ప్రభుత్వం రూ.300 కోట్లు ఇస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిందని, అందుకు తమ ఎగ్జిక్యూటివ్ కమిటీ అంగీకరించలేదన్నారు. రూ.300 కోట్లు ఏమాత్రం సరిపోవని తేల్చిచెప్పారు. మొత్తం రూ.10 వేల కోట్ల బకాయిల్లో రూ.5 వేల కోట్లపైగా చెల్లిస్తేనే తరగతులు నిర్వహిస్తామన్నారు. జీతాలు ఇవ్వకపోవడంతో స్టాఫ్, సిబ్బంది తమను అవమాన కరంగా చూస్తున్నారని, కొందరు ఉద్యోగాలకు సైతం రాజీనామా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

50 శాతం బకాయిలు వచ్చేవరకు నిరవధిక బం ద్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఫీజు రీయింబర్‌మెంట్ వర్తించని కాలేజీలు మాత్రం తరగతులు నిర్వహిస్తున్నాయని, వర్తించే కాలేజీలన్నీ మూతపడ్డాయని తెలిపారు. తమ గోడు వినిపించేందుకు కనీసం సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడంలేదని వాపోయారు. ఫీజు రీయిం బర్స్‌మెంట్ స్కీంను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూస్తోందని ఆరోపించారు.

బడుగు, బలహీనవర్గాలకు చెందిన విద్యార్థుల చదువుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కాలేజీలన్నీ మూతపడటంతో సోమవారం విజిలెన్స్ విభాగం తనిఖీలకు ఎక్కడికక్కడ బ్రేక్ పడింది. కొన్ని జిల్లాల్లోని కాలేజీల యాజమాన్యాలకు విజిలెన్స్ నుంచి సమాచారం అంద గా, తాము బంద్‌లో ఉన్నామని యాజమాన్యాలు బదులివ్వడంతో తనిఖీలు నిలిచాయి. ప్రైవేట్ కాలేజీల బంద్‌కు ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌తోపాటు పలు విద్యార్థి సంఘాలు అన్ని జిల్లాల్లో మద్దతు తెలిపాయి. ఆయా సంఘాల నేతలు విద్యార్థులతో కలిసి ర్యాలీలకు ప్రాతినిధ్యం వహించారు.

స్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడి చేపట్టింది.ప్రదర్శనలో అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ రజనీకాంత్, టీ నాగరాజు మాట్లాడుతూ.. ఫీజు బకాయిలు విడుదల చేయకుండా 15 లక్షల మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లకుండా చేస్తోందని విమర్శించారు. ప్రదర్శనలో పోలీసులు, విద్యార్థల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు పలువురు విద్యార్థి నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.