17-01-2026 02:29:14 AM
పట్టపగలే ఖనిజ సంపద దోపిడి..
ఎమ్మెల్యే అనుచరిడి కనుసన్నల్లో నిర్వాకం .. ?
తాండూరు, జనవరి 16, (విజయ క్రాంతి): అనుమతులు ఏవీ లేకుండా అక్రమంగా ఎర్రరాయి తవ్వకాలు జరుపుతూ అక్రమ రవాణా సైతం చేస్తుండడంతో ఖనిజ సంపద దోపిడికి గురవుతుంది.. అడ్డుకునే అధికారులు ఎవరు లేకపోవడంతో అక్రమార్కులు ఆడిందే ఆట..పాడిందే పాట అన్నట్టుగా వ్యవహారం నడుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం పాషాపూర్, రామ్ సింగ్ తండా సమీపంలో ప్రభుత్వ మరియు పట్టా భూముల్లో అక్రమార్కులు యదేచ్చగా ఎర్ర రాయి తవ్వకాలు జరుపుతూ ట్రాక్టర్లలో అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
దీంతో ప్రభుత్వనికి రావలసిన ఆదాయం భారీగా గండి పడుతుంది. ఇంటి నిర్మాణం కోసం ఉపయోగించే ఎర్రరాయికి మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంది. గతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి ఎర్రరాయిని తరలిస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పలువురిపై కేసు నమోదు చేశారు. ఏదైనా ఘటన జరిగినప్పుడే సంబంధిత అధికారులు హడావిడి చేస్తున్నారు తప్ప .. తిరిగి అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు ఇదే అదనుగా అక్రమంగా తవ్వకాలు జరుపుతూ అక్రమ రవాణాకు తెగబడుతున్నారు.
ఈ అక్రమ వ్యవహారం వెనుక ఎమ్మెల్యే అనుచరుడు ఒకరు తతంగమంతా నడిపిస్తున్నట్టు ఆరోపణలు వినవస్తున్నాయి. ఇప్పటి కైనా సంబంధిత రెవెన్యూ, గనులు భూగర్భ ,రవాణా శాఖల అధికారులు అక్రమార్కులపై చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆదాయా నికి లాభం చేకూరేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా గనులు భూగర్భ శాఖ సంచాలకులు సత్యనారాయణను వివరణ కోరగా ఎర్ర రాయి అక్రమ తవ్వకాలు వాస్తవమే ..గతంలో తనిఖీలు చేసి తవ్వకాలకు ఉపయోగిస్తున్న పరికరాలను స్వాధీనం చేసుకున్నామని త్వరలో ఎర్రరాయి అక్రమ తవ్వకాలను అడ్డుకొని కేసులు నమోదు చేస్తామన్నారు.