24-05-2025 12:00:53 AM
-వేధింపుల కారణంగా ఓ వైద్యుడి రాజీనామా
-అవినీతి, ఆరోపణల నేపథ్యంలో వరుస కథనాలు
-నేడో రేపో జనరల్ ఆస్పత్రి సందర్శనకు రాష్ట్ర ఉన్నతాధికారులు
నాగర్ కర్నూల్ మే 23 ( విజయక్రాంతి ): నాగర్ కర్నూల్ జనరల్ ఆసుపత్రిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు, వసతుల కొరత, సూపరిండెండెంట్ తోపాటు రోగుల నుండి ఒత్తిడి నేపథ్యంలో ఓ వైద్యుడి రాజీనామా చేయడంతో వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్ అయింది.
ఆస్పత్రిలో కొరవడిన వసతులు నేపథ్యంలో రోగుల నుంచి వైద్యులు కూడా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని సంబంధిత అంశాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పరిష్కరించకపోవడంతో పాటు చిత్కారాలు ఎదురవడంతో ఇక్కడ పనిచేయలేమంటూ ఎముకల వైద్య నిపుణులు అఖిల్ అనే వైద్యుడు గురువారం రాజీనామా చేశాడు.
కనీస సౌకర్యాలు మరుగుదొడ్లు మూత్రశాలల్లో నీటి వసతి కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని రోగులు వాపోయారు. గైనకాలజీ ఆర్తో సాధారణ సర్జరీ విభాగాలకు సంబంధించి రెండు మాత్రమే ఆపరేషన్ థియేటర్లు ఉండడంతో రోగులకు సరిపోవడంలేదని ప్రస్తుతం సిద్ధంగా ఉన్న ఆపరేషన్ థియేటర్లను ప్రారంభించాలని పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని ఆయా విభాగాల ప్రొఫెసర్లు ఆరోపిస్తున్నారు.
దీంతోపాటు ఆరోగ్యశ్రీ నిధులు, ఆసుపత్రి అభివృద్ధి కోసం విడుదలైన నిధులను గోల్మాల్ జరిగినట్లు విమర్శలు ఉన్నాయి. ఎస్జీఎఫ్ నిధుల పేరుతో సామాన్య రోగుల నుంచి బలవంతంగా డబ్బులు కూడా వసూలు చేస్తున్నట్లు విజయక్రాంతితో పాటు పలు పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి.
అయినా జిల్లా ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో వైద్యులు కూడా చేసేదేం లేక రాజీనామాకు సిద్ధమవుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ నేపద్యంలో గురువారం ఓ వైద్యుడు ఒత్తిడి తట్టుకోలేక రాజీనామా చేయడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నత అధికారులు దృష్టి సారించారు. నేడో, రేపో జిల్లా జనరల్ ఆసుపత్రిని సందర్శించి సమగ్ర నివేదిక ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలుస్తోంది.