19-11-2025 10:32:31 PM
మెగాస్టార్ చిరంజీవి కౌబాయ్‌గా నటించిన ఏకైక సినిమా ‘కొదమసింహం’. 1990, ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించిన ఈ సినిమాను ఈ నెల 21న 4కే కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్‌తో సరికొత్తగా రమా ఫిలింస్ అధినేత కైకాల నాగేశ్వరరావు రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో స్పెషల్ వీడియో ద్వారా కథానాయకుడు చిరంజీవి ఈ సినిమాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
“కొదమసింహం’లో నా స్టిల్ చాలా పాపులర్. నాకు ఫేవరేట్ ఫొటో అది. నాకు నచ్చిందని ప్రొడ్యూసర్స్ ఆ స్టిల్‌ను ఫ్రేమ్ చేసి గిఫ్ట్‌గా ఇచ్చారు. మా ఇంట్లో ఇప్పటికీ ఈ ఫొటో ఉంది. నాకు కౌబాయ్ సినిమాలంటే ఇష్టం. క్లింట్ ఈస్ట్ వుడ్, గ్రెగరీ పెక్, ఒమర్ షరీఫ్ వంటి స్టార్స్ చేసిన సినిమాలను ఇష్టంగా చూస్తుండేవాడిని. నేను నటుడినయ్యాక అలాంటి కౌబాయ్ సినిమా నేను చేస్తానని ఊహించలేదు. అప్పటికి హీరో కృష్ణ చేసిన ‘మోసగాళ్లకు మోసగాడు’ పెద్ద హిట్టు అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసింది. అలాంటి సినిమా మళ్లీ చేయడం సాహసమే. నాగేశ్వరరావు, మురళీమోహన్‌రావుతో వచ్చి నాకు కథ చెప్పారు. బాగా నచ్చి వెంటనే అంగీకారం తెలిపాను. మొదటిసారి నేను గడ్డం పెంచి నటించిన సినిమా ఇది. ఈ సినిమాలో నాకు నచ్చిన క్యారెక్టర్ మోహన్‌బాబు చేసిన సుడిగాలి క్యారెక్టర్. ఈ క్యారెక్టర్‌లో ఫన్, జుగుప్స, విలనిజం అన్నీ కలిపి ఉంటాయి. మోహన్‌బాబు కాకుండా మరో నటుడైతే ఈ పాత్రను ఇంత బాగా ఒప్పించి మెప్పించి ఉండేవారు కారు. విలన్‌గా బాలీవుడ్ లెజెండరీ నటుడు ప్రాణ్ నటించారు. ఆయనతో కలిసి నటించే అదృష్టం నాకు ‘కొదమసింహం’తో దక్కింది. కైకాల సత్యనారాయణ, మారుతీరావు, అన్నపూర్ణ, సోనం, రాధతో ప్రతి సీన్, ప్రతి సాంగ్, ప్రతి యాక్షన్, హార్స్ రైడింగ్.. అన్నీ హైలైట్స్. అన్ని సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. రాజ్ కోటి అంత మంచి సాంగ్స్ ఇచ్చారు. జపం జపం జపం కొంగ జపం పాట నా ఫేవరేట్ సాంగ్. ప్రభుదేవా చక్కటి కొరియోగ్రఫీ చేశాడు.
ఈ పాటలో ఫ్లోర్ నుంచి గోడపైకి స్టెప్స్ వేస్తూ మళ్లీ ఫ్లోర్ మీదకు వచ్చే డ్యాన్స్ మూవ్‌మెంట్ ఉంది. ఒకే షాట్‌లో ఆ స్టెప్ ఉంటుంది. దీన్ని ఎలా చేశారని అందరూ సర్‌ప్రైజ్ అయ్యి అడిగారు. మెట్లున్న ఒక వీల్‌కు కెమెరా పెట్టి చేశాం. ఇన్సెప్షన్ అనే హాలీవుడ్ మూవీలో అలాంటి షాట్ చేశారు. మేము ఆ టైమ్‌లోనే ఇలాంటి టెక్నాలజీ వాడి ఆ షాట్ చేయగలిగాం. నాకు కొదమసింహం ఫేవరేట్ మూవీ, అయితే నాకంటే రామ్‌చరణ్‌కు ఈ సినిమా ఇంకా ఎక్కువ ఇష్టం. చిన్నప్పుడు తను వాళ్ల అమ్మ ఈ సినిమా క్యాసెట్ పెడితే కానీ భోజనం చేసేవాడు కాదు. అంతగా చరణ్‌కు ఇష్టమైన సినిమా ఇది. రీ రిలీజ్‌ల టైమ్ ఇది. ఈ జెనరేషన్ ప్రేక్షకులకు కూడా మనం చేసిన కౌబాయ్ సినిమా గురించి తెలియజేసేందుకు రమా ఫిలింస్ నాగేశ్వరరావు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. ప్రేక్షకులు ఈ సినిమాను తప్పకుండా ఎంజాయ్ చేస్తారు” అని చిరంజీవి తెలిపారు.
డైరెక్టర్ మురళీమోహన్‌రావు మాట్లాడుతూ.. “కొదమసింహం’ మా అందరికీ ఒక గొప్ప మెమొరీ. ఈ సినిమా అంత బాగా రావడానికి ముఖ్య కారణం చిరంజీవి.. ఎన్ని రోజులంటే అన్ని రోజులు, ఎప్పుడు షూటింగ్ అంటే అప్పుడు వచ్చేవారు. ఆయన అప్పుడెలా ఉన్నారో ఇప్పుడూ అంతే అందంగా ఉన్నారు. ఆయన మీసాల పిల్ల సాంగ్‌ను ఎన్నిసార్లు చూస్తున్నానో తెలియదు. ‘కొదమసింహం’ అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మీకు తెలుసు. ఈ రీ రిలీజ్‌నూ విజయవంతం చేస్తారని కోరుకుంటున్నా” అన్నారు.
నిర్మాత కైకాల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. “చిరంజీవితో చేసిన సినిమా కాబట్టి ‘కొదమసింహం’ నెగిటివ్‌ను భద్రంగా దాచిపెట్టాం. చాలా మంది నిర్మాతలు నెగిటివ్ పోగొట్టుకుంటారు. మేము భద్రపరచుకున్న నెగిటివ్ నుంచి 4కే విజువల్ కన్వర్షన్, 5.1 సౌండ్ చేయించాం. మా అదృష్టవశాత్తూ లంకా భాస్కర్ ఈ సినిమా స్టిల్స్‌ను భద్రపరిచారు. చిరంజీవి ఒకవైపు జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా చేస్తూనే మరోవైపు మా మూవీలో నటించారు. ఆయన ఒకేసారి రెండు మూడు సినిమాల్లో నటించేవారు. వేరే సినిమాలు డిస్ట్రబ్ అవుతాయని గడ్డం లేకుండా నటించమని మేము అడగలేదు. అయితే ఆయనే ఈ సినిమాకు కాస్త గడ్డం ఉండాలని చిన్న గడ్డంతో నటించారు. ఆ తర్వాత అది చిరుగడ్డం అనే ట్రెండ్‌గా మారింది. చాలా మంది హీరోలు ఆ తర్వాత చిరు గడ్డంతో నటించారు. ఇంత భారీ సినిమాను, ఇంతమంది ఆర్టిస్టుల కాంబినేషన్‌తో ఇప్పుడైతే ఎన్ని రోజులు చేస్తారో తెలియదు కానీ మేము 96 రోజుల్లో చిత్రీకరించాం. ‘కొదమసింహం’ కథలో మేము అనుకున్న ఒక వెర్షన్‌లో సెకండాఫ్‌కే సుడిగాలి క్యారెక్టర్ చనిపోతుంది. చిరంజీవికి చెబితే సెకండాఫ్ డ్రైగా ఉంది అని, పరుచూరి సోదరులను పిలిపించి స్క్రీన్‌ప్లే యాడ్ చేయించారు. అలా సుడిగాలి క్యారెక్టర్ సినిమా అంతా ఉంటూ ఫన్ అందిస్తూ వెళ్లింది” అని తెలిపారు.
సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. “కొదమసింహం’ రీ రిలీజ్ సందర్భంగా మాట్లాడటం ఎగ్జుటైంగ్‌గా ఉంది. మా రాజ్ ఇప్పుడు మన మధ్య లేడు. మాకు కౌబాయ్ సినిమాలంటే చాలా ఇష్టం. అలాంటి ఒక మూవీ తెలుగులో అవకాశం వస్తే బాగుండును అనుకునేవాళ్లం. అలాంటి టైమ్‌లో ఈ సినిమా అవకాశం వచ్చింది. మేము ఛాలెంజింగ్‌గా తీసుకుని చేశాం. బీజీఎం అయితే అయ్యప్ప మాల వేసుకుని నిష్టగా చేశాను” అన్నారు.
మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. “ఈ సినిమా రిలీజ్‌కు మూడు నెలల ముందే మా కొండవీటి దొంగ రిలీజ్ అయ్యింది. ఇదీ యాక్షన్ మూవీనే. సెకండాఫ్‌లో కొంత వెలితి ఉందని మమ్మల్ని పిలిచారు. మేము, సత్యానంద్, విజయేంద్రప్రసాద్, శివశక్తి దత్తా ఈ సినిమాకు స్క్రిప్ట్‌కు వర్క్ చేశారు. చిరంజీవి ఈ సినిమాకు వెయ్యి శాతం కరెక్ట్. 35 ఏళ్ల క్రితమే ఇంత మంచి కాస్టింగ్, కథా కథనాలు, డైలాగ్స్, సంగీతంతో సినిమా వచ్చిందంటే మనమంతా గర్వపడాలి” అన్నారు.
మాటల రచయిత సత్యానంద్ మాట్లాడుతూ.. “నాకు చాలా ఇష్టమైన సినిమా ‘కొదమసింహం’. కౌబాయ్ సినిమాకు రాసే అవకాశం అరుదుగా వస్తుంటుంది. చిరంజీవి ఈ సినిమా చేసేప్పటికి ఒక్క కృష్ణ కౌబాయ్ మూవీనే ఉంది. చాలా కాలానికి మహేశ్‌బాబు కౌబాయ్ సినిమాలో నటించారు. చిరంజీవి కెరీర్‌లో ప్రత్యేకమైన గుర్తుండిపోయే సినిమా కావాలని నిర్మాత నాగేశ్వరరావు ఎంతో పట్టుదలగా సినిమా నిర్మించారు. మురళీమోహన్‌రావు అంతే శ్రద్ధగా రూపొందించారు” అని చెప్పారు.