calender_icon.png 11 September, 2025 | 5:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లె నారీ పనిలో జయభేరి!

13-12-2024 02:03:34 AM

  1. పెరిగిన మహిళా శ్రామిక శక్తి
  2. రాష్ట్రంలో 54.8% మంది బిజీబిజీ
  3. పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణకు మూడో స్థానం
  4. వెల్లడించిన పీఎల్‌ఎఫ్‌ఎస్ నివేదిక 

హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): గ్రామీణ భారతంలో మహిళా శ్రామిక శక్తి భారీగా పెరిగింది. పనిచేసే మహిళల సంఖ్య జాతీయ స్థాయిలో ఐదేళ్లలో 69 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు ప్రధాని ఆర్థిక సలహా మండలి వెల్లడించింది.

2018 మధ్య దేశంలోని మహిళా శ్రామిక శక్తిపై పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్) పేరుతో తాజాగా నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లో 15 ఏళ్లకు పైబడిన మహిళలు ఎంతమంది పని చేస్తున్నారనే విషయాలను వెల్లడించింది. ఈ నివేదికను పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు.

ఇందులో పెద్ద రాష్ట్రాల వరుసలో ఉన్న తెలంగాణ.. ఎక్కువ మహిళా శ్రామిక శక్తి ఉన్న రాష్ట్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో 66.4 శాతంతో ఛత్తీస్‌గఢ్, రెండోస్థానంలో 55.8 శాతంతో రాజస్థాన్, 54.8 శాతంతో తెలంగాణ మూడోస్థానంలో నిలిచింది.

జార్ఖండ్‌లో భారీగా పెరుగుదల 

2018లో దేశంలో పనిచేసే మహిళలు 24.6 శాతం ఉంటే.. 2023లో 41.5 శాతానికి పెరిగారని నివేదిక స్పష్టంచేసింది. అంటే ఈ ఐదేళ్లలో 69 శాతం వృద్ధి నమోదు కాగా 16.9 శాతం మంది పెరిగా రు. వృద్ధి విషయంలో మాత్రం జార్ఖండ్ జాతీయస్థాయిలో టాప్‌లో నిలిచింది. ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో పనిచేసే గ్రామీణ మహిళ లు కేవలం 15.7 శాతం మాత్రమే ఉన్నారు. 2023 నాటికి ఏకంగా 52.4 శాతానికి పెరిగారు.

ఈ ఐదేళ్లలో 233 శాతం వృద్ధి నమో దైనట్టు నివేదిక పేర్కొంది. తెలంగాణ విషయానికి వస్తే 2018లో 39.2 శాతం మంది ఉంటే ఐదేళ్ల తర్వాత 54.8 శాతానికి పెరిగారు. చిన్న రాష్ట్రాల జాబితాలో ఉన్న ఈశా న్య రాష్ట్రాల్లో మహిళా శ్రామికశక్తి రికార్డు స్థాయిలో పెరిగింది. నాగాలాండ్‌లో 2018 లో 15.7 శాతం మంది ఉంటే.. 2023లో 71.1 శాతం (352 శాతం వృద్ధి) పెరిగారని నివేదిక స్పష్టం చేసింది. మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్‌లో పనిచేసే మహిళలు భారీగా పెరిగినట్టు వెల్లడించింది. 

ఎన్‌ఆర్‌ఎల్‌ఎంతో 26.17 లక్షల మందికి లబ్ధి

కేంద్ర పథకాల వల్లే గ్రామాల్లో పనిచేసే మహిళల సంఖ్య పెరిగినట్టు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ముద్రా రుణాలు, గ్రామీణ ఉపా ధి హామీ పథకం, దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన పథకం కింద స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్న పథకాలు మహిళలకు ఉపాధిని కల్పిస్తున్నాయని చెప్తోంది. రాష్ట్రంలో 4,41,943 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి.

వీటిలో 2024 నాటికి 63 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. 2023 నాటికి రాష్ట్రంలో 47,77,041 మంది మహిళలు సభ్యులుగా ఉన్నట్టు కేంద్ర గణాంకాలు చెప్తోన్నాయి. ఇందులో మెజార్టీ శాతం మందికి కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన పథకంలో భాగంగా జాతీ య గ్రామీణ జీవనోపాధి (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) మిషన్‌ను అమలుచేస్తోంది.

పేదరికంలో ఉన్న మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కేంద్రం ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. దీని కింద సహాయక సంఘాలకు కుట్టు మిషన్లు, కంప్యూటర్లలో శిక్షణ, వ్యాపార నిర్వహణ, సాఫ్ట్ స్కిల్స్‌లో నైపుణ్యాన్ని పెంపొం దించడం ద్వారా ఉపాధి అవకాశాలను అందించే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ పథకాన్ని తెలంగాణలోని గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకున్నట్లు తెలుస్తోంది.

2018-23 దాదాపు 2,617,818 మంది మహిళలు ఈ పథకం ద్వారా ఉపాధిని పొందినట్టు గణాంకాలు చెప్తోన్నాయి. ఇక ముద్ర రుణాల విషయానికి వస్తే.. 2018లో 5.15 లక్షల మంది మహిళలు, 2019లో 7.72 లక్షల మంది, 2020లో 9.05 లక్షల మంది, 2021లో 2.21 లక్షల మంది, 2022లో 3.52 లక్షల మంది, 2023లో 3.83 లక్షల మంది మహిళలు వివిధ వ్యాపారాల నిమిత్తం రుణాలను తీసుకున్నారు.

2018-23 మధ్యలో తెలం గాణలో 61.53 శాతం మంది మహిళలు ఉపాధి హామీ పథకంలో పాల్గొన్నారు. ఇం దులో కొన్ని చిన్న పట్టణ ప్రాం తాల మహిళలు కూడా ఉంటారు మెజార్టీ మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు కేంద్రం స్పష్టంచేస్తోంది. ఈ గణాంకాల ఆధారంగా దేశంతోపాటు రాష్ట్రంలో మహి శా శ్రామిక శక్తి గణనీయంగా పెరిగినట్లు కేంద్రం అభిప్రాయపడుతోంది.

దక్షిణాదిన వివాహితులే అధికం 

దక్షిణాది రాష్ట్రాల్లోని గ్రామాల్లో పెళ్లికాని వారికంటే వివాహితులే పనిచేసే వారి జాబితాలో ఎక్కువగా ఉన్నట్టు నివేదిక చెప్పింది. పని చేస్తున్న వారిలో కూడా కొత్తగా పెళ్లున వారి సంఖ్య ఎక్కువగా ఉందని అభిప్రాయపడింది. అలాగే, పిల్లలు ఉన్న వారికంటే.. పెళ్లు పిల్లలు లేని మహిళలు ఏదో ఒక పని చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారని వివరించింది.