calender_icon.png 4 November, 2025 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళ్లముందే నాలా కబ్జా మణికొండలో టీం ఫోర్ మాయ!?

04-11-2025 12:52:21 AM

-భారీ కాంక్రీట్ మిక్సింగ్‌తో కాలుష్యం జనం ముఖాన దుమ్ము 

-చారిత్రక బుల్కాంపూర్ నాలాను కబళిస్తున్న వైనం 

-ధూళితో స్థానికులకు నరకం 

-ఫిర్యాదులు చేసినా నిమ్మకు నీరెత్తినట్టు యంత్రాంగం 

-మామూళ్ల మత్తులో జోగుతున్నారని ఆరోపణలు

మణికొండ, నవంబర్ 3 (విజయక్రాంతి) : మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల నెత్తిన ‘టీం ఫోర్’ నిర్మాణ సంస్థ పెను గుదిబండలా మారింది. స్థానిక బీరప్ప గుడి సమీపంలో, చారిత్రక బుల్కాపూర్ నాలా ను ఆక్రమించి ఏర్పాటుచేసిన భారీ కాంక్రీట్ మిక్సింగ్ యూనిట్ స్థానికుల పాలిట శాపంగా మారింది.

ఈ యూనిట్ నుంచి వెలువడుతున్న భయంకరమైన దుమ్ము, ధూళితో ప్రజలు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతుండగా, నిరంతరం లారీల రాకపో కలతో రోడ్లు ధ్వంసమై నరకాన్ని తలపిస్తున్నాయి. కళ్లముందే ఇంతటి విధ్వంసం జరుగుతున్నా, అధికారులు ‘మామూళ్ల’ మత్తులో జోగుతున్నారని, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

కాలుష్య కోరల్లో..

‘టీం ఫోర్’ కాంక్రీట్ యూనిట్ కారణంగా ఆ ప్రాంతమంతా దుమ్ము, ధూళితో నిండిపోయింది. దీంతో స్థానిక ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఆసుపత్రుల పాలవుతున్నారు. దీనికి తోడు, ఈ యూనిట్ కోసం నిత్యం వందలసంఖ్యలో తిరిగే భారీ టిప్పర్లు, లారీ ల వల్ల రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారి,ప్రయాణానికి నరకప్రాయంగా మా రాయి.

పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, ఈ యూనిట్ పక్కనే ఉన్న 11 కేవీ విద్యు త్ సబ్‌స్ట్టేషన్ మరో పెను ప్రమాదానికి నిలయంగా మారింది. భూగర్భంలో ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లపై నుంచే ఈ భారీ వాహనాలు యథేచ్ఛగా తిరుగుతుండటంతో, విద్యుత్ కేబుళ్లు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. గతవారం ఈ సంస్థ కారణంగా షార్ట్ సర్క్యూ ట్ సంభవించింది. అయితే సిబ్బంది అప్రమత్తతతో పెనుప్రమాదం తప్పింది. ఈ విష యంపై విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.

కళ్లముందే కబ్జా..

ఈ అక్రమ నిర్మాణం, నాలా ఆక్రమణపై స్థానికులు రెవెన్యూ, మున్సిపాలిటీ, ఇరిగేషన్ అధికారులతో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు సైతం పలుమార్లు ఫిర్యాదులు చేశారు. అధికారులు చుట్టపుచూపుగా వచ్చి వెళ్లారే తప్ప, కళ్లముందే జరుగుతున్న నిబంధనల ఉల్లంఘనపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. 

స్పందించని పొల్యూషన్ బోర్డు అధికారులు

ఈ వ్యవహారంలో అత్యంత కీలకమైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల తీరు మరింత విస్మయానికి గురిచేస్తోంది. విషయంపై వివరణ కోరేందుకు ‘విజయక్రాంతి’ ప్రతినిధి సంబంధిత సర్కిల్ పీసీబీ అధికారిని సంప్రదించగా, ఆయన స్పందించకపోవడం గమనార్హం. ఈ పరిణామం, ‘టీం ఫోర్’ సంస్థకు అధికారులు ఎంతగా విధేయులుగా ఉన్నారో స్పష్టం చేస్తోందని స్థానికులు విమర్శిస్తున్నారు.

మామూళ్ల ఆశపడేనా!

అధికారుల నిర్లక్ష్యం వెనుక భారీగా మామూళ్లు చేతులు మారుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే 55 కిలోమీటర్ల పొడవైన బుల్కాంపూర్ నాలాలో 10 కిలోమీటర్లు కబ్జాకు గురైంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, ‘టీం ఫోర్’ సంస్థ అనుమతులను పరిశీలించి, ఈ యూనిట్‌ను తక్షణమే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

బుల్కాపూర్ నాలాను కాపాడాలి 

చారిత్రక బుల్కాపూర్ నాలాను కబ్జాదారుల నుంచి కాపాడాలి. అధికారులు తక్షణమే స్పందించి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ అక్రమ కట్టడాన్ని నిరోధించాలి. లేదంటే ప్రజా ఉద్యమం తప్పదు.

 డప్పు అర్జున్, ఎమ్మార్పీఎస్ నేత

‘టీం ఫోర్’కు నోటీసులు జారీచేస్తాం 

ఈ వ్యవహారంపై స్థానిక మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్‌ను వివరణ కోరగా, సంస్థ పర్మిషన్ల వివరాలను తెప్పించి పరిశీలిస్తామని అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూస్తామని తెలిపారు. తక్షణమే ‘టీం ఫోర్’ సంస్థకు నోటీసులు జారీచేసి, చట్టపరమైన చర్య లు తీసుకుంటామని తెలిపారు.

మున్సిపల్ కమిషనర్