ఇదిగో నా రాజీనామా

27-04-2024 02:30:28 AM

l సీఎం రేవంత్.. నీ రాజీనామా లేఖను గన్‌పార్కుకు తీసుకురా

l ఆగస్టు 15లోగా రుణమాఫీ, గ్యారెంటీలు అమలు చేయాలి

l మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు డిమాండ్

హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): దేవుళ్లపై ప్రమాణం చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రైతు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. శుక్రవారం బీఆర్‌ఎస్ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, వివేకానంద్, శంబీపూర్ రాజు, లక్ష్మారెడ్డి తదితరులతో కలిసి అసెంబ్లీ ముందు ఉన్న గన్‌పార్క్ వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఉన్న లేఖను మీడియాకు ప్రదర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే గన్‌పార్కు వద్దకు తన రాజీనామా లేఖతో రావాలని, ఇద్దరి రాజీనామాలు మేధావుల సమక్షంలో పెడదామని సవాల్ విసిరారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిజమైతే గన్‌పార్కువద్దకు రావాలని అన్నారు.

ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని, అలా చేస్తే తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్‌కు పంపుతానని తెలిపారు. హామీలు, రుణమాఫీ అమలు చేయకపోతే రేవంత్‌రెడ్డి తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపాలని డిమాండ్ చేశారు.  రాజీనామాకు ముం దుకు రావడంలేదంటే ప్రజలను మోసగించనట్లేనని విమర్శించారు. ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం పెడుతామని చెప్పి సీఎం రేవంత్ మోసగించారని మండిపడ్డారు. ప్రజలను మోసం చేసినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బాండు పేపర్లు, సోనియగాంధీ పేరుతో లేఖ ఇచ్చిమాట తప్పారని,  బాండ్లకు కాలం చెల్లిందనే భావనతో  సీఎం రేవంత్‌రెడ్డి దేవుళ్లపై ప్రమాణాలు చేసి హమీలు అమలు చేయకుండా తప్పించుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారని ఆరోపించారు.  

యువత ఆత్మహత్యలకు కారణమైన హంతకుడు హరీశ్‌రావు:  ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ 

అమర వీరుల చావుకు కారణమైన హంతకుడు హరీశ్‌రావు అలాంటి వ్యక్తి స్థూపం వద్దకు రావడంతో మైల పడిందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్  ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే పసుపు నీళ్లతో శుద్ధి చేశామని తెలిపారు. 10 సంవత్సరాల్లో  ఏనాడూ బీఆర్‌ఎస్ నేతలకు అమరవీరుల గుర్తుకు రాలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌లో హరీశ్‌రావు ఒక జీతగాడని విమర్శిం చారు. మాట ప్రకారం ఆగస్టు 15వరకు ఏకకాలంలో రుణమాఫీ ఖచ్చితంగా చేస్తారని, ప్రజలకు ఎలాంటి అనుమానం అవసరం లేదని అన్నారు. రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్‌లో ఇవ్వకుండా రాజకీయం చేయాలని హరీశ్‌రాకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఆయన రాజీనామా లేఖను వృ థా కాకుండా చూస్తామని చెప్పారు. ఆగస్టు 15 తరువాత అమోదించే విధంగా తాను బాధ్యత తీసుకుంటానని తెలిపారు. శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన ఆయ నకు రాజీనామా ఏవిధంగా చేయాల్లో తెలియదా అంటూ ప్రశ్నించారు. రుణమాఫీ చేసిన తరువాత  బీఆర్‌ఎస్‌ను రద్దు చేస్తారనే విషయంపై కేసీఆర్‌తో ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. నిజంగా ఆ పార్టీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే గత పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ది ఏమిటో ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. రాజీనామా డ్రామాలు మానుకుని ప్రజలకు ఎమ్మెల్యేగా సేవలందించాలని సూచించారు.