calender_icon.png 6 August, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజిస్ట్రేషన్లపై హైకోర్టు కీలక మార్గదర్శకాలు

20-07-2024 12:51:19 AM

  1. తిరస్కరణ రాతపూర్వకంగానే ఉండాలి
  2. మౌఖిక ఆదేశాలు చెల్లవు
  3. అన్ని ఎస్‌ఆర్‌వోల్లో రిజిస్టర్ లేదా జీడీ నిర్వహించాలి
  4. స్టాంపు డ్యూటీ వాపస్ రూల్స్ సరళంగా ఉండాలి
  5. గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘిస్తే ధిక్కరణగానే భావిస్తాం: హైకోర్టు

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉత్తర్వులు, నోటిఫికేషన్ల ద్వారా తలెత్తిన వివాదాలు పరిష్కారమైనప్పటికీ కోర్టు ఉత్తర్వులు తీసుకురావాలంటూ సబ్ రిజిస్ట్రార్లు.. రిజిస్ట్రేషన్లను తిరస్కరించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. దీనికి సంబంధించి కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. నిషేధిత జాబితాలోని ఆస్తుల రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో సబ్ రిజిస్ట్రార్లు తమ స్థాయిలో నిర్ణయం తీసుకోవడానికి అధికారాలు ఉన్నప్పటికీ ఆ విధంగా చేయకుండా మౌఖికంగా తిరస్కరిస్తున్నారని ఆక్షేపించింది.

ఫలితంగా పలువురు కోర్టుకు రావాల్సివస్తోందని, కోర్టుకు వచ్చాక తాము తిరస్కరించలేదని సబ్ రిజిస్ట్రార్లు చెబుతున్నారని చెప్పింది. అదేవిధంగా ప్రజలు కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లకుండానే రిజిస్ట్రేషన్‌కు అడ్డంకులు చెప్పకుండా వివాదాస్పద స్థలాల వ్యవహారంలో కోర్టు ఉత్తర్వులు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొంది. ఇలాంటి అవకతవకలను అరికట్టడానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ చట్టంలోని నిబంధనలను సబ్ రిజిస్ట్రార్లు కచ్చితంగా అమలు చేసేలా ఉన్నతాధికారులు సర్క్యులర్, గైడ్‌లైన్స్ జారీ చేయాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు వివాదం పరిష్కారమైనా ఉత్తర్వులు తీసుకురావాలంటూ పెద్దఅంబర్‌పేట సబ్‌రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన అనంతరామేశ్వరిదేవి వేర్వేరుగా 24 పిటిషన్లు దాఖలు చేశారు.

వీటిపై ఇటీవల జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ విచారించి పైవిధంగా తీర్పు చెప్పారు. ఈ వివాదం కేవలం 24 పిటిషన్లకే పరిమితం కాదని, వందల కొద్దీ పిటిషన్లు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని అదుపు చేసి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ శాఖదేనని, అందువల్ల ప్రజల హక్కులకు సంబంధించి తగిన మార్గదర్శకాలు చేస్తున్నామన్నారు. రిజిస్ట్రేషన్ వివాదాల నేపథ్యంలో ఎమ్మార్వో, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని పత్రాలను తీసుకువచ్చి కోర్టు ముందుంచుతున్న సంఘటనలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రికార్డుల్లోని పత్రాలకు ప్రభుత్వం కస్టోడియన్ వంటిదని, వాటి రక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు.

ఒరిజినల్ రికార్డుల్లోని పత్రాలను ప్రైవేటు వ్యక్తులు తీసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఫ్లాట్లు, యూనిట్లు ఒక్కోసారి మొత్తం ప్రాపర్టీని నిషేధిత జాబితాలో ఉంచుతున్నారని, ఈ చర్యలు ప్రజలకు రాజ్యాంగం కల్పించిన 300ఏ హక్కుకు భంగం కలిగిస్తున్నాయన్నారు. నిషేధిత జాబితాలో నుంచి తమ వాటాను తొలగించాలంటూ ఇక్కడ వందల కొద్దీ పిటిషన్లు దాఖలవుతున్నాయన్నారు. అందువల్ల రిజిస్ట్రేషన్‌లో పారరద్శకత కోసం మార్గదర్శకాలు చేస్తున్నామన్నారు. రెవెన్యూ (రిజిస్ట్రేషన్, స్టాంపులు) శాఖ ముఖ్యకార్యదర్శి, రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్లతోపాటు, శాఖ కమిషనర్ వీటి అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేయని పక్షంలో కోర్టు ధిక్కరణ కింద పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

హైకోర్టు మార్గదర్శకాలివీ..

* రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం వారంలోగా పత్రాలను రిజిస్ట్రేషన్ చేయాలని, లేదంటే తిరస్కరించాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. సబ్‌రిజిస్ట్రార్ నిర్ణయాన్ని పార్టీలకు తెలియజేయాలన్నారు. అంతేగానీ మౌఖికంగా రిజిస్ట్రేషన్లను తిరస్కరించరాదు. తిరస్కరణకు రాతపూర్వక ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేశారు.

* ఏదైనా కారణం మీద రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించినట్లయితే అప్పటికే చెల్లించిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను వాపసు చేయడానికి సులువైన విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. వీటిని చెల్లించే ముందు స్టాంపు డ్యూటీ వాపసు విధానాన్ని తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వ నోటిఫికేషన్లు, ఉత్తర్వులు, మెమోలను అధికారులు జారీ చేసినపుడు వాటిని కోర్టులు సవరించినా, రద్దు చేసినా ఎలాంటి అప్పీలు లేకుండా తుది నిర్ణయం ఖరారైనా కోర్టు ఉత్తర్వులు తీసుకురావాలని డిమాండ్ చేయరాదంటూ ఉన్నతాధికారులు సర్క్యులర్లు జారీ చేయాలని ఆదేశించారు.

* ప్రభుత్వ నోటిఫికేషన్లు, జీవోలను కోర్టులు కొట్టివేసినా దానికి సంంధించిన వివాదాలు పరిష్కారమైనప్పటికీ అదే జీవోలను ప్రస్తావిస్తూ పదే పదే రిజిస్ట్రేషన్లను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేయరాదన్నారు.

* ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్/జనరల్ డైరీ (జీడీ బుక్/ఎంట్రీబుక్/రిజిస్టర్)ను నిర్వహించాలన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లినవారు తేదీ, సమయం, ఏ పనిమీద కార్యాయానికి వెళ్లారన్న అంశాలను నమోదు చేయడం ద్వారా రికార్డుల తారుమారు చేసే అవకాశం ఉండదన్నారు. అంతేగాకుండా తప్పుడు సమాచారం ఇవ్వకుండా చేయవచ్చన్నారు.

* కోర్టు ఉత్తర్వుల కోసం పట్టుబట్టకుండా అధికారం ఉన్న సబ్ రిజిస్ట్రార్/ఎమ్మార్వోలు చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు. 

* నిషేధిత భూములకు చెందిన సెక్షన్ 22ఏ ను సమర్థిస్తూ వింజమూరి రాజగోపాలాచారి వర్సెస్ ఏపీ, ఇన్వెక్టా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ ఏపీ కేసుల్లో ఇచ్చిన తీర్పులను రిజిస్ట్రేషన్ అధికారులు అమలు చేయాలన్నారు. 

* రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లే ముందు ఆ ఆస్తి నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలని, ఒకవేళ ఉన్నట్లయితే చట్టప్రకారం తొలగించుకోవడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అంతేగానీ సబ్‌రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్‌ను మౌఖికంగా తిరస్కరించారంటూ కోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు పొందడానికి ప్రయత్నించరాదన్నారు. 

* రిజిస్ట్రేషన్ చట్టానికి అనుగుణంగా పత్రాలను సమర్పించాని ఆదేశించారు