08-01-2026 12:37:02 AM
ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇచ్చిన సీవోఈ
కివీస్‌తో వన్డే సిరీస్ ఆడనున్న వైస్ కెప్టెన్
ముంబై, జనవరి 7: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్ అందించిద. వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అంతర్జాతీయ క్రికెట్ రీఎంట్రీకి లైన్ క్లియర్ అయింది. శ్రేయాస్‌కు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(సీవోఈ) క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ మేరకు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌కు మెయిల్ పంపింది. ఆస్ట్రేలియా టూర్‌లో గాయపడిన తర్వాత ఐసీయూలో ఉండి కోలుకున్న శ్రేయాస్ గతకొంతకాలంగా మైదానానికి దూరమయ్యాడు. ఇటీవలే సీవోఈలో రిహాబిలిటేషన్ ముగించుకున్న శ్రేయాస్‌ను సెలక్టర్లు న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు. అయితే దాదాపు 7 కిలోల బరువు తగ్గడంతో ఫిట్‌నెస్ క్లియరెన్స్ రాలేదు.
విజయ్ హజారే ట్రోఫీలో ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఆడితే క్లియరెన్స్ ఇస్తామని సీవోఈ స్పష్టం చేసింది. దీంతో దేశవాళీ వన్డే టోర్నీ బరిలో దిగిన ఈ స్టార్ బ్యాటర్ అదరగొట్టాడు. టీ20 తరహా హిట్టింగ్‌తో హాఫ్ సెంచరీ చేసి ఫిట్‌గా ఉన్నట్టు నిరూపించుకున్నాడు. దీంతో కివీస్‌తో వన్డే సిరీస్ ఆడేందుకు సీవోఈ నుంచి అనుమతి లభించింది. ఒకవేళ శ్రేయాస్ ఈ సిరీస్‌కు దూరమైతే రుతురాజ్ గైక్వాడ్‌కు చోటు దక్కేది. సౌతాఫ్రికాతో సిరీస్‌లో సెంచరీ చేసిన రుతురాజ్ శ్రేయాస్ ఎంట్రీతో చోటు కోల్పోవాల్సి వచ్చింది. కాగా జనవరి 11 నుంచి భారత్, న్యూజిలాండ్ వన్డే సిరీస్ మొదలుకానుంది.