calender_icon.png 21 December, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్‌రెడ్డితో ప్రజలు ఫుట్‌బాల్ ఆడుకోవడం ఖాయం

21-12-2025 12:53:01 AM

స్థానిక సంస్థల్లో బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ 

దమ్ముంటే పార్టీ మారిన 

ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి 

ఇకపై నేరుగా ప్రజల్లోకి వచ్చి కేసీఆర్ పోరాటం 

ముమ్మాటికీ రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీలు ఐరన్ లెగ్‌లు 

చిట్‌చాట్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి ఎవరితోనైనా ఆడుకోవచ్చు కానీ, ఆయనతో తెలంగాణ ప్రజలు ఫుట్‌బాట్ ఆడుకోవడం ఖాయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశా రు. రేవంత్‌రెడ్డి మాదిరిగా కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగడం తమ సంస్కృతి కాదని తెలిపారు. తెలంగాణ భవన్‌లో శనివారం మీడియా ప్రతినిధులతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. రేవంత్‌రెడ్డి మాదిరి కుటుంబ సభ్యుల విషయంలో ‘నేను చిల్లర రాజకీయా లు చేయను’ అనిని, రాజకీయంగా మాత్రం రేవంత్‌రెడ్డిని వదిలిపెట్టేది లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు.

పార్టీల పరంగా 42 శాతం రిజర్వేషన్ ఇచ్చే అంశంపై రేవంత్‌రెడ్డికి సంబంధమే లేదని, ఆయన సొంత పార్టీతో పాటు ఇతర పార్టీలకు అధ్యక్షుడు కాదని కేటీఆర్ అన్నారు. అసలు బీసీలను మోసం చేసి నందుకు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగానే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఎందుకు ప్రవేశపెట్టడం లేదని ప్రశ్నించారు. విద్యా, ఉపాధి, కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి చట్టంతో సంబంధం లేదని, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తోనే ఇవ్వవచ్చని, కానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం లేదని ధ్వజమెత్తారు. 

కాంగ్రెస్, బీజేపీ మధ్య చీకటి స్నేహం

కాంగ్రెస్, బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీలో బీజేపీ ఎంపీ దూబే గృహప్రవేశానికి రేవంత్‌రెడ్డి ఎందుకు వెళ్లారో బీజేపీ నాయకుడు రామచంద్రరావు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఏటీఎంగా మా రిందని, ఇక్కడ ‘ఆర్‌ఆర్ ట్యాక్స్’ నడుస్తోందని సాక్షాత్తు ప్రధాని, హోంమంత్రి అన్నా కూడా బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అఖిలేష్ యాదవ్ తమకు మొద టి నుంచి మిత్రుడని, ఆయనతో కలిస్తే బీజేపీ నేతలకు ఎందుకు బాధ అని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి వల్ల ఎవరికీ లాభం లేదని కేటీఆర్ అన్నారు.

బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఆఫీసులో కూర్చుని ‘మేము బీఆర్‌ఎస్‌లోనే ఉన్నాం’ అని అనడం పెద్ద కామెడీ అని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. పథకాల పేర్ల మార్పు విషయంలో బీజేపీ, కాంగ్రెస్ రెండూ దొందు దొందే అన్నారు. ఉపాధి హామీ చట్టానికి పేరు మార్పిడిపై గగ్గోలు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలోనూ అదే ధోరణి కొనసాగిస్తున్నదన్నారు. 

కేసీఆర్ దిశానిర్దేశం భవిష్యత్ కార్యాచరణ

కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న హనీమూన్ పీరియడ్ ముగిసిందని, ఇకపై కేసీఆర్ నేరుగా ప్రజల్లోకి వస్తారని కేటీఆర్ ప్రకటించారు. ఆదివారం జరిగే రాష్ట్ర స్థాయి సమావేశంలో కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. భవిష్యత్ కార్యా చరణపైన నేటి సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత భారీ ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మున్సిపాలిటీల విలీనం ప్రక్రియలో స్థానిక ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదన్నారు. హైదరాబాద్ నగర విభజన అంశం ప్రజలకు, పార్టీ లకు, ప్రభుత్వ అధికారుల కన్నా ముందే రేవంత్‌రెడ్డి మిత్రులకు తెలుస్తోందన్నారు.

2028లో బీఆర్‌ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాత్రం స్థానిక ఎన్నికల్లో బలంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చారని గుర్తించాలన్నారు. తాను వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత అనేక స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించానని అన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా జరిగిన దాదాపు అన్ని ఉప ఎన్నికల్లో కాంగ్రె స్ ఓడిపోయిందని ఎద్దేవా చేశారు. ఇక ఓటముల విషయానికి వస్తే రాహుల్ గాంధీ ఎన్ని చోట్ల విజయాలు సాధించారో రేవంత్‌రెడ్డి చెబితే బాగుంటుందన్నారు. ముమ్మా టికీ రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ ఐరన్ లెగ్‌లు అన్నారు.