04-11-2025 12:11:50 AM
							-“ గీత” దాటుతున్నారు.. వేటు వేయరేమీ
- లైసెన్స్ లేకుండా నెలరోజులు కల్లు అమ్మకాలు
- మూడవ సొసైటీలో ముదిరిన వివాదం
- డైరెక్టర్ పై తీవ్ర దాడి
- దాడులు జరిగాక డిపో సీజ్
- సహకార వ్యవస్థకు మంగళం అధికారుల అండతోనే
- ఓ కుటుంబ పెత్తన ఫలితం?
- మూడో కల్లు డిపో ఆగమాగం
- సొసైటీ అధ్యక్షుడు, ప్రతినిధుల రాజీనామా
- నాయకత్వ సంభంలో మూడో సొసైటీ
-కార్మికుల్లో ఆందోళనజ
- ప్రజాప్రతినిధులకు పట్టాదేమి?
నిజామాబాద్ నవంబర్ 03:(విజయ క్రాంతి): నిజామాబాద్ నగరంలోని మూడవ కల్లు డిపో ఇప్పుడు నాయకత్వ సంభంలో కూరుకుపోయింది. సొసైటీ అధ్యక్షుడు, డైరెక్టర్, ఉపాధ్యక్షుడు... ఇలా కీలక బాధ్యతల్లో ఉన్నవారంతా ఒక్కొక్కరిగా తమ పదవులకు రాజీనామా చేయడంతో, డిపో భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.
పైకి ఇది కేవలం కార్మికుల మధ్య గొడవగా కనిపిస్తున్నప్పటికీ, దీని వెనుక దశాబ్ద కాలంగా పాతుకుపోయిన ఓ కుటుంబం యొక్క అసాంఘిక పెత్తనం, వారికి అండగా నిలుస్తున్న కొందరు ఎక్సుజ్ శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, లేదా కుమ్మక్కు ఉందన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది కేవలం కల్లు డిపోలోని గొడవ కాదని, వ్యవస్థీకృత దమనకాండ అంటూ కార్మికులు విమర్శిస్తున్నారు. అంతే కాకుండా ఈ సమస్య కేవలం కూలీల మధ్య తలెత్తిన ఆధిపత్య పోరు కాదు. ఇది సహకార చట్టం స్ఫూర్తిని ఖూనీ చేస్తూ, కార్మికుల హక్కులను కాలరాస్తున్న ఒక కుటుంబ నియంత పోకడ అంటూ దుయ్యబడుతున్నారు.
సహకార స్ఫూర్తికే పాతర
ఎక్సుజ్ సహకార చట్టం ప్రకారం, కల్లు డిపో ద్వారా వచ్చే లాభాలను కార్మికులంతా సమానంగా పంచుకోవాలి, అంతేకాకుండా సొసైటీపై ఆధారపడిన గౌడ కులస్తులకు కొంత మొత్తం చెల్లించాలి. కానీ, ఈ మూడవ డిపోలో ఈ నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి. అధికార పార్టీ అండదండలు ఉన్నాయని చెప్పుకునే ఒక కుటుంబం, వారి బంధువులు కలిసి మొత్తం డిపోను తమ సొంత జాగీరుగా మార్చుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. వేతనాలు అడిగిన వారిపై దాడులు, బెదిరింపులతో “డివైడ్ అండ్ రూల్” (విభజించి పాలించు) సూత్రాన్ని అమలు చేస్తూ, కార్మికుల మధ్యే చిచ్చుపెట్టి పబ్బం గడుపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికారుల ‘అంధత్వం’ వెనుక ఆంతర్యమేమిటి?
ఈ మొత్తం వ్యవహారంలో ఎక్సుజ్ అధికారుల పాత్ర తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. బహిరంగంగా నిబంధనలు కాలరాస్తున్న అధికారుల నిర్లక్ష్యం విమర్శలకు తావిస్తోంది. రూ. లక్షల ముడుపులు చేతులు మారుతున్నట్టు, కార్మికులు కోడై కూస్తున్నారు. నగరంలోని ఒకటో, రెండో డిపోలోలేని గొడవలు, మూడో డిపోలోనే ఎందుకు వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు.
ఆ రెండు డిపోల్లో కార్మికులకు న్యాయం జరుగుతోందని, మూడో డిపోలో మాత్రం కార్మికులకు అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు. గతంలో, ఇప్పుడు మూడో డిపోపై ఎన్నో ఆరోపణలు వచ్చినా, ఇంకా వస్తున్నా అధికారుల్లో మాత్రం ఇంకా చలనం రావడం లేదని విమర్శిస్తున్నారు. సొసైటీలోని కొందరితో, ఎక్సుజ్ అధికారులు కొందరు మిలాఖాత్ కావడమే, చర్యలు ఆగిపోవడానికి కారణమని చెబుతున్నారు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
నెల రోజుల ‘అక్రమ’ దందా ఎన్నో అక్రమాలు
అక్టోబర్ 1 నాటికే రెన్యువల్ పూర్తి కావాల్సిన మూడో డిపో, ఎలాంటి అనుమతులు లేకుండా 30 రోజుల పాటు నడవడం అధికారుల వైఫల్యానికి పరాకాష్ట. ఇది కేవలం నిర్లక్ష్యమా లేక “మామూళ్ల మత్తు”లో మునిగిపోయి ఉద్దేశపూర్వకంగా కళ్లు మూసుకున్నారా? అనేది అధికారులే చెప్పాలి. లైసెన్స్ రెన్యువల్ కాకుండా, పగలు, రాత్రులు తేడా లేకుండా, పరిమితికి మించి, కల్లు డిపోలు నిర్వహిస్తున్నా, అధికారులకు పట్టకపోవడం విడ్డూరమని విమర్శిస్తున్నారు.
హింస జరిగే వరకూ పట్టదా?
మూడో కల్లు డిపోకు రెన్యువల్ లేని విషయాన్ని సమాజం గమనించిన ఎక్సుజ్ అధికారులు గమనించకపోవడం విశేషం. నెల రోజుల పాటు పట్టించుకోని అధికారులు తాజాగా చర్యలకు ఎందుకు దిగారు తెలిస్తే, అంతా నవ్విపోతారు అనటంలో సందేహం లేదు. ఈ డిపోలోని ఓ కార్మికుడు తాజాగా ఏకంగా సొసైటీ డైరెక్టర్‌పైనే కర్రతో దాడి చేశాడు. కేసు నమోదు కావడంతో జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు హడావుడిగా రంగంలోకి దిగారు. తమ పరువుపోయి, కేసు తమ మెడకు చుట్టుకోకముందే చర్యలు తీసుకోవాలని భావించారు. వెంటనే మూడ్రోజుల కిందట డిపోను సీజ్ చేయడం వారి అవకాశవాద పనితీరుకు అద్దం పడుతోంది. అంటే, శాంతిభద్రతల సమస్య తలెత్తితే తప్ప, చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం ఎక్సుజ్ అధికారులకు కనిపించలేదనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
దశాబ్దకాలంగా అండ
ఎక్సుజ్ శాఖలోని ఓ ఉన్నతాధికారి దశాబ్ద కాలంగా మూడో కల్లు డిపోలోని ఆ కుటుంబానికి వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సమస్య పెరగడానికి కారణం సదరు అధికారే కారణం అంటున్నారు. ఫిర్యాదులను బుట్టదాఖలు చేయడం, నిబంధనలను గాలికొదిలేయడం షరా మామూలే అయిపోయింది. ఈ అధికారి అండదండలతోనే ఆ కుటుంబం పెత్తనం చెలాయిస్తోందన్నది కార్మికుల ఆవేదన. అయినా ఎవరు పట్టించుకోకపోవడం విడ్డూరమే.
భయంతో పుట్టిన సంభం
ప్రస్తుత రాజీనామాల పర్వం కేవలం బాధ్యతల నుంచి తప్పుకోవడం కాదు. భయంతో పారిపోవడంలాంటిది. సొసైటీ సమావేశంలో వేతనాల గురించి ప్రశ్నించినందుకే ఒక డైరెక్టర్‌పై దాడి జరగడం, అధ్యక్షుడిని బెదిరించడం వంటి చర్యలు మిగతా కార్మికులను భయభ్రాంతులకు గురిచేశాయి. ఈ కుటుంబం యొక్క ఆగడాలను, వారికి వంతపాడుతున్న అధికారులను ఎదిరించి నిలబడే ధైర్యం లేక, సొసైటీ బాధ్యతలు చేపట్టేందుకే కార్మికులు జంకుతున్నారు. ఇది డిపోను ఉద్దేశపూర్వకంగా నాయకత్వ శూన్యతలోకి నెట్టి, మొత్తం వ్యవహారాన్ని తమ చేతుల్లోకి తీసుకునే పెద్ద కుట్రలో భాగమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రక్షాళన అవసరం
మూడవ కల్లు డిపోలో జరుగుతున్నది కేవలం ఒక కుటుంబం, కొందరు కార్మికుల మధ్య గొడవ కాదు. ఇది చట్టాన్ని, వ్యవస్థలను అడ్డంపెట్టుకుని సాగుతున్న దోపిడీ. ఈ రాజీనామాల పర్వం ఒక హెచ్చరిక మాత్రమే. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, దశాబ్దాలుగా వత్తాసు పలుకుతున్న ఆ ఎక్సుజ్ అధికారి ఎవరు? రెన్యువల్ లేకుండా నెల రోజులు డిపో నడపడానికి సహకరించినవారెవరు? అనే కోణంలో లోతైన విచారణ జరపాలి. కార్మికుల హక్కులను కాలరాస్తున్న ఆ కుటుం బంపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, డిపోలో సహకార వ్యవస్థను పునరుద్ధరించి, కార్మికులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
లేకపోతే, ఈ “కుటుంబ పెత్తనం” అనే నిప్పు... మిగిలిన కార్మికుల బతుకులను కూడా కాల్చి బూడిద చేయడం ఖాయం. ఇకనైనా అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు మేల్కొని, గీత కార్మికులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. లేదంటే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరి అధికారులు, ప్రజా ప్రతినిధులు ఏం చేస్తారో చూడాలి.