calender_icon.png 30 August, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కచ్చితంగా కాలేజీకి వెళ్లాల్సిందే!

30-08-2025 12:00:00 AM

కళాశాల విద్యార్థులకు ఎఫ్‌ఆర్‌ఏస్ అటెండెన్స్

మహబూబాబాద్, ఆగస్టు 29 (విజయ క్రాంతి): ఇంతకాలం బడిలా కాకుండా కాలేజీ అంటే.. అప్పుడప్పుడు వెళ్లొస్తే సరిపోతుందని అభిప్రాయం విద్యార్థుల్లో ఉండేది. దీనితో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్యతో పోలిస్తే ప్రతిరోజు కళాశాలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య లో భారీ తేడా ఉండేది.

అధ్యాపకులు విద్యార్థులను పాఠశాల మాదిరిగా కళాశాలకు వచ్చే విధంగా మెప్పించే పరిస్థితి లేకపోవడంతో, కళాశాలకు వచ్చిన వారికే విద్య బోధన చేసే పరిస్థితి ఉండేది. ఫలితంగా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల వార్షిక ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం సగానికి సగం పడిపోయేది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైతం విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడానికి ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం  (ఎఫ్ ఆర్ ఎస్) ద్వారా అటెండెన్స్ తీసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 50 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉండగా 14,654 విద్యార్థులు ప్రధమ ద్వితీయ సంవత్సరం కలిపి విద్యనుభ్యసిస్తున్నారు. జనగామ జిల్లాలో 1,687 మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యాభ్యాసం చేస్తుండగా, మహబూబాబాద్ జిల్లాలో 2,591, భూపాలపల్లి జిల్లాలో 1,011, ములుగు జిల్లాలో 1,520, వరంగల్ జిల్లాలో 2,259, హనుమకొండ జిల్లాలో 5,586 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు.

విద్యార్థుల హాజరు నమోదు కోసం ఎఫ్ ఆర్ ఎస్ ఫోన్ యాప్ విధానం అమలు చేయడానికి ఎంపిక చేసిన కొందరు అధ్యాపకులకు హైదరాబాదులో శిక్షణ ఇచ్చారు. సెల్ఫోన్ లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆధ్వర్యంలో ఎఫ్ ఆర్ ఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని తర్వాత కళాశాల యూజర్ ఐడి, పాస్వర్డ్ తో లాగిన్ అయిన తర్వాత కళాశాలకు వచ్చిన విద్యార్థుల ముఖాన్ని చిత్రీకరిస్తారు.

ప్రతిరోజు కళాశాలల్లో ఉదయం మధ్యాహ్నం ఎఫ్ ఆర్ ఎస్ నమోదు చేస్తారు. ఎఫ్ ఆర్ ఎస్ వల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హాజరు శాతం పెరగడం, చదువు పట్ల ఆసక్తి పెంపు ఉంది అవకాశాలు ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

క్రమం తప్పకుండా కళాశాలకు వస్తారు

ఎఫ్ ఆర్ ఎస్ విధానం అమలుతో ఇకనుంచి విద్యార్థులు కచ్చితంగా కళాశాలకు వస్తారు. అలాగే పరీక్షల సమయానికి అవసరమైన హాజరు శాతం కచ్చితంగా చూపే అవకాశం ఉంటుంది. స్కాలర్షిప్ కోసం ఎఫ్ ఆర్ ఎస్ విధానం సులభతరం అవుతుంది. అలాగే డమ్మీ అడ్మిషన్లు నమోదు చేయడానికి ఏ మాత్రం అవకాశం ఉండదు. ప్రతిరోజు కళాశాలకు విద్యార్థులు రావడం వల్ల పాఠ్యాంశాలను అర్థం చేసుకొని మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఎఫ్ ఆర్ ఎస్ విధానం ప్రభుత్వ జూనియర్ కళాశాలల పటిష్టత, విద్యాభివృద్ధికి కచ్చితంగా దోహదపడుతుంది. 

 పొక్కుల సదానందం,

ప్రిన్సిపల్,

ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల,

మహబూబాబాద్