calender_icon.png 4 November, 2025 | 6:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేపలను ఆహారంగా తీసుకోవడంలో తెలంగాణ వెనుకబడి ఉంది

03-11-2025 11:16:50 PM

చేపలను ఆహారంగా తీసుకుంటే ..

కలిగే ఆరోగ్యపరమైన లాభాలను ప్రజలకు వివరించాలి 

చేప పిల్లల పంపిణీ కోసం ప్రభుత్వం రూ. 123 కోట్లు కేటాయించింది 

నవంబర్ కల్లా చేప పిల్లల పంపిణీని పూర్తి చేయాలి 

రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి 

జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి 

హైదరాబాద్ (విజయక్రాంతి):  చేపలను ఆహారంగా తీసుకోవడం వల్లే ఆరోగ్యపరమైన లాభాలను ప్రజలకు విరించాలని, అందుకు గల ప్రణాళికలను రూపొందించాలని రాష్ట్ర మత్స్యసహకార శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. చేపలను ఆహారంగా తీసుకోవడంలో తెలంగాణ ప్రజలు వెనుకబడి ఉన్నారని తెలిపారు. సోమవారం సచివాలయంలో చేప పిల్లల పంపిణీపై జిల్లా కలెక్టర్లు, మత్స్యశాఖ అధికారులతో మంత్రి శ్రీహరి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి  మాట్లాడుతూ నవంబర్ చివరికల్లా చేపపిల్లల పంపిణీ పూర్తి కావాలని, అందుకు అనుగుణంగా ప్రజాప్రతినిధులను కలుపుకొని ప్రణాళికలు రూపొందించాలన్నారు.

గత ప్రభుత్వ హయంలో చేప పిల్లల పంపిణీలో  అక్రమాలు జరిగాయని, మత్స్యశాఖపై ఉన్న అభియోగాన్ని మార్చేందుకు ప్రతి చెరువు వద్ద చేపపిల్లల పంపిణీ వివరాలు తెలిసేలా సైన్ బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. చేప పిల్లల పంపిణీ ప్రక్రియను ప్రభుత్వం నియమ నిబంధనలు అనుగుణంగా టి మత్స్య యాప్‌లో అఫ్‌లోడ్ చేయాలన్నారు. చేప పిల్లల పంపిణీ కోసం ప్రభుత్వం రూ. 123 కోట్లు కేటాయించిందన్నారు.  తెలంగాణలో  కృష్ణా, గోదావరి జీవనదులు, గొలుసు కట్టు చెరువులు ఉన్నాయని, చేపల ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఉత్పత్తితో పాటు మార్కెటింగ్ సదుపాయం కూడా  పెంచాలని మంత్రి పేర్కొన్నారు.

ప్రతి నియోజకవర్గంలో ఫిష్ రిటైల్ అవుట్ లెట్ మార్కెట్ కోసం ప్రభుత్వ స్థలాలను కలెక్టర్లు కేటాయించాలని మంత్రి ఆదేశించారు . వివిధ రాష్ట్రాల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపల వంటకం అమలు చేస్తున్న అంశాన్ని పరిశీలిస్తున్నామని, మన రాష్ట్రంలో అమలుపైన సీఎం రేవంత్‌రెడ్డితో చర్చిస్తామన్నారు.  చేప పిల్లల పంపిణీపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాయాలని, ప్రతి వారం ఇందుకు సంబంధించిన పురోగతిని రాష్ర్ట స్థాయి అధికారులకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో  మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్, ఫిషరీస్ డైరెక్టర్ నిఖిల, అడిషనల్ డెరైక్టర్ శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.