calender_icon.png 4 November, 2025 | 7:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలే సమస్తం..

04-11-2025 12:00:00 AM

-పేరుకే మున్సిపాలిటీ..

-అభివృద్ధికి ఆమడదూరంలో నకిరేకల్

-ఒక్క పార్కుకు నోచుకోని వైనం

-‘అసాంఘీక’ అడ్డాగా మినీ ట్యాంక్ బండ్

-ఉపాధి అవకాశాలు అంతంతే..

నల్లగొండ, నవంబర్ 2 (విజయక్రాంతి): నకిరేకల్ మున్సిపాలిటీలో సమస్యలే సమస్తంగా మారాయి. పేరుకు మున్సిపాలిటీ అయినా.. గ్రామపంచాయతీ కంటే అధ్వాన్నంగా పారిశుద్ధ్య పరిస్థితులు ఉన్నాయి. ఓ వైపు తాగునీటి కొరత.. మరోవైపు పారిశుద్ధ్య సమస్య.. ఫలితంగా పందుల స్త్వ్రరవిహారం చేస్తున్నాయి. చీకటి పడిందంటే చాలు దోమ లు బెడదను తట్టుకోలేని పరిస్థితి. నియోజకవర్గ కేంద్రంగా ఉన్న నకిరేకల్లో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క పార్కు లేకపోవడం.. పట్టణవాసులు ఆహ్లాదానికి దూరంగా ఉండాల్సి వస్తోంది.

నకిరేకల్ పట్టణంలో అభివృద్ధి సంగతేమో గానీ.. ప్రభుత్వ భూముల కబ్జా.. సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. గ్రామపంచాయతీ కాలం లోనూ నకిరేకల్ విపరీతమైన అక్రమాలు జరిగినా.. వాటిపై ఏనాడూ చర్యలు తీసుకున్న దాఖాలాల్లేవు. పట్టణంలో కొత్తగా ఏర్పడిన ఏన్నో కాలనీలకు కనీసం సీసీ రహదారులు, సైడ్ డ్రైనేజీలు లేక మురుగు నీరు వీధుల వెంట పారాల్సిందే. నకిరేకల్ ప్రధాన సెంటరు చినుకు పడిందంటే చాలు చిత్తడిగా మారుతోంది. రోడ్లు అధ్వాన్నంగా మారా యి. నకిరేకల్ ప్రధాన కూడలితో పాటు మూసీ రోడ్లు గుంతలమయంగా మారింది.

ఒక్క పార్కులేని వైనం..

దాదాపు నకిరేకల్ పట్టణంలో 30వేలకు పైగా జనాభా ఉంది. ఒక్క మినీస్టేడియం మినహాయిస్తే.. మిగతా ఎక్కడా ఖాళీ స్థలం లేదు. ఉదయం, సాయంత్రం వేళల్లో మినీస్టేడియంలో వాకింగ్ చేయడం తప్ప మిగతా ఆహ్లదానికి నకిరేకల్ పట్టణం ఆమడదూరంలోనే నిలిచిందని చెప్పాలి. మరోవైపు రూ.లక్షలతో అభివృద్ధి చేశామని చెబుతున్నా.. మినీట్యాంక్ బండ్ అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.

నకిరేకల్ పట్టణం మొత్తంలో కనీసం ఒక్కటంటే ఒక్క పార్కు లేకపోవడం చర్చనీయాంశమే. వాస్తవానికి నకిరేకల్ పట్టణం పరిధిలో పదుల సంఖ్యలో వెంచర్లు ఏర్పాటయ్యాయి. అందులో నిబంధనల ప్రకారం గ్రామపంచాయతీకి చెందాల్సిన ఖాళీస్థలాల సంగతి ఇప్పటివరకు అతీగతీలేదు. ఆ ఖాళీ స్థలాల్లో పార్కులను అభివృద్ధి చేసి ఉంటే.. కొంతలోకొంతైనా పట్టణవాసులకు ఆహ్లాదం దక్కేది.

మినీట్యాంకు బండ్‌లో కబ్జాల పర్వం..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.6 కోట్లు వెచ్చించి నకిరేకల్ పెద్దచెరువును మినీ ట్యాంకు బండుగా తీర్చిదిద్దింది. పదుల సంఖ్యలో ఎఫ్టీఎల్ పరిధిని దాటి అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా.. వాటిని పట్టించుకోవడం లేదు. ఎఫ్టీఎల్ పరిధిని దాటి అక్రమార్కులు కొందరు యధేచ్చగా పూడ్చుతూ నిర్మాణాలు చేస్తున్నారు.

గతంలో ప్రధాన రహదారి నుంచి ఎఫ్టీఎల్ పరిధి దాటి చెరువు లోపలికి సీసీ డ్రైన్ నిర్మాణం చేశారు. దీన్ని ఆసరాగా తీసుకుని అక్రమార్కులు మట్టితో రోడ్డును రాత్రికి రాత్రే నిర్మించారు. గతంలో 20 వరకు ఉన్న అక్రమ నిర్మాణాలు.. ప్రస్తుతం 45కి పైగా పెరిగిపోయాయి. నిత్యం ప్రజాప్రతినిధులు తిరిగే రహదారిని అనుకుని ఉన్న పెద్దచెరువులోనే పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా.. వాటిని నియంత్రించడంలో పాలకులు విఫలమవ్వడం ఏంటని పట్టణవాసులు ప్రశ్నిస్తున్నారు.

అభివృద్ధికి ఆమడదూరంలో నకిరేకల్..

నకిరేకల్ మున్సిపాలిటీ అభివృద్దికి ఆమడదూరంలో నిలిచింది. పట్టణంలో మినీస్టేడియం, నిమ్మ మార్కెట్ మినహా మరేవీ ఇక్కడ లేవు. చివరకు ఆర్టీసీ బస్టాండ్ సైతం ప్రజలకు అందుబాటులో లేదు. వాస్తవానికి నకిరేకల్లో ఆర్టీసీ బస్టాండ్ను దశాబ్ద కాలం క్రితమే నిర్మించినా.. అది పట్టణానికి కిలోమీటరు దూరంలో ఉండడం.. అందులో బస్సులు లోపలికి రాకపోవడంతో అది నిరుపయోగంగా మారింది. గతంలో ఆ బస్టాండ్ను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు మరమ్మత్తులు సైతం చేయించారు. 

కానీ పట్టణానికి దూరంగా ఉన్న నేపథ్యంలో కిలోమీటరుకు పైగా నడిచి వచ్చి బస్సు ఎక్కే పరిస్థితి లేదు. ఇదిలావుంటే.. నకిరేకల్ పట్టణంలో పేద, మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువ. వీరికి ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉండడంతో ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యే పరిస్థితి లేదు. ఎంతసేపటికి పట్టణంలో వ్యాపార దుకాణాల్లో పనిచేయడం మినహాయిస్తే.. మరో ఉపాధి మార్గం లేకుండా పోయింది. ఇప్పటికైనా నకిరేకల్ పరిస్థితి మారుతుందా..? లేదా..? అన్నది వేచిచూడాల్సిందే.