calender_icon.png 30 August, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయన అట్లా.. ఈయన ఇట్లా!

30-08-2025 12:00:00 AM

-బెల్లంపల్లి ఇజ్జత్ తీసిండ్రు

- ఇద్దరూ సేమ్ టు సేమ్

బెల్లంపల్లి అర్బన్, ఆగస్టు 29 :  బెల్లంపల్లి ఇజ్జత్ తీస్తుండ్రు.. ఈ మాట ప్రస్తుతం ఎక్కడ చూసినా చర్చనీయాంశంగా వినిపిస్తోంది. ఒకరిద్దరు కూడిన చోట ఆ ఇద్దరి కోసమే మాట్లాడుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిందనడంలో అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. ఇంతకీ బెల్లంపల్లి ఇజ్జత్‌కి ఏం ప్రమాదం వచ్చింది..? ఇజ్జత్ పోయే పనులు ఎవరు చేశారు.. ఏం చేశారు అనేది కదా ఇక్కడ ఆసక్తికర అంశం. ఈ పరిస్థితిని తెర మీదికి తెచ్చిన ఘటన ఏది.. ఆ ఘనులెవరు..? అనేదే కదా ఇక్కడ చర్చ. వివరాల్లోకి వెళితే... 

సింగరేణి కోల్ బెల్ట్ లో బెల్లంపల్లికి ఏ ప్రాంతానికి లేని విశిష్టత, విలక్షణత, వైవిధ్యత ఉందన్నది కాదనలేని సత్యం. ఇంకాస్త విపులంగా చెప్పుకుంటే... బెల్లంపల్లి బొగ్గు గనులకు, విప్లవోద్యమాలకు, సామాజిక చరిత్రకి పెన్నిధి. మిశ్రమ చరిత్రపుడమికి కేరాఫ్ గా బెల్లంపల్లి నిలిచింది. చరిత్రను బట్టి అక్కడి సామాజిక పరిస్థితులు, ప్రభావిత స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ దైనందిన ఆచరణ జీవనశైలిపై దూర ప్రాంతీయులకు ఓ ప్రత్యేకమైన అభిప్రాయం ఉండటం సహజమే.. అలాంటి అభిప్రాయాలకి అక్షరం పొల్లుపోనీ చరిత్ర నేపథ్యం బెల్లంపల్లికి ఉన్నది.

యావత్ ఈ అభిప్రాయానికి, చైతన్యానికి ఇక్కడి ప్రజలు ఇంకా తీసిపోలేదు. ఈ చరిత్ర నుంచి దూరమైంది మాత్రం రాజకీయ నాయకులే.. పేరు గొప్ప.. ఊరు దిబ్బ... లాగా అనుకునేలా ఇక్కడి ప్రజాప్రతిథులు కంకణం కట్టుకున్నారన్న ఆరోపణలను మూఠకట్టుకున్నారు. బెల్లంపల్లికి ఉన్న మంచి పేరును పోగొడుతున్నారనే అభిప్రాయం సర్వత్రా చర్చనీయాంశంగా మార్చివేశారు. అందుకు ప్రధాన కారణంగా బెల్లంపల్లి పాలితుల్లో ఇద్దరే ఇద్దరూ అని ప్రజలు బహాటంగా చర్చించుకుంటున్నారు. 

ఇందులో ఒకరు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మె ల్యే దుర్గం చిన్నయ్య, మరొకరు తాజా ఎమ్మె ల్యే గడ్డం వినోద్ పేర్లు మారుమోగుతున్నా యి. ఇంతకీ వారు చేసిన ఘనకీర్తి ఏంటి అనేదాని చుట్టూ చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ర్టం సాధించిన పార్టీగా గుర్తించి కృతజ్ఞతాభావంతో 2014, 2018 లో రెండు పర్యా యాలుగా బెల్లంపల్లి నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా దుర్గం చిన్నయ్యను గెలిపించారు. అప్పటికే పీకల్లోతు విమర్శల ప్రవాహంలో ఆయన కూరుకుపోయారు. అభివృద్ధి మాట అటుం చితే.. భూ కబ్జాలు, అనైతిక పనులకు ఒడిగట్టి ప్రజల్లో అభాసుపాలయ్యారన్న ఆరోపణలున్నాయి.

దీనితో విసిగి పోయిన బెల్లంపల్లి ప్రజలు దుర్గం చిన్నయ్య ను కాదని 2023లో జరిగిన ఎన్నికల్లో రాజకీయ కురవృద్ధుడు, పరిపాలన దక్షతలో కాకాలు తీరిన ‘కాకా’ వెంకటస్వామి పెద్ద కు మారుడు, రాజకీయ వారసుడు, బాగా చదువుకున్నోడు, మరి సంస్కార వంతుడు, ఉత్త ముడని గడ్డం వినోద్ ను ఆదరించారు. అప్పటికే చరమాంకంలో ఉన్న రాజకీయ జీవితా నికి బెల్లంపల్లి ప్రజలు ప్రాణం పోశారు. ఎన్నికలకు ముందే గడ్డం వినోద్ ఫోన్‌లో అశ్లీల దృశ్యాలు తిలకిస్తున్న ఓ వీడియో అనూహ్యం గా వైరల్ అయ్యింది.

ఎన్నికలకు ముందు ప్రచార తెరపై ఈ దృశ్యమే విస్తృత చర్చినీయాంశమైంది. తన సెల్ ఫోనే కానీ నేను అశ్లీల చిత్రాలు చూడలేదు, ఆ పని తన డ్రైవర్ దని గడ్డం వినోద్ మొదటిసారిగా ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అప్పుడే అతని మనోగతంపై బెల్లంపల్లి ప్రజల అనుమానానికి బీజం వేసింది. పెద్ద మనసుతో బెల్లంపల్లి ప్రజలు గడ్డం వినోద్ కు నియోజక వర్గ పరిపాలన పగ్గాలను అప్పగించారు.

అన్నిట్లో సమానులే..?

గెలిచిన ఏడాదిలోపే బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అనేక విమర్శలకు, వివాదాలకు ప్రధాన కేంద్రమయ్యారు. అభివృద్ధి విషయంలో మొదటగా విమర్శలకు తెరదీసుకున్నాడు. తర్వాత జీవన శైలిలో అనైతికమైన ఆరోపణలను కొని తెచ్చుకున్నారు. ఆయన అనుచర వర్గం పనితీరు అప్రతిష్ట పాలు చేసింది. ఈ క్రమంలో మావోయిస్టు హెచ్చరికలకు గురయ్యారు. జిల్లాలో ఏ ఎమ్మెల్యే మీద అన్ని మావోయిస్టుల హెచ్చరిక లేఖలు రామారమిగా రాలేదు. స్వయం కృపరాధం, అనుచరుల మితిమీరిన చేష్టలు తోడై ప్రజల్లో ఏడాది గడవకముందే విసుగు పుట్టింది. ఇదే మాదిరిగా గత ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూడా వ్యవహరించిన దృష్టాంతం ప్రజలు మరోసారి గుర్తు తెచ్చుకుంటున్నారు.

ఆయన కూడా పీకలోతు విమర్శలు, అసంతృప్తులు వెరసి అబాసుపాల్లో మునిగిపోయారు. ముఖ్యంగా ఆరీజిన్ డెయిరీ వ్యవహారమే దుర్గం చిన్నయ్యను రాజకీయంగా తీవ్ర నష్టాన్ని కలిగించింది. శేజల్ వ్యవహారం దుర్గం చిన్నయ్య కొంపముంచినంత పని చేసింది. ప్రజల్లో చాలా చెడ్డ పేరును తెచ్చుకున్నారు. ఆయన కూడా మావోయిస్టు హెచ్చరికలకు గురయ్యారు. అనుచర వర్గం పనితీరే ముఖ్యంగా నష్టం కలిగించింది. శృతిమించిపోయి అధికారాన్ని కోల్పోయారు. అదే పరిస్థితి ఎమ్మెల్యే ఎదుర్కొంటున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

తాజాగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ పీఏలు, ముఖ్య అనుచరులు తప్ప తాగి రోడ్డుపై కుప్పిగంతులు వేసిన వీడియో వైరల్ పొలిటికల్ సర్కిల్లో కలకలం రేపుతుంది. పీకలోతు విమర్శలకి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకి పదేళ్లు పడితే, రెండేళ్లలోనే అంతకంటే రెట్టింపు అసంతృప్తి, విరక్తిని ఎమ్మెల్యే గడ్డం వినోద్ రికార్డు బద్దలు కొట్టారని స్థానికులు అంటున్నారు. ఆయన అట్లా.. ఈయన ఇట్లా అని బెల్లంపల్లి ప్రజలు చర్చించుకుంటున్నారు. మొత్తానికైతే ఇద్దరూ బొమ్మా, బొరుసు లాంటి వారైనప్పటికీ ఒకే నాణానికి చెందినవారేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ బెల్లంపల్లి ఇజ్జత్ తీసిడ్రన్న అభిప్రాయం మాత్రం ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. ఇదే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.