calender_icon.png 8 July, 2025 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ కనుసైగలో గన్‌మెన్ల అత్యుత్సాహం

08-07-2025 01:58:06 AM

  1. ప్రజావాణిలో గిరిజనులకు అవమానం.?

కలెక్టర్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ 

నల్లగొండ టౌన్, జులై 7 :  ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యానికి మృతి చెందిన మహిళ కుటుంబానికి  న్యాయం చేయాలని ఉన్నత అధికారులు  ఒప్పందం ప్రకారం బాధిత కుటుంబానికి అష్టపరిహారం చెల్లించాలని  గిరిజన నాయకులు బాధితుడుతో  ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ను కలవడానికి వస్తే జిల్లా కలెక్టర్ కనుసైగలతో  గన్ మెన్ లు అత్యుత్సాహం చూపి గిరిజన మహిళలను అని చూడకుండా బయటికి నెట్టి వేశారని  సమస్య కోసం వస్తే ప్రజావాణిలో గిరిజనులకు అవమానం జరిగిందని ఆరోపిస్తూ ప్రజావాణి కార్యాలయం ముందు నిల్చోని   జిల్లా కలెక్టర్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిపల్లి మండలం కేశినేని తండాకు చెందిన జటావత్ ఝాన్సీ మొదటి కాన్పు కోసం గత నెల 6 వ తేదీన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులోఅడ్మిట్ అయింది. అయితే ఆమెకు ప్రధమ చికిత్సనందిస్తున్న క్రమంలో  పురిటినొప్పులు రావడంతో పరిశీలించిన డాక్టర్లు స్కానింగ్ రాసి అనంతరం పరిశీలించగా కడుపులోని పాప చనిపోయిందని నిర్ధారించారు.

మృత శిశువును డాక్టర్లు డెలివరీ చేశారు. అనంతరం తల్లి పరిస్థితి విషమించడంతో హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి రెఫర్ చేశారు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 21వ తేదీన  మృతి చెందింది.  ఈ నేపథ్యంలో 13వ తేదీ నల్లగొండ ప్రభుత్వ మహిళా శిశు సంరక్షణ కేంద్రం ఎదుట గిరిజన సంఘాలు  ధర్నా నిర్వహించారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న ఆర్డీవో గిరిజన సంఘాల డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు.

డిమాండ్లను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయపరంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తక్షణ సహాయంగా రూ. 25,000 చెల్లిస్తామని,   బాధిత కుటుంబానికి ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగం కూడా కల్పిస్తామని తెలిపారు. కానీ నెలరోజులైనప్పటికీ ఈ హామీలను నెరవేర్చకపోవడంతో బాధిత కుటుంబం ప్రజావాణిలో కలెక్టర్ ను కలిసి సమస్య వివరించేందుకు వెళ్లారు.అయితే కలెక్టర్ స్పందించకుండా వారిని బయటకు పంపించమని తన సిబ్బందికి  ఆదేశించారని వారు ఆరోపిస్తున్నారు.

ఈ సందర్భంగా  మహిళా హక్కుల జిల్లా అధ్యక్షురాలు పున్ని బాయ్ మాట్లాడుతూ తనను గిరిజన మహిళగా గుర్తించకుండా ఇద్దరు గన్మెన్లు చేతులు పట్టుకొని బయటకు నెట్టివేశారు అని ఆరోపించారు. ప్రజావాణిలో కూడా మహిళలకు భద్రత లేకపోవడం విచారకరం అన్నారు. కలెక్టర్ పై కేసు వేస్తామని వారి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి అని పేర్కొన్నారు.

లంబాడా హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకుడు గణేష్ నాయక్ మాట్లాడుతూ పాప మరణించిన  మరునాడే  ఝాన్సీ మృతి చెందిందని నల్లగొండ డాక్టర్లు మాకు మభ్యపెడుతూ  గాంధీ ఆసుపత్రి  డాక్టర్లతో కుమ్మక్కై వెంటిలేటర్  శ్వాసను ఆడిస్తూ  నాటకమాడి 21వ తేదీన  మృతి చెందినట్లు చిత్రీకరించారని తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్న ప్రభుత్వ డాక్టర్లపై  చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.