30-10-2025 12:22:29 AM
 
							చారకొండ, అక్టోబర్ 29: మొంథా తుఫాన్ ప్రభావంతో బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి వాగులు పొంగి ప్రవహించడంతో చారకొండ మండలంలోని గోకారం, చంద్రాయన్ పల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తుర్కలపల్లి గ్రామంలో వరద నీటితో పలు ఇండ్లలోకి నీరు చేరి పత్తి పంట, నిత్యవసర సరుకులు తడిచిపోయాయి. చారకొండ పెద్ద వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. గతంలో ఎన్నడు లేని విధంగా మండలంలో అత్యధికంగా 133.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. మండల వ్యాప్తంగా పత్తి, వరి పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర అవేదన వ్యక్తం చేస్తున్నారు.
- ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ.
మొంథా తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చారకొండ మండలం తుర్కలపల్లి గ్రామం నీట మునగడంతో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అధికారులతో పర్యటించి ఇంటింటికి తిరిగి జరిగిన నష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ వాగుల్లో వరద ఉధృతిని దృష్టిలో పెట్టుకుని, అధికారులను అప్రమత్తం ఉండి అవసరమైన జాగ్రత్తల కోసం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు ఆందోళన చెందవద్దనీ, ప్రభుత్వం మీకు అన్ని విధాలా అండగా ఉంటుందని అన్నారు.
రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, విద్యుత్ సంబంధిత అధికారులు ఇప్పటికే సహాయక చర్యలు చేపడుతున్నారని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇళ్ల నుంచి ఎవరు బయటికి రావద్దనీ, శిథిల వ్యవస్థలో ఉన్న ఇండ్లలో గాని మట్టి ఇండ్లలో గాని, విద్యుత్ స్తంభాల దగ్గర జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో తహసిల్దార్ ఉమ, ఎస్త్స్ర శంషుద్దీన్, ఎంపీడీఓ శంకర్ నాయక్, ఎంపీవో నారాయణతో పాటు వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులుపాల్గొన్నారు.