calender_icon.png 25 August, 2025 | 6:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విహారానికి.. చక్కటి డెస్టినేషన్స్

18-05-2025 12:00:00 AM

వేసవిలో చల్లని ప్రదేశం అనగానే గుర్తొచ్చేవి లంబసింగి, అరకులోయలే. పచ్చని పట్టుతివాచీ పరిచినట్లున్న లోయలూ పాలకడలిని తలిపించే మంచుమేఘాలూ పసిడిరంగులో మెరిసే పచ్చని కొండలూ చిక్కని హరిత అరణ్యాలూ.. ఇలా ప్రకృతి అందాలన్నింటినీ ఆస్వాదిస్తూ చల్లచల్లగా గడిపేయాలంటే ఈ టూరిస్ట్ స్పాట్స్ చూడాల్సిందే అంటున్నారు పర్యాటక ప్రియులు. 

గాడ్స్ ఓన్ కంట్రీగా పేరొందిన కేరళలో కొబ్బరితోటలూ బ్యాక్‌వాటర్స్‌తో పాటు కొండకోనలతో అలరాలే మున్నార్‌ని ఒక్కసారయినా చూడకపోతే జీవితం వృథా అని టూరిస్టులు భావిస్తారు. ఎత్తున కొండలూ మబ్బుల్లో విహారాలూ పచ్చని తేయాకు తోటలూ తెల్లని జలపాతాలూ ఎటుచూసినా ప్రకృతి అందాలతో అలరారే పశ్చిమకనుమల అందాలను తనివితీరా ఆస్వాదించాలంటే ఇడుక్కి జిల్లాలోని మున్నార్‌ను సందర్శించాల్సిందే.

అప్పట్లో దక్షిణ భారతంలో బ్రిటిషర్ల వేసవి విడిది ఇదేనట. ముతిరపుళా, నల్లతన్ని, కుండల అనే మూడు నదులు సంగమించే ప్రదేశం మున్నార్. సముద్ర మట్టానికి ఐదు వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం అతిపెద్ద తేయాకు తోటలకు ప్రసిద్ధి. పశ్చిమకనుమల్లోకెల్లా ఎత్తయిన శిఖరమైన అనైముడి ఇక్కడే ఉంది. దేశంలోకెల్లా ఎత్తున ఇడుక్కి ఆర్చ్ డ్యామ్ కూడా ఇక్కడికి సమీపంలోకి ఉంది.

ఎత్తయిన కొండల మధ్యలో ఉన్న మట్టుపెట్టి డ్యామ్ అందాలూ కొండలమీద పచ్చని తివాచీలు పరిచినట్లున్న తేయాకు తోటలూ వాటి చెంతనే ఆకాశాన్ని ముద్దాడే యూకలిప్టస్ వృక్షాలూ కళ్లు తిప్పుకోనీయవు. కొచ్చి, ఎర్నాకుళంల నుంచి రైల్లో లేదా రోడ్డుమార్గానా మున్నార్‌కి చేరుకోవచ్చు. 

పశ్చిమ కనుమల్లో..

చల్లని గాలుల్ని ఆస్వాదిస్తూ పచ్చని అందాల్ని కళ్లు విప్పార్చుకుని చూస్తూ విహరించే భూతలస్వర్గమే చిక్‌మగళూరు. చిక్‌మగళూరు అంటే.. చిన్న కూతురు ఊరు అని అర్థం. సేక్రపట్న రాజైన రుక్మాంగద తన చిన్నకూతురుకు ఆ ఊరిని కట్నంగా ఇవ్వడం వల్ల ఆ పేరు వచ్చిందట. పెద్ద కూతురికి ఇచ్చిన హిరేమగళూరు కూడా ఇక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంది.

హిరే అంటే పెద్ద అని అర్థం. దేశంలో తొలిసారిగా కాఫీ తోటల్ని వేసిన ప్రదేశం చిక్‌మగళూరే. పశ్చిమకనుమల్లో ఈ ప్రదేశం తుంగ, భద్ర నదులకు పుట్టిల్లు. కర్నాటక రాష్ట్రంలోనే అత్యంత ఎత్తున ముల్లాయనగిరి పర్వత శ్రేణులూ, కెమ్మనగుండి, కుద్రేముఖ్, మాణిక్యధార, కల్లథిగిరి జలపాతాలూ, కుద్రేముఖ్ జాతీయ వనం, భద్ర అభయారణ్యాలతో నిండిన ఆ కొండ అందాల్ని చూడ్డానికి రెండు కళ్లూ చాలవు అంటుంటారు సందర్శకులు.

కెమ్మనగుండి ప్రాంతం పూలతోటలతో రమణీయంగా ఉంటుంది. శోలగడ్డి నేలలూ గులాబీతోటలూ కళ్లు తిప్పుకోనీయవు. గుర్రం ముఖం ఆకారంలో ఉన్న కుద్రేముఖ్ పర్వతశ్రేణులూ, జాతీయ ఉద్యానవనం ఆకట్టుకుంటాయి.

సీతలయనగిరికి వెళ్లే మార్గంలోని శివాలయంలో లింగం నిత్యం నీటితోనే ఉంటుంది. ఝరి, హెబ్బే, శాంతి, కదంబి, మాణిక్యధార, కల్లథిగిరి జలపాతాలు, శృంగేరిలోని శారదాపీఠం.. ఇలా ఎన్నో ప్రదేశాల్ని చూసి రావచ్చు. బెంగళూరు, మంగళూరు, కాదూరుల నుంచి రోడ్డుమార్గంలో వెళ్లొచ్చు. 

చల్లటి గాలి కోసం.. 

నీలగిరి పర్వతాల నడుమ సముద్రమట్టానికి సుమారు ఆరువేల అడుగుల ఎత్తులో ఉన్న కొండ ప్రాంతమే తమిళనాడులోని కన్నూరు. మెట్టుపాళ్యం నుంచి ఊటీ మధ్యనడిచే టాయ్ ట్రైన్ కున్నూరు మీదుగా వెళుతుంది. ఆ ప్రయాణం డార్జిలింగ్ మినీ రైలుని గుర్తుతెస్తూ మరోలోకంలో విహరింపచేస్తుంది. లోయలూ పర్వతాలూ చీకటి సొరంగాలూ తేయాకు ఎస్టేట్లూ.. ఇలా దారి పొడవునా ఎన్నో అందాలు కనువిందు చేస్తాయి.

భిన్న పక్షి, జంతు జాతులూ చెట్లతో టోడా తెగ జాతి ప్రజలకు ఆవాసంగా ఉన్న ఈ ప్రదేశాన్ని గ్రీన్ వ్యాలీ అని అంటారు. జపనీస్ శైలిలో నిర్మించిన ఇక్కడి సిమ్స్ బొటానికల్ గార్డెన్‌లో వెయ్యికి పైగా మొక్కల జాతులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న అందమైన సరస్సుతోపాటు వందల ఏళ్ల నాటి చెట్లు.. చల్లగా పలకరిస్తాయి.

కున్నూరులో సేదతీరుతూ సమీపంలోని దూర్గ్ ఫోర్ట్, కటారి ఫాల్స్, సెయింట్ జార్జ్ చర్చి, డాల్ఫిన్స్ నోస్ వంటివన్నీ చుట్టి రావచ్చు. డ్రూగ్ కోటకి పౌరాణిక, చారిత్రక విశిష్టత ఉంది. 18వ శతాబ్దంలో ఈ ప్రాంత రక్షణకోసం టిప్పు సుల్తాన్ అవుట్‌పోస్టు మాదిరిగాగ ఈ కోటను కట్టించాడట.

క్యాథరీన్ ఫాల్స్, అందమైన అమ్మాయి నిద్రపోతున్నట్లున్న స్లీపింగ్ లేడీ వ్యూ, రోజ్ గార్డెన్, దొడ్డబెట్ట శిఖరం, థండర్ వరల్డ్.. ఇలా కున్నూరులో చూడదగ్గ ప్రదేశాలెన్నో. దేశంలో రెండో అతి పెద్ద నివాసిత లోయ అయిన కెట్టి వ్యాలీ ఇక్కడే ఉంది. దీన్నే హిడెన్ వ్యాలీ.. స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని పేరు. టోడా, బడగా.. అనే స్థానిక తెగలు ఇక్కడ ధాన్యం, పండ్లు, కూరగాయలు పండించుకుంటూ జీవిస్తారు. ట్రెక్కింగ్‌కి వెళ్లేవాళ్లకు ఇది అనుకూలమైన ప్రదేశం.