11-10-2025 08:11:31 PM
300 ఎకరాల్లో పంట దిగుబడిపై ప్రభావం..
సమస్య పరిష్కారం కోసం రైతుల ఎదురుచూపులు..
కోదాడ: కోదాడ మండలంలోని కూచిపూడి గ్రామంలో చింట్లు సీడ్ రకం వరి విత్తనాల్లో కల్తీ విత్తనాలు వచ్చాయని పరిశీలనకు వచ్చిన కంపెనీ ప్రతినిధులపై బాధిత రైతులు శనివారం ఆందోళనకు దిగారు. గ్రామంలో దాదాపుగా 150 మంది రైతులు 300 ఎకరాల్లో బెరుకులు ఈ విధంగానే ఉన్నాయని పేర్కొన్నారు. శనివారం పంట పరిశీలనకు ఆయా కంపెనీల డీలర్లు వచ్చారు. న్యాయం చేయాలని కోరితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆరోపిస్తూ రైతులు వారిపై దాడికి దిగారు. వారి నుంచి కారును స్వాధీనం చేసుకున్నారు. సీడ్ డీలర్, డిస్ట్రిబ్యూటర్లు వచ్చి న్యాయం చేసిన తర్వాతే కారు ఇస్తామని రైతులు తెలిపారు. కల్తీ వరివిత్తనాలు అంటగట్టి, తమను మోసం చేశారని రైతులు వాపోయారు. కోదాడకు చెందిన ముగ్గురు విత్తన దుకాణాదారులకు, సంబంధిత డీలర్లకు గతం వారం రోజులుగా చెబుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
వరి సాగు పొట్టదశకు రావడంతో ముందుగా బెరుకులు ఈతకు వచ్చాయని అవి దొడ్డురకంగా ఉన్నాయని తెలిపారు. ఈ విధంగా బెరుకులు రావడంతో ఎకరానికి 5 బస్తాల దిగు బడిపై ప్రభావం పడుతుందన్నారు. అధికారులకు గత రెండు సంవత్సరాలుగా కల్తీ విత్తనాల గురించి చెబుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ వరి విత్తనాలు సాగుచేసిన రైతుల సమస్యలు పరిష్కరించాలని రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు శిరంశెట్టి రామారావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శిరంశెట్టి రవి, నాగేశ్వరరావు, శెట్టి శ్రీనివాస రావు, చాప సురేష్, కొండ, రమణ, తిరపతిరావు చేతుల రామకష్ణ, తెల్లగొర్ల రామకష్ణ, రామారావు, చందర్ రావు, రాజేష్, మధు పాల్గొన్నారు.