05-05-2025 01:44:31 AM
పటాన్ చెరు/చేగుంట, మే 4 :సంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఆదివారం నాడు వడగండ్ల వాన కురిసింది. దీంతో ధాన్యం తడిసిముద్దయింది. పటాన్ చెరు, అమీన్ పూర్, జిన్నారం మండలాలలో ఆదివారం సాయంత్రం వడగండ్ల వాన దంచికొట్టింది. భారీ ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వానతో వాతావరణం చల్లబడింది.
మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన వడ్లు తడిచిపోయాయి. వర్షం నుంచి వడ్లను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు. వ్యవసాయ పొలాలలో వడగండ్ల వానకు ధాన్యం నేలరాలింది. కోత కోసే సమయంలో వడగండ్ల వాన తమకు తీవ్ర నష్టం చేకూర్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈదురు గాలులకు మామిడి కాయలునేలరాలాయి.
చేగుంటలో... చేగుంట మండలంలోని చందాయిపేట, మక్కారాజ్ పేట్, పోతన్పల్లి, కసన్ పల్లి, పెద్ధశివనూర్ గ్రామాలలో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కురవడంతో కల్లాలో ఎండబెట్టిన వడ్లు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. వర్షానికి ధాన్యం నీళ్లలో కొట్టుకుపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకునే సమయానికి ఇలా వర్షానికి కొట్టుకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు, స్పందించి తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి కొట్టుకుపోయిన వడ్లను, పంటలను, క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపరిహారం ఇవ్వాలని రైతులుకోరుతున్నారు.