13-12-2024 02:25:05 AM
హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): రాష్ట్రంలోని అభివృద్ధి పనులకు కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం.. గురువారం హస్తినలో బిజీబిజీగా గడిపారు. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి రాష్ట్రానికి అవసరమైన నిధులు, ప్రాజెక్టులను మంజూరు చేయాలని కోరారు.
రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగానికి (159 కి.మీ.) అవసరమైన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి గడ్కరీకి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. 2017లోనే ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగాన్ని 161ఏఏ జాతీయ రహదారిగా ప్రకటించారని సీఎం గుర్తుచేశారు.
ఇప్పటికే ఈ రహదారి నిర్మాణానికి అవసరమయ్యే భూమిలో 94 శాతాన్ని రాష్ర్ట ప్రభుత్వం సేకరించిందని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన శ్రీశైలంను హైదరాబాద్‌తో అనుసంధానించే ఎన్.హెచ్ 765లో 125 కిలోమీటర్ల దూరం జాతీయ రహదారుల ప్రమాణాలతో ఉందని, మిగిలిన 62 కిలోమీటర్లు ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ఉందని తెలిపారు.
అటవీ, పర్యావరణశాఖ నిబంధనల ఫలితంగా ఆ మేరకు రహదారి అభివృద్ధికి ఆటంకంగా ఉందని, కేవలం పగటివేళలో మాత్రమే రాకపోకలు సాగించాల్సి వస్తోందని కేంద్రమంత్రికి సీఎం తెలిపారు. ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని, ఇందుకు 2024- బడ్జెట్‌లో నిధులు మంజూరు చేయాలని గడ్కరీకి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మధ్య 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని ముఖ్యమంత్రి వివరించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్య నగరాలైన హైదరాబాద్- (ఎన్.హె-చ్ 65) రహదారిని 6 వరుసలుగా విస్తరించే పనుల డీపీఆర్‌ను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ రహదారి విస్తరణ పనుల పూర్తయితే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన వారమవుతామని చెప్పారు.
తెలంగాణలోని రెండో పెద్ద నగరమైన వరంగల్ దక్షిణ భాగం బైపాస్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అనుసంధానించే ఎన్‌హెచ్-63 (16) వరంగల్, హన్మకొండ నగరాల మధ్యగా వెళుతోందని.. ఈ రహదారిని నగరం వెలుపల నుంచి నాలుగుచోట్ల కలుపుతూ బైపాస్ మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు.
పర్వత మాల ప్రాజెక్ట్‌లో యాదాద్రి దేవాలయం, నల్లగొండ పట్టణంలోని హనుమాన్ కొండ, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద రోప్ వేలను ఏర్పాటు చేయాలని గడ్కరీని సీఎం కోరారు. గోదావరి, కృష్ణా నదులపై గిరిజనులు అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో.. ప్రజా రవాణాకు ఇబ్బందిగా ఉన్న 10 చోట్ల పాంటూన్ బ్రిడ్జిలు మంజూరు చేయాలని, నల్లగొండ జిల్లాల్లో ఎన్.హెచ్ -65 పక్కన 67 ఎకరాల ప్రభుత్వ భూమిలో ట్రాన్స్‌పోర్ట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వినతుల పత్రం
ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్), హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2తోపాటు హైదరాబాద్, వరంగల్‌లో సీవరేజీ, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్లాన్, సింగరేణి సంస్థకు బొగ్గు గనుల కేటాయింపు సహా పలు అంశాలపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. కిషన్‌రెడ్డిని ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో రేవంత్ రెడ్డి కలిశారు.
* రాష్ట్రంలో రూ.1,63,559.31 కోట్ల విలువైన ప్రాజెక్టుల పూర్తికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మంజూరయ్యేలా సహకరించాలి.
* ఆర్‌ఆర్‌ఆర్ నిర్మిస్తామని ప్రధాని మోదీ 2022లోనే ప్రకటించిన విషయాన్ని కిషన్ రెడ్డికి సీఎం గుర్తు చేశారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.34,367.62 కోట్లు అవుతుందని, ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ, ఉత్తర భాగాల పూర్తికి వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న అనుమతులన్నీ ఇప్పించేందుకు కృషి చేయాలి.
* ఓఆర్‌ఆర్ ఆర్‌ఆర్‌ఆర్‌ల అనుసంధానానికి రేడియల్ రోడ్లు నిర్మాణానికి సహకరించాలి.
* 10 గ్రీన్‌ఫీల్డ్ రోడ్లతో పాటు ఓఆర్‌ఆర్ అనుసంధానించే మెట్రో కారిడార్ రేడియల్ రోడ్లకు రూ.45 వేల కోట్లు మంజూరయ్యేలా చూడాలి.
* మెట్రో ఫేజ్ 2లో నిర్మాణానికి రూ.24,269 కోట్లు అవసరం అవుతాయని, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు సంయుక్తంగా 50: 50 వాటాతో ఈ ప్రాజెక్టును చేప్టటేందుకు సహకరించాలని సీఎం కోరారు.
* సింగరేణి సంస్థ మనుగడ కొనసాగించేందుకు గోదావరి లోయ పరిధిలోని బొగ్గు బ్లాక్‌లను సింగరేణికి కేటాయించేలా చూడాలి.
* సెమీకండక్టర్ల ప్రాజెక్టులకు హైదరాబాద్ అనువుగా ఉందని, నిపుణులైన కార్మికులు, మౌలిక వసతుల అభివృద్ధిలో రాష్ర్ట ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధను పరిగణనలోకి తీసుకొని తెలంగాణను సెమీకండక్టర్ మిషన్‌లో చేర్చాలి. ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల విడుదలో రాష్ట్రంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
మూసీకి రూ.14,100 కోట్లను ఇవ్వండి
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణశాఖ పరిధిలోని 222.27 ఎకరాల భూమి రాష్ర్ట ప్రభుత్వానికి బదలాయింపుతోపాటు గాంధీ సరోవర్ నిర్మాణం, మూసీ సీవరేజీ ప్రాజెక్టులు, 11 హెరిటేజ్ వంతెనల నిర్మాణంతోపాటు ఇతర పనులకు రూ.14,100 కోట్లు వ్యయమవుతాయని అంచనా వేశామని కిషన్‌రెడ్డికి సీఎం వివరించారు.
నిధుల మంజూరుతో పాటు అనుమతులకు సహకరించాలని కోరారు. మూసీ పునరుజ్జీవంలో భాగంగా గోదావరి నీటిని మూసీకి తరలించేందుకు, గోదావరి నుంచి నగరానికి 15 టీఎంసీలను హైదరాబాద్ తాగు నీరు అవసరాలకు తరలించేందుకు రూ.7,440 కోట్లతో ప్రణాళికలు రూపొందించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఆ మొత్తం విడుదలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ నగరంతో పాటు సమీప 27 మున్సిపాలిటీల్లో 7,444 కి.మీ మేర సీవరేజీ నెట్‌వర్క్ పనులకు రూ.17,212.69 కోట్లతో సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్ రూపొందించామని, అమృత్ 2 లేదా ప్రత్యేక ప్రాజెక్టు కింద దానిని చేపట్టేందుకు సహకరించాలన్నారు. తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్లాన్‌ను రూపకల్పన చేశామని, రూ.4,170 కోట్ల వ్యయమయ్యే ఈ ప్లాన్‌ను అమృత్ 2 లేదా ప్రత్యేక పథకం కింద చేపట్టాలని సీఎం కోరారు.
కేంద్రీయ విద్యాలయాలు కేటాయించండి: ధర్మేంద్ర ప్రధాన్‌కు సీఎం వినతి
తెలంగాణకు కేంద్రీయ విద్యాలయాలు కేటాయించాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇటీవల రాష్ట్రానికి ఏడు నవోదయ విద్యాలయాలు కేటాయించినందుకు కేంద్ర మంత్రికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో రాష్ట్రానికి ఒక్క కేంద్రీయ విద్యాలయం కూడా కేటాయించలేదని గుర్తు చేశారు.
డీమ్డ్ యూనివర్సిటీల ప్రకటనకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి అని, కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే డీమ్డ్ యూనివర్సిటీలను గుర్తిస్తోందని సీఎం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. డీమ్డ్ యూనివర్సిటీ గుర్తింపునకు రాష్ర్ట ప్రభుత్వం ఎన్‌వోసీ తీసుకునేలా చూడాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు.
సీఎం రేవంత్‌తో కలిసి కేంద్ర మంత్రులను కలిసిన వారిలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, సురేశ్ షెట్కార్, మల్లు రవి, కడియం కావ్య, ఎం అనిల్ కుమార్ యాదవ్, ఢిల్లీలో రాష్ర్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి ఉన్నారు.