calender_icon.png 22 August, 2025 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీఎస్టీ రెండు స్లాబులకు మంత్రుల బృందం సై

22-08-2025 01:19:12 AM

  1. ఇకపై 5, 18 శాతం స్లాబులే
  2. సిన్ గూడ్స్‌కు 40% జీఎస్టీ 
  3. తగ్గనున్న వస్తువుల ధరలు
  4.    12% స్లాబులో ఉన్న 99% వస్తువులు 5% స్లాబులోకి.. 
  5. జీఎస్టీ కౌన్సిల్ భేటీలో తుది నిర్ణయం

న్యూఢిల్లీ, ఆగస్టు 21: జీఎస్టీని మరిం త సులభతరం చేసే ప్రతిపాదనలకు మంత్రుల బృందం (జీవోఎం) ఆమోదముద్ర వేసింది. బీహార్ ఉపముఖ్య మంత్రి సామ్రాట్ చౌదరి అధ్యక్షతన గురువారం సమావేశమైన జీవోఎం రెండు స్లాబుల జీఎస్టీ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని సామ్రాట్ చౌదరి గురువారం ప్రకటించారు. త్వరలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సమావేశం కానున్న జీఎస్టీ కౌన్సిల్ కూడా ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర వేస్తే.. రెండు స్లాబుల విధానం అమల్లోకి రానుంది.

ఈ విధానం వల్ల చాలా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ప్రస్తుతం 12 శాతం స్లాబులో ఉన్న చాలా వస్తువులు ఐదు శాతం స్లాబులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పన్ను విధానాన్ని మరింత సరళీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నిర్ణయం వల్ల సామాన్యులు, వర్తకులు మరింత సులువుగా జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసేందుకు వీలు పడనుంది. ప్రస్తుతం జీఎస్టీలో నాలుగు రకాల స్లాబుల కింద పన్నులు విధిస్తున్నారు. 

నాలుగింటి స్థానంలో ఇక రెండే.. 

ప్రస్తుతం జీఎస్టీలో భాగంగా నాలుగు వేర్వేరు స్లాబుల్లో పన్ను వసూలు చేస్తున్నారు. 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం స్లాబులు ఉండగా.. వాటిలో 12 శాతం, 28 శాతం స్లాబులను తొలగించి 5 శాతం, 18 శాతం పేర రెండే స్లాబులు ఏర్పాటు చేయనున్నారు. రెండే స్లాబులు నిర్ణయించడం వల్ల మార్కెట్లో లభ్యమయ్యే వస్తువుల్లో చాలా శాతం మేర వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ప్రస్తుతం 12 శాతం స్లాబ్‌లో ఉన్న అనేక వస్తువులు ఇక 5 శాతం స్లాబ్‌లోకి మారనున్నాయి.

దీంతో వాటిపై విధించే పన్ను తగ్గి వస్తువులు చౌకగా లభించే అవకాశం ఉంది. 28 శాతం స్లాబ్‌లో ఉన్న 90 శాతం వస్తువులు 18 శాతం స్లాబులోకి రానున్నాయి. ‘సిన్ గూడ్స్’ జాబితాలో ఉన్న పొగాకు, లగ్జరీ వస్తువులపై 40 శాతం జీఎస్టీ విధించాలని జీవోఎం నిర్ణయించింది.

జీవోఎంలో సామ్రాట్ చౌదరితో పాటు ఉత్తర్‌ప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి సురేష్ కుమార్ ఖన్నా, రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి గజేంద్ర సింగ్, పశ్చిమబెంగాల్ ఆర్థిక శాఖ మంత్రి చంద్రిమా భట్టాచార్య, కర్ణాటక రెవెన్యూ శాఖ మంత్రి కృష్ణ బైరే గౌడ, కేరళ ఆర్థిక శాఖ మంత్రి బాలగోపాల్ ఈ బృందంలో ఉన్నారు. 

బీమాపై జీఎస్టీ.. ఎటూ తేల్చని వైనం.. 

వ్యక్తులు తీసుకునే జీవిత బీమా పాలసీలపై జీఎస్టీ మినహాయింపు అనే అంశంపై కూడా మంత్రుల బృందం చర్చించింది. మినహాయింపును ఆమోదించారా? లేదా అనేది చెప్పలేదు. ఒక వేళ ఇది ఆమోదం పొందితే.. ఇక వ్యక్తులు తీసుకున్న జీవిత బీమా ప్రీమియంలపై జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ మినహాయింపు వల్ల సర్కారు ఖజానాకు ఏడాదికి రూ. 9700 కోట్ల గండి పడునుందని అధికారులు అంచనా వేశారు. దేశంలోని చాలా రాష్ట్రాలు ఈ ప్రతిపాదనకు మద్దతు తెలుపుతున్నాయి. జీవోఎం నిర్ణయాలను జీఎస్టీ కౌన్సిల్‌కు పంపించారు.