30-09-2025 12:00:00 AM
విజయక్రాంతి ఇంటర్వ్యూ లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరీ శంకర్ ముదిరాజ్
సిద్దిపేట, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలలో సిద్దిపేట జిల్లాను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందనీ పార్టీ జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ వెల్లడించారు. పదేళ్ల ప్రభుత్వంలో సిద్దిపేటలో జరిగిన అభివృద్ధితోపాటు మేజర్ ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మాణంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన అవినీతి జిల్లాలో బీజేపీకి కలిసొచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ జిల్లాలో అధికార పార్టీకి క్యాడర్ లేకపోవడం, ఉన్న నాయకులు, కార్యకర్తలు మూడు ముక్కలుగా చీలిపోవడంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు కార్యకర్తలు సుముఖంగా లేరని ఆయన ఆరోపించారు. 6 గ్యారంటీలు అమలు చేయకపోవడం, రైతులకు యూరియా పంపిణీలో విఫలం, రేషన్ కార్డు ఇవ్వడం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వంతు అయితే ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తుంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అని పేర్కొన్నారు.
ఇలాంటివి కాంగ్రెస్ పార్టీ బలహీనతలు బీజేపీకి అనుకూలం అవుతున్నాయని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ప్రతిపాదనను, జీవోను స్వాగతిస్తూ బీజేపీ మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. దొరల పాలనలో రెడ్ల ఆదిపత్యం వహించిన సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు సంకెళ్లు తెంచుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
గజ్వేల్ నియోజకవర్గంలో మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కావడం, స్థానిక బిఆర్‌ఎస్ నాయకులు ఎవరికి వారీగా వ్యవహరించడం, హరీష్ రావు గజ్వేల్ నియోజకవర్గంలో ఆదిపత్యం చేయించడంతో ఆయన పనితీరు అనేకమంది నాయకులకు, కార్యకర్తలకు నచ్చకపోవడం ఒక భాగమన్నారు. కాంగ్రెస్ పార్టీలో డిసిసి అధ్యక్షుడు నర్సారెడ్డి సొంత నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉండటంతో బీజేపీకి కలిసొస్తుందని వ్యాఖ్యానించారు.
గజ్వేల్ నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేయడం వల్ల పార్టీ బలపడిందనీ, అనేక మంది నాయకులు బీజేపీలో చేరారని, ముంపు గ్రామాల ప్రజలు బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గం పూర్తిగా బీజేపీదే అవుతుందని, ఎంపీ రఘునందన్ రావు కృషితో ఆ నియోజకవర్గం కేంద్ర నిధులతో అభివృద్ధి సాధిస్తోందన్నారు.
బి ఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడే బీజేపీ నుంచి రఘునందన్ రావు ను ఎమ్మెల్యే గా గెలిపించి దుబ్బాక ప్రజలు బిజెపికి పట్టుకొమ్మలాగా నిలిచారని, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఎవరిని గుర్తు పట్టారనేది ఆయన సొంత పార్టీలో ఉన్న వ్యతిరేకత, అసంత్రుప్తి బీజేపీ నీ గెలిపిస్తాయని చెప్పారు.
హుస్నాబాద్ నియోజకవర్గం మొదటి నుంచి బీజేపీకి పట్టుకొమ్మలాగా ఉందని, ఇద్దరు ఎంపీల సహకారంతో జిల్లా సంపూర్ణ స్థాయిలో మెజార్టీ స్థానాలను సాధించి జడ్పీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీ పార్టీని మరింత బలపరుస్తాయని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇద్దరు అభ్యర్థులు ఈ ప్రాంతం నుంచి గెలుపొందడం బీజేపీ బలోపేతానికి శుభసూచకమని, అదే స్ఫూర్తితో సిద్దిపేట జిల్లా బీజేపీ కైవసం అవుతుందని బైరి శంకర్ ముదిరాజ్ ధీమా వ్యక్తం చేశారు.