27-09-2025 01:19:13 AM
పాపన్నపేట,(విజయక్రాంతి): రానున్న 4 రోజుల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శుక్రవారం పాపన్నపేట మండలం గణపురం ఆనకట్ట ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న 4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ముఖ్యమంత్రి సూచన మేరకు ఆరెంజ్ అలర్ట్ లో ఉన్న 21 జిల్లాల కలెక్టర్లుకు రెవెన్యూ మినిస్టర్ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ ప్రజలందరినీ అప్రమత్తం చేయాలని ఆదేశించారని తెలిపారు. మన పక్క జిల్లాలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు పడుతున్న నేపద్యంలో దూర ప్రాంత పర్యటనలు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వర్షాల ప్రభావం, నీటి ప్రవాహాల స్థితిపై సమాచారం సేకరించి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంతెనలు దాటే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
జిల్లా ప్రజలందరికీ నిరంతరం జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పొంగి పొర్లుతున్న వాగులు దాటకుండా పటిష్ట బందోబస్తు, బారికేడ్లు ఏర్పాటు చేసేలా పటిష్ట చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. చెరువులు, వాగులు, నదుల వద్దకు ప్రజలు వెళ్లకుండా నియంత్రిస్తున్నట్లు వివరించారు. క్షేత్రస్థాయిలో విధుల్లో ఉంటూ, అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం యావత్తు అండగా ఉందనే భరోసాను ప్రజలకు కల్పించాలని హితవు పలికారు.