calender_icon.png 31 December, 2025 | 7:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కివీస్‌తో వన్డేలకు హార్థిక్, బుమ్రా దూరం

30-12-2025 12:12:53 AM

  1. టీ20 ప్రపంచకప్ దృష్ట్యా విశ్రాంతి
  2. తెలుగు ప్లేయర్‌కు ఛాన్స్

ముంబై, డిసెంబర్ 29 : సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరగనున్న సిరీస్‌కు ముందు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కివీస్‌తో వన్డే సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్స్ హార్థిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతినివ్వనున్నట్టు సమాచారం. టీ20 ప్రపంచకప్ దృష్ట్యా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా వారిద్దరికీ రెస్ట్ ఇవ్వాలని డిసైడయింది. అయితే వన్డే సిరీస్‌కు దూరమైనప్పటకీ వీరిద్దరూ ఐదు టీ20ల సిరీస్ ఆడనున్నారు. టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్ ఆడే చివరి సిరీస్ ఇదే.

ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ వీరిద్దరూ ఆడలేదు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో మాత్రం ఆడారు. కాగా హార్థి క్ పాండ్యా ఈ ఏడాది మార్చిలో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత ఇప్పటి వరకూ ఒక్క వన్డే ఆడలేదు. అలాగే బుమ్రాను కూడా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా టీ20, టెస్ట్ సిరీస్‌లకే పరిమితం చేస్తున్నారు. పాండ్యా టీ20ల్లో అదరగొడుతుంటే.. బుమ్రా టెస్టుల్లో సత్తా చాటుతున్నాడు.

ఇది లా ఉంటే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు పాండ్యా దూరమైతే ఆంధ్రా క్రికెటర్ నితీశ్ కుమార్‌రెడ్డికి చోటు దక్కే ఛాన్సుంది. కివీస్‌తో వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ఆరంభం కానుండగా.. కెప్టెన్ శుభమన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ సిరీస్ కోసం భారత జట్టును ఈ మరో నాలుగు రోజుల్లో ప్రకటించనున్నారు.