05-11-2025 01:27:28 AM
-జలమయమైన కాలనీలు
-చెరువులను తలపించిన రోడ్లు
-ఏనుమాముల మార్కెట్‌లో తడిసిన పత్తి
-నల్లగొండ జిల్లాలో పిలాయిపల్లి కాల్వకు గండి
-నీట మునిగిన వరి పొలాలు
-రంగారెడ్డి జిల్లాలో అలుగు దూకిన రామచంద్రగూడ చెరువు
-గ్రామంలోని ఇళ్లలోకి చేరిన నీరు
-కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో వాన తడిసి ముద్దయిన ధాన్యం
హనుమకొండ టౌన్/చిట్యాల/మహేశ్వరం/హుజురాబాద్, నవంబర్ 4 (విజయ క్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. వరంగల్ నగరంలో ఈదురు గాలుల తో కూడిన వర్షం కురిసింది. సుమా రు అరగంట పాటు కురిసిన కుండపోతకు రహదా రులు చెరువులను తలపించాయి.
దీంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడి, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షానికి ఎను మాముల మార్కెట్‌లో పత్తి, మొక్కజొన్న తడిసిపోయింది. ఇప్పటికే మొంథా తుఫాను ముంపు నుంచి ఇంకా వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాలు పూర్తిగా తీరుకో లేదు. మరోసారి వర్షాలు కురవడంతో లోత ట్టు ప్రాంతాల ప్రజల్లో ముంపు భయం నెలకొంది. అదేవిధంగా రానున్న 24 గంటల్లో జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
మార్కెట్ అధికారుల నిర్లక్ష్యం?
నాలుగు రోజుల క్రితమే వాతావరణ కేంద్రం హెచ్చరించినా ఏనుమాముల మార్కె ట్ అధికారులు నిర్లక్ష్యంగా వివరించారని, దీంతో మార్కెట్‌కు తెచ్చిన పత్తి, మొక్కజొన్నలు వర్షార్పణం అయ్యాయని రైతులు ఆరోపించారు. మార్కెట్ యార్డు అధికారులు రైతులకు సకాలంలో తాటిపత్రిలు అందించలేకపోయారని, అధికారుల నిర్లక్ష్యం కారణం గా జరిగిన ఈ నష్టాన్ని ప్రభుత్వమే భరించాలని రైతులు డిమాండ్ చేశారు. మార్కెటింగ్ శాఖ ద్వారా పత్తి కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలన్నారు. మార్కెట్‌కు తీసుకువచ్చిన తర్వాత వెంట వెంటనే కాంటాలు వేయకపోవడం వల్ల వానకు తడిసి, ఎండకు ఎండి పాడవుతున్నాయని రైతులు ఆరోపించారు. అధికారులు తగు చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని కోరారు.
నీట మునిగిన వరి పొలాలు
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామ శివారులో పిలాయిపల్లి కాలువకు గండి పడి వరి పొలాలు నీట ము నిగిన ఘటన మంగళవారం జరిగింది. ఐదు రోజులుగా భారీగా వర్షాలు పడుతుండటం తో నీరు పిలాయిపల్లి చెరువుకు చేరుతున్నది. ఈ క్రమంలోనే మంగళవారం కాలువకు గం డి పడడంతో పంటచేలు నీటితో నిండాయి. వరి పొలాలు పూర్తిగా నీట మునిగి, కోతకొచ్చిన పంట తడిసి ముద్దవ్వడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాధిత రైతులు పలుమార్లు అధికారులను సంప్రదించినా, ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలే దని ఆరోపిస్తున్నారు.
అలుగు పారిన రామచంద్రగూడ చెరువు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని రామచంద్రగూడ చెరువు మంగళవారం కురిసిన భారీ వర్షానికి నిండి అలుగు పారింది. దీంతో చెరువు సమీపాన ఉన్న గ్రామంలో ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మంగళవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా భారీ వర్షం కురవడంతో ఈ సంఘటన జరిగింది. అప్రమత్తమైన మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు పోలీసు సిబ్బందితో కలిసి రామచంద్రగూడ గ్రామానికి చేరుకొని పరిస్థితని పరిశీలించారు. ప్రజలెవ్వరూ భయాందోళన చెందవద్దని, ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు.
కస్తూర్బా స్కూల్ ఆవరణ జలమయం
మంగళవారం కురిసిన వర్షానికి మహేశ్వరం మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న కేసీ తండా పరిధిలోని కస్తూర్బా పాఠశాల ఆవరణ జలమయమైంది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందిపడ్డారు. క్రీడా ప్రాంగణంలో విద్యార్థులు ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారి గా వరద నీరు వచ్చి చేరడంతో భయాందోళనకు గురయ్యారు. తాడు సహాయంతో పాఠశాలలోకి వెళ్లారు. కస్తూర్బా పాఠశాల నిర్మాణం చెరువుకు దగ్గర వ్యవసాయ పొలాల్లో నిర్మించడం వల్ల ఈ సమస్య వచ్చిందని స్థానికులు చెపుతునానరు.
హుజురాబాద్‌లో తడిసిన ధాన్యం
కరీంనగర్ జిల్లా హుజరాబాద్ డివిజన్‌లో మంగళవారం ఉదయం కురిసిన వాన అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీసింది. హుజరాబాద్ మండలం నర్సింగాపూర్, రంగాపూర్, చెల్పూర్, పోతిరెడ్డి పేట, సిర్సపల్లి గ్రామాలలో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసింది. సుమారు 40 మంది రైతులకు చెందిన ధాన్యం నీటిపాలైంది. నరసింగాపూర్ గ్రామంలోని కేసు క్యాంపు రోడ్డుపై ఆరబోసిన ధాన్యం తడిసింది. సిరిసపల్లి గ్రామంలో నగనూరి శ్రీధర్ రైతుకు చెందిన ధాన్యం వరదతో చెరువులోకి కొట్టుకుపోయింది. కొట్టుకపోయిన వరి ధాన్యాన్ని రైతు దంపతులు నీళ్ల నుంచి ధాన్యాన్ని వేరు చేసి ఆరబెట్టే ప్రయత్నం చేశారు.