05-11-2025 01:08:47 AM
జూబ్లీహిల్స్ సంగ్రామం
-అసలు మాయాజాలం ముందుంది!
-ప్రలోభాల వరదను దాటి ప్రగతికి పట్టం కడతారా?
హైదరాబాద్, సిటీ బ్యూరో నవంబర్ 4 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ వీధుల్లో ప్రచారహోరు తారస్థాయికి చేరింది. జెండాల రెపరెపలు, మైకుల మోతలు, నాయకుల వాగ్దానాలు.. పైకి అంతా రాజకీయ పండగలా కనిపిస్తోంది. కానీ, ఈ పగటి హడావిడి వెనుక, ముఖ్యంగా బస్తీలు, కాలనీల సందుగొందుల్లో ఒక ‘నిశ్శబ్ద నిరీక్షణ’!.. ఒకటే గుసగుస అసలు మ్యాటర్ ఇంకా అందలేదు. ఆ మ్యాటర్ ఏంటో అందరికీ తెలిసిందే.
ఓటుకు నోటు! నవం బర్ 11న పోలింగ్ జరగనుండగా, గెలుపోటములను తారుమారు చేయగల ఆ చివరి 48 గంటల ఆపరేషన్ పైనే ఇప్పు డు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ప్రగతి నినాదాల హోరును, ప్రలోభాల వరద దాటగలదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఎన్నికల డబ్బు పంపిణీ అనేది ఏదో ఆషామాషీ వ్యవహారం కాదు, అదొక పకడ్బందీ వ్యవస్థ.
పార్టీల అధిష్ఠానాల నుంచి, బడా కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తల ద్వారా వందల కోట్ల రూపా యలు దళారుల చేతులుమారి, అత్యం త రహస్యంగా నియోజకవర్గంలోని కీలక నేతల వద్దకు చేరుతాయి. అక్కడినుంచి, డివిజన్ ఇన్‌చార్జ్‌లు, ఏరియా నాయకులు, చివరికి ప్రతి గల్లీలో మాట చెల్లుబాటయ్యే వ్యక్తుల ద్వారా ఓటర్ల చేతికి చేరే వరకు ఒక పటిష్టమైన నెట్‌వర్క్ పనిచేస్తుంది. ప్రతి ఓటరు వివరాలు, వారి రాజకీయ మొగ్గు, వారి కుటుంబ సభ్యుల సంఖ్య వంటి వివరాలతో కూడిన జాబితాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి.
పగటిపూట ప్రచారం పెద్ద తంతే..
పగటిపూట ప్రచారానికి తరలివచ్చే జనసందోహం వెనుక కూడా పెద్ద ఆర్థిక సమీ కరణమే నడుస్తోంది. ర్యాలీకి వచ్చిన పురుషులకు రూ. 1,000తో పాటు మద్యం, బిర్యానీ ప్యాకెట్.. మహిళలకు రూ. 500 నుం చి -600తో పాటు భోజనం ఇవ్వడం బహిరంగ రహస్యం. ‘మీ ఏరి యా ఓట్లు గంపగుత్తగా మాకే పడాలి, మీకు ఇంత ప్యాకేజీ ఇస్తాం’ అంటూ బస్తీ నాయకులతో బేరసారాలు ఇప్పటికే మొదలయ్యాయి. ‘ఎన్నికలు మాకు పండగలాంటివి. ఈ పదిహేను రోజు లు మేమే రాజులం. వాళ్లకు మా ఓటు కావాలి, మాకు వాళ్ల డబ్బు కావాలి. ఇది మా హక్కు’ అని ఓ బస్తీవాసి వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పటివరకు ఏ పార్టీ కూడా పెద్దఎత్తున డబ్బు పం పిణీకి దిగకపోవడానికి బలమైన కారణం ఉంది.
అది వ్యూహాత్మక ఎత్తుగడ. ఒక పార్టీ ఓటుకు రెండు వేలు పంచిందని తెలియగానే, మరో పార్టీ మూడు వేలు ఇచ్చి ఓట్ల ను తమవైపు తిప్పుకునే ప్రమాదం ఉంది. ఈ పోటీలో ముందుగా డబ్బు పంచినవారు నష్టపో యే అవకాశం ఎక్కువ. అందుకే, ప్రచార పర్వం ముగిసి, పోలింగ్‌కు ముందు వచ్చే ఆ కీలకమైన 48 గంటలే అంటే.. నవంబర్ 9, 10 తేదీల రాత్రి అసలైన ఆటకు వేదిక కానుంది. ఆ సమయంలో నే, అన్ని పార్టీలు తమ పూర్తి శక్తిని ఉపయోగించి, ఒక్క రాత్రిలో నియోజకవర్గాన్ని డబ్బుతో ముంచెత్తడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, జూబ్లీహిల్స్ ఓటరు ఒక సంక్లిష్టమైన మానసిక సంఘర్షణను ఎదుర్కొంటున్నాడు.
ఒకవైపు ఐదే ళ్ల భవిష్యత్తు, అభివృద్ధి, మంచి రోడ్లు, నీళ్లు, విద్య, వైద్యం వంటి ఆకాంక్షలు.. మరోవైపు చేతిలో పెట్టే తక్షణ ప్రలోభం. ఏళ్ల తరబడి ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీఇచ్చే నాయకుడి మాటను నమ్మాలా? లేక, ఐదేళ్లకు ఒక్కసారి వచ్చే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలా? అనే మీమాంస లో కొట్టుమిట్టాడుతున్నాడు. అంతిమంగా జూబ్లీహిల్స్ ప్రజాతీర్పు ఒక నిశ్శబ్ద విప్లవానికి నాంది పలుకుతుందా? సానుభూతి, ఆత్మీయత వంటి భావోద్వేగాలు అధికార, అర్థ బలాన్ని ఎదురించి నిలుస్తాయా? ఈ రెండింటినీ కాదని, మార్పుకే ఓటరు జై కొడతాడా? లేదా, క్షణికమైన ప్రలోభానికే పట్టం కడతాడా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం నవంబర్ 11న నిక్షిప్తమై, ఓట్ల లెక్కిం పు రోజున వెల్లడి కానుంది. ఆ తీర్పు కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రస్తుతాని కి ఏ పార్టీ కూడా ఓటర్లకు డబ్బులు పం చడం ప్రారంభించలేదు. కానీ, పోలింగ్‌కు ముందు రెండు రోజుల్లో ధన ప్రవాహం కోసం కొందరు ఓటర్లు ఎదురుచూస్తున్నారనేది వాస్తవం.
రాజకీయం మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతోంది. చివరి రెండు రోజుల్లో నోట్ల కట్టలు ఎటువైపు ప్రవహిస్తే, ఫలితం అటువైపు మొగ్గు చూపే ప్రమాదం ఉంది. అయితే, ఈ సారి యువత ఆలోచన మారుతోంది. కేవలం డబ్బుకే ఓటు వేయకూడదని అనుకుంటున్నారు.
రావు, వ్యాపారి, యూసుఫ్‌గూడ
మాకు కావాల్సింది ప్రశాంతమైన వాతావరణం, మంచి రోడ్లు. వ్యక్తిగతంగా నాయకులు అందుబాటులో ఉండటం కన్నా, నియోజకవ ర్గానికి ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చే నాయకుడు ముఖ్యం.
కుమర్, ప్రముఖ వ్యాపారి జూబ్లీహిల్స్