12-07-2025 01:10:03 AM
హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): ఫీజులు పెంచాలని హైకోర్టు ను ఆశ్రయించిన ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు చుక్కెదురైంది. తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమి టీ (టీఏఎఫ్‌ఆర్‌సీ)కి ప్రతిపాదించిన ఫీజులు పెంచుకునేందుకు అవకాశమివ్వాలని పన్నెండు కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఫీజుల పెంపుపై ఆరువారాల్లో టీఏఎఫ్‌ఆర్‌సీ నిర్ణయం తీసుకొని ప్రభు త్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ప్రభుత్వం తీసుకొనే తుది నిర్ణయంపైనే ఫీజులు పెంపు ఆధారపడి ఉంటుందని పేర్కొంది.
టీఏఎఫ్‌ఆర్‌సీ తీరుపై అసంతృప్తి..
ఇంజినీరింగ్ ఫీజుల పెంపుపై యేటా గందరగోళం నెలకొంటున్న నేపథ్యంలో టీఏఎఫ్‌ఆర్‌సీ తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలేజీలు ఫీజుల పెంపునకు ప్రతిపాదనలు ఇవ్వడం, కౌన్సెలింగ్ పూర్తయ్యి అడ్మిషన్లు చేపట్టేదాకా సిఫార్సులు చేయకపోవడంతో ఆయా కాలేజీలు కోర్టును ఆశ్రయిస్తున్నాయని పేర్కొంది.
ఈ విద్యాసంవత్సరానికి గత బ్లాక్ పీరియడ్ 2022-25 పాత ఫీజులే వర్తిస్తాయని ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.26ను సవాల్ చేస్తూ గోకరాజు లైలావతి ఇంజినీరింగ్ కాలేజీ, గురునానక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గోకరాజు రంగరాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గురునానక్ ఇన్‌స్టిట్యూషన్ క్యాంపస్‌తోపాటు దాదాపు 12 కాలేజీలు గురువారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాయి.
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ కే లక్ష్మణ్ మూడేళ్లకోసారి కాలేజీలను పరిశీలించి ఫీజుల పెంపుపై నిర్ణయం తీసుకోకపోవడం సరికాదని పేర్కొన్నట్టు తెలిసింది. డిసెంబర్‌లో కాలేజీల నుంచి ప్రతిపాదనలు వస్తే జూన్ వరకు దీనిపై నిర్ణయం తీసుకోకపోవడమేందని, పదిహేను మంది సభ్యులున్న కమిటీ.. నిర్ణయం తీసుకోవడంలో జాప్యమెందుకు చేస్తుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. కౌన్సెలింగ్ పూర్తయ్యాక పిటిషన్లు వేయడమేంటని, టీఏఎఫ్‌ఆర్‌సీపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదని ఆయా కాలేజీలను ప్రశ్నించారు.
అయితే కాలేజీల తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ గత డిసెంబర్‌లో కాలేజీలు ప్రతిపాదనలు సమర్పించాయని, మార్చిలో కమిటీ సమావేశమైందని, అందులో ప్రతిపాదనలను కమిటీ ఆమోదించిందని, దీనికి రిజిస్టర్‌లో నమోదు చేసిన వివరాలే నిదర్శనమని వివరించారు. ఇక టీఏఎఫ్‌ఆర్‌సీ తరఫు సీనియర్ న్యాయవాది పీ శ్రీరఘురాం వాదనలు వినిపిస్తూ కాలేజీలు 5వేల పేజీలతో ప్రతిపాదనలు సమర్పించాయని, వీటిని పరిశీలించడానికి సమయం పడుతుందని తెలిపారు.
ఈ క్రమంలోనే గత పాత ఫీజులనే ఈ ఏడాదికి సిఫార్సు చేసిందన్నారు. ప్రభుత్వం తరఫున రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ గతేడాది కంటే కూడా 70 శాతం నుంచి 90 శాతం వరకు ఫీజులు పెంపునకు కొన్ని కాలేజీలు అడుగుతున్నట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. ఈ కాలేజీల్లోని నీల్‌గోగ్టే, రెండు కేశవ్ మెమోరియల్ కాలేజీల పిటిషన్‌లను మాత్రం మరో బెంచ్‌కు న్యాయస్థానం బదిలీ చేసినట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.