calender_icon.png 17 January, 2026 | 8:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హీటెక్కిన రాజకీయం

17-01-2026 02:30:34 AM

  1. బల్దియాల్లో తేలిన వార్డుల రిజర్వేషన్ 

చైర్మన్ పదవుల రిజర్వేషన్‌పై ఉత్కంఠ 

ఎన్నికలపై ఎమ్మెల్యే మల్లారెడ్డి ఫోకస్

మేడ్చల్, జనవరి 16 (విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లాలో మూడు మున్సిపాలిటీలలో రాజకీయం వేడెక్కింది. తుది ఓటరు జాబితా విడుదల చేయడమే గాక వార్డుల రిజర్వేషన్ ఖరారు చేయడంతో రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. రెండు మూడు రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని నాయకులు భావిస్తున్నారు. వార్డుల రిజర్వేషన్ ప్రకటించినప్పటికీ ఏ వార్డు ఏ వర్గానికి రిజర్వేషన్ అనేది ఇంకా ఖరారు చేయలేదు. చైర్మన్ పదవుల రిజర్వేషన్ ఉత్కంఠ కొనసాగుతోంది. అధికార యంత్రాంగం సైతం ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

జిల్లాలో ఎల్లంపేట, అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇవి ఇటీవల కొత్తగా ఏర్పడ్డాయి. అలియాబాద్ మున్సిపాలిటీలో 20454 మంది ఓటర్లు ఉన్నారు. 20 వార్డులకు 40 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో 22831 మంది ఓటర్లు ఉన్నారు. 24 వార్డులకు 48 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. ఎల్లంపేట మున్సిపాలిటీలో 25581 మంది ఓటర్లు ఉన్నారు. 24 వార్డులకు 48 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. దూకుడు మీద ఉన్న బీఆర్‌ఎస్‌అధికార పార్టీ కంటే ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలో దూకుడు కనిపిస్తోంది.

క్యాడర్లో ఉత్సాహం వెళ్లి విరుస్తోంది. మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. క్యాడర్లో ఉత్సాహం నింపడమే కాకుండా, ప్రజలతో దగ్గరయ్యేందుకు కార్యక్రమాలు చేపడుతున్నారు. సంక్రాంతి సందర్భంగా అన్నిచోట్ల ముగ్గుల పోటీలు నిర్వహించి మహిళలను ఆకర్షించారు. సీఎంఆర్ కప్పు పేరిట క్రికెట్ పోటీలు నిర్వహించి యువతకు దగ్గరవుతున్నారు. మూడు మున్సిపాలిటీలు గ్రామీణ వాతావరణంలో ఉన్నాయి. రైతులు ఎక్కువగా ఉన్నారు. చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఈ అంశాన్ని రైతుల్లోకి తీసుకెళ్తున్నారు.

కాంగ్రెస్ లో సమన్వయ లోపం ప్రతిపక్ష బీఆర్‌ఎస్ తో పోలిస్తే అధికార కాంగ్రెస్ వెనుకబడింది. క్యాడర్ కు దిశా నిర్దేశం చేయడంలో నియోజకవర్గ నాయకులు వెనుకబడిపోయారు. కార్యకర్తలకు నాయకులకు మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. ఇటీవల మొక్కుబడిగా సమావేశాలు ఏర్పాటు చేశారు. నాయకుల తీరుపై కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నాయకులు మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కార్యకర్తలు కోరుతున్నారు.బిజెపిలో నాయకత్వ సమస్య మున్సిపల్ ఎన్నికల సన్నాహాల్లో బిజెపి వెనుకబడింది.

బిజెపిలో నాయకత్వ సమస్య స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిదానికి ఎంపీ ఈటెల రాజేందర్ మీద ఆధారపడుతున్నారు. జిల్లా, నియోజకవర్గ నాయకులు అంతగా పట్టించుకోవడం లేదు. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఎంపీ ఈటల రాజేందర్ 15 రోజుల క్రితం ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎల్లంపేట మున్సిపాలిటీకి సంబంధించి కార్యకర్తల సమావేశం ఈనెల 18న ఏర్పాటు చేశారు. నాయకుల వైఖరిపై కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.