12-01-2026 03:38:36 PM
హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ వరంగల్ జిల్లాలను కలిపి వరంగల్ జిల్లాగా పునర్ నిర్మించాలని ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్ అన్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాలను కలిపి ఒకే జిల్లాగా పునర్ నిర్మించాలని ఏర్పాటుచేసిన సమావేశానికి కూరపాటి వెంకటనారాయణ అధ్యక్షత వహించగా వివిధ రాజకీయ పార్టీల సంబంధించిన నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పుల్లూరు సుధాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం తెలంగాణ పది జిల్లాలను 33 జిల్లాలుగా అశాస్త్రీయంగా విభజించి, జిల్లాల పునర్వ్యవస్థీకరణకు శాస్త్రీయమైన ప్రాతిపదిక లేకుండా, ఎటువంటి మార్గదర్శకాలను వెలువరించకుండా, చట్టాలు నిర్దేశించిన సూత్రాలను పట్టించుకోకుండా, సమగ్ర డాటాబేస్ లేకుండా చిన్న రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా చేసిన విభజన జిల్లాలలో సహజ వనరులు, మానవ వనరుల సమతుల్యతను దెబ్బతీసిందన్నారు.
పరిపాలనకు, పౌరసేవల నిర్వహణకు భంగం కలిగేలా, తెలంగాణ జిల్లాల పునర్వ్యస్థీకరణ నోటిఫికేషన్లో వివరించిన మెరుగైన పరిపాలన, పరిపాలన సౌలభ్యం అన్న లక్ష్యాలకు విరుద్ధమైన మార్పులు, రాజకీయ అవసరాలే జిల్లాల విభజన ప్రాతిపదికను నిర్దేశించి అన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ జనాభా, సహజ వనరులు, మానవ వనరుల సమతుల్యత, భౌగోళిక సామీప్యతతో పాటుగా ఆ ప్రాంతాల సాంస్కృతిక, చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని జరగాలని పరిపాలన సంస్కరణల నివేదికలు సూచించినా కానీ అలా జరుగలేదన్నారు.
కొత్త జిల్లాలు చాలా వరకు కొంత మేర “రియల్ ఎస్టేట్” అభివృద్ధికే పరిమితమయ్యాయనీ, భూమికి డిమాండ్ పెరిగి మధ్య, పేద వర్గాల స్వంత ఇంటి కల నెరవేరక,ఎవరూ అడగని జిల్లాల విభజనతో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. మాజీ మేయర్ డాక్టర్ టి.రాజేశ్వరరావు మాట్లాడుతూ... అభివృద్ధికి ఆటంకంగా, ఆశాస్త్రీయంగా నగరాలను విడగొట్టడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి అమృత్ సిటీ, స్మార్ట్ సిటీ నిధులను ఏ విధంగా విభజించి గ్రేటర్ వరంగల్ ను అభివృద్ధి చెందించాలో తెలువక గ్రేటర్ వరంగల్ అధికారులు తల పట్టుకున్న పరిస్థితి ఎదురవుతుందన్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి పట్టణాన్ని విడగొట్టకుండా అభివృద్ధి పథంలో ముందుకెళ్లే విధంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి, రావు అమరేందర్ రెడ్డి, సంగాని మల్లేశ్వర్, సోదా మ్మూర్తి, రిటైర్డ్ ప్రొఫెసర్ వడ్డే రవీందర్, సదానందం, కూరాకుల భారతి, సాయిని నరేందర్, శ్రీధర్ల ధర్మేంద్ర, బాబురావు, టీఎన్జీవో నాయకులు జగన్మోహన్ రెడ్డి, రాజేష్,ఆకుల రాజేందర్, డాక్టర్ రావుల జగదీశ్వర్ ప్రసాద్, బిజెపి నాయకులు శ్రీనివాసరావు గౌడ్, రావుల కోమల కిషన్, నల్లాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.