26-01-2026 02:13:54 AM
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్
చెన్నై, జనవరి 25: హిందీని తమపై బలవంతంగా రుద్దడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ.. కొంతకాలంగా త్రిభాషా విధానంపై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. తమిళ భాషను రాష్ట్ర ప్రజలు ప్రాణంగా ప్రేమిస్తారని.. దానిని మరుగున పరిచే ఎలాంటి చర్యనైనా తాము ఎన్నటికీ సహించమన్నారు.
తమిళనాడులో హిందీకి ఎప్పుడూ స్థానం లేదని.. భవిష్యత్‌లోనూ ఉండదన్నారు. ఆదివారం నిర్వహించిన తమిళ భాషా అమరవీరుల దినోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హిందీని తమపై రుద్దాలని చూసిన ప్రతిసారీ.. అదే తీవ్రతతో తమ నిరసన వ్యక్తం చేస్తామని స్టాలిన్ స్పష్టం చేశారు. జాతీయ విద్యావిధానాన్ని అమలుచేయడం లేదన్న కారణంతో కేంద్రం తమిళనాడుకు రావాల్సిన నిధులను నిలిపివేస్తోందని ఆరోపించారు. అయినప్పటికీ ఈ విషయంలో తాము వెనకడుగు వేయమని తేల్చిచెప్పారు.