calender_icon.png 19 October, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాత్రూంలో రహస్య కెమెరా

18-10-2025 12:00:00 AM

  1. వివాహిత స్నానం చేస్తుండగా రికార్డింగ్
  2. ఇంటి ఓనర్ అరెస్టు.. పరారీలో ఎలక్ట్రీషియన్

హైదరాబాద్, సిటీ బ్యూరో, అక్టోబర్ 17 (విజయక్రాంతి): అద్దెకు ఉంటున్న వారి పట్ల ఓ ఇంటి యజమాని పైశాచికత్వంగా వ్యవహరించాడు. బాత్రూంలోని బల్బు హోల్డర్ లో రహస్య కెమెరా అమర్చి, వివాహిత స్నానం చేస్తుండగా వీడియోలు చిత్రీకరించాడు. ఇంటి ఓనర్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, ఎలక్ట్రీషియన్ పరారీలో ఉన్నాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది.

జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అశోక్ యాదవ్‌కు చెందిన ఇంట్లో ఓ దంపతులు అద్దెకుంటున్నారు.  తమ బాత్రూంలో బల్బు పనిచేయడం లేదని వారు ఈ నెల 4న యజమానికి తెలిపారు. అశోక్ చింటూ అనే ఎలక్ట్రిషియన్‌తో కలిసి వారి ఇంటికి వచ్చి బల్బును రిపేర్ చేశాడు. ఇదే అదనుగా ఇంటి యజమాని ఎలక్ట్రిషియన్ సహాయంతో బల్బు హోల్డర్‌లో రహస్య కెమెరా అమర్చాడు.

అప్పటి నుంచి ఆ కెమెరా ద్వారా అద్దెకు ఉంటున్న వివాహిత వీడియోలను రహస్యంగా రికార్డు చేస్తున్నాడు. అయితే, ఈ నెల 13న బాధితురాలి భర్త బాత్రూంలో ఉండగా, బల్బు హోల్డర్ నుంచి ఒక స్క్రూ కిందపడటంతో అనుమానం వచ్చింది. జాగ్రత్తగా పరిశీలించగా, హోల్డర్ లోపల లైట్ వెలగడం, రహస్య కెమెరా ఉండటం గమనించి నివ్వెరపోయాడు. వెంటనే వారు యజమాని ప్రవర్తనపై మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు వెంటనే అశోక్ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. ఈ దుర్మార్గానికి సహకరించిన ఎలక్ట్రిషియన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అద్దె ఇళ్లలో కూడా భద్రత కరువవడం పట్ల నగరవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.