calender_icon.png 25 December, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాకంటే పెద్ద పదాలు ఎవరూ వాడలేదా ?!

25-12-2025 01:38:20 AM

‘దండోరా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల వస్త్రధారణపై నటు డు శివాజీ చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో  శివాజీ తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. 

ఏం జరిగిందంటే..  

ఇటీవల హీరోయిన్లు నిధి అగర్వాల్, సమంత వేర్వేరుగా ఈవెంట్లకు హాజరైన సందర్భంలో ఫ్యాన్స్ అత్యుత్సా హంతో ఇబ్బందిపడ్డారు. మరోవైపు నటుడు శివాజీ ‘దండోరా’ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో సోమవారం రాత్రి నిర్వహించగా, శివాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరోయిన్ల దుస్తులను ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళలు, పలు సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో శివాజీ క్షమాపణలు చెప్తూ ఓ వీడియో బైట్ విడుదల చేశారు. బుధవారం కూడా విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి, వివరణ ఇచ్చారు. 

నా స్టేట్‌మెంట్‌కు కట్టుబడే ఉన్నా.. 

శివాజీ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. “నేను ఆ రోజు స్టేజీపై ఉన్న నాతోటి నటీనటులకు, ఆడబిడ్డలకు క్షమాపణలు చెబుతున్నా. ఆ రెండు పదాలను మాట్లాడకుండా ఉండాల్సింది. ఆ విషయంలో చాలా బాధపడ్డా. ఆ రెండు పదాలకు మీ అందరికీ సిన్సియర్‌గా క్షమాపణలు చెబుతున్నా. అయితే, నేను ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు మాత్రం కట్టుబడే ఉన్నా. దాంట్లో ఎవరికీ భయపడేది లేదు.

సినిమాల్లో ఎలాగైనా చేసుకోవచ్చు.  కట్టూ బొట్టు పాటించకుండా బయటకు వస్తే ఇబ్బందులకు గురవుతారని ఎంతో మంది పెద్దవాళ్లు, సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన ఉన్నవాళ్లు పదేపదే చెబుతూ వచ్చారు.  ఇటీవల నిధి అగర్వాల్ పడ్డ వేదన. సమంత అలాంటి ఇబ్బందే పడ్డారు. మీరు కప్పేసుకోండని ఎవరికీ చెప్పలేదు. సమాజంలో ఏ రుగ్మత వచ్చినా.. సినిమా వల్లనే నాశనం అవుతుందంటున్నారు. ఎవరూ అలా అనకూడదనే ఆలోచనతో మాట్లాడానంతే. 

ట్వీట్స్‌ను వాళ్లకు ట్యాగ్ చేస్తున్నారేం? 

ట్వీట్స్ చిన్మయికి, అనసూయకి ట్యాగ్ చేస్తున్నారు. ఎందుకో నాకు అర్థం కాలేదు. నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. నాకంటే పెద్ద పదాలను ఎవరూ వాడలేదా? నన్నే ఎందుకు మీరు?! ఉమెన్ కమిషన్ వాళ్లు డిసెంబర్ 27న రమ్మన్నారు.. వెళ్లి క్షమాపణ లేఖ ఇస్తాను. నేనేం సిగ్గు పడను. నన్ను తప్పు పడుతున్నవారు కూడా భవిష్యత్తులో ఇబ్బందిపడే సందర్భం రావొచ్చు.. అప్పుడు వాళ్లకు అండగా ఉండటం ద్వారా వారి రుణం తీర్చుకుంటా” అని శివాజీ అన్నారు. 

మీరు బొట్టు, మెట్టలు పెట్టుకోవాలిగా?!: చిన్మయి

తెలుగు నటుడు శివాజీ అసభ్య పదజాలంతో హీరోయిన్లకు అక్కర్లేని సలహా ఇచ్చాడు. ఆయన వాడిన పదాలను ఎక్కువగా పోకిరీలే మాట్లాడతారు. ఓ మంచి సినిమాలో విలన్‌గా నటించి.. పోకిరీలకు హీరోగా మారాడు.

బహిరంగ ప్రదేశాల్లో శివాజీ లాంటి నటుడు దరిద్రపు ముండ అనే పదాలు వాడుతున్నాడు. ఆయన మాత్రం చక్కగా జీన్స్, హూడీ ధరించి ఈవెంట్‌కు వచ్చాడు. మరి శివాజీ చెబుతున్న దాన్ని బట్టి సాంప్రదాయం ప్రకారం ధోతీ కట్టుకుని రావాలి కదా? శివాజీకి పెళ్లయి ఉంటే కంకణం ధరించి బొట్టు, మెట్టెలు కూడా పెట్టుకోవాలి కదా. అసలు మహిళలను వీరంతా ఇలా చూస్తున్నారంటే నమ్మలేకపోతున్నా. శివాజీ క్షమాపణలు చెప్పాలి. 

దాన్నే అతి తెలివి అంటారు: నిధి అగర్వాల్ 

హీరోయిన్లు పద్ధతిగా చీర కట్టుకోవాలని.. గ్లామర్ పేరు తో సామాన్లు ప్రదర్శించొద్దంటూ శివాజీ చేసిన వ్యాఖ్యలపై మహిళా నటులు భగ్గుమంటున్నారు.  సింగర్ చిన్మయి శ్రీపాద, యాంకర్, నటి అనసూయ ఫైర్ అయ్యారు. ఈ మేరకు సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.

హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా స్పందించారు. ‘బాధితులపై తప్పు నెట్టడాన్నే అతి తెలివి అంటారు’ అని నిధి అగర్వాల్ తన పోస్టులో పేర్కొన్నారు. అనసూయ తొలుత ‘నా బాడీ నా ఇష్టం’ అంటూ శివాజీ పేరెత్తకుండా కౌంటర్ ఇచ్చారు. బుధవారం శివాజీ ప్రెస్‌తో మాట్లాడిన తర్వాత అనసూయ మరోమారు ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆమె సోషల్‌మీడియాలో వీడియోను పంచుకున్నారు. 

పాపం ఆయనకు అదే కావాలి: అనసూయ

శివాజీ ఒక్కరే వచ్చి బాధితుడిగా నటిస్తున్నారు. ఆయన వ్యవహార శైలి ‘నార్సిసిస్ట్’లా ఉంది. దీన్నే అతి తెలివి అంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. చేతగానితనం తో మాట్లాడుతున్నారు. ఫేక్ ఫెమినిస్టులమని మాపై ముద్ర వేస్తారు. అసలు ఫెమినిజం అనేదే లేదు. ఇక్కడ అందరికీ సమాన హక్కులు ఉండాలి. స్త్రీ, పురుషులు ఉంటేనే ప్రకృతి ముందుకు వెళ్తుంది.

ఈ కాలంలో కూడా దుస్తుల గురించి మాట్లాడటం చేతగానితనం. స్వీయ నియంత్రణ లేనివాళ్లు, అభద్రతాభావంతో బతికేవాళ్లే ఎదుటివాళ్లపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు. ఈరోజు సానుభూతి పోగుచేసుకొని ఒక్కరే మీడియా ముం దు కూర్చున్నారు. పాపం ఆయనకు అదే కావాలి. నేను కూడా హీరోయిన్‌నే. ఒకట్రెండు సినిమాల్లో లీడ్ రోల్ చేశా. హీరోయిన్లు మంచిగా బట్టలు వేసుకోవాలని చెప్తున్నారు.

మీరు ఏం వేసుకోవాలో నేను చెప్తున్నానా? మేం చిన్నపిల్లలం కాదు. మా హక్కులు మాకు తెలుసు. మా ఇష్టానికి మమ్మ ల్ని బతకనీయండి. చాలా మంది హీరోయిన్లలాగే నేనూ గ్లామర్‌గా ఉండాలనుకుంటున్నా. మీరు మాత్రమే తెలివిగలవాళ్లు అనుకుంటే, సృష్టికర్తలైన మాకు ఇంకెంత తెలివి ఉంటుంది. మీ స్థాయి ఏంటో చూపించడానికి మేమంతా కంకణం కట్టుకుంటే ఏమవుతుంది.

ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మీరు మాట్లాడిందే మీ అసలు స్వరూపం. హీరోయిన్స్ ఇబ్బంది పడుతున్నారని మీరు భావిస్తే.. ‘ఒరేయ్ జంతువుల్లా అలా మీద పడటం ఏంటి? మహిళలను గౌరవించండి’ అని అక్కడికి వచ్చే యవకులకు చెప్పండి. దుస్తులు ఎలా వేసుకోవాలో ఎక్కడైనా రాసి ఉందా? శివాజీ గారు మర్యాదగా చెప్తున్నా.. మీరు త్వరగా మేలుకోండి.

నాకు మీ సపోర్ట్ అక్కర్లేదు. నన్ను నేను ఎలా రక్షించుకోవాలో తెలుసు. నన్ను బాగా చూసుకునే భర్త, స్నేహితులు ఉన్నారు. మీలాంటి వాళ్ల సాయం అస్సలు అక్కర్లేదు. ఇప్పుడు నాపై కామెంట్లు చేసినవారితోపాటు ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన పెద్ద మనిషికి కూడా చట్టపరంగా నోటీసులు వస్తాయి.