26-01-2026 02:17:24 AM
పాట్నా, జనవరి 25, బీహార్‌లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పదవిని చేపట్టడం పార్టీలో తరాల మార్పును సూచిస్తోంది. 36 ఏళ్ల తేజస్వికి ఇకపై పార్టీ సంస్థాగత వ్యవహారాలపై పూర్తి పట్టు దక్కనుంది. దైనందిన నిర్ణయాల్లో ఆయన పాత్ర మరింత కీలకం కానుంది. గతంలో ఆర్జేడీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఉండేది కాదు. లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్య కారణాల దృష్ట్యా పార్టీ బాధ్యతలను తేజస్వికి అప్పగించాలని నిర్ణయించారు.
దీని ద్వారా పార్టీ భవిష్యత్ వ్యూహాలను తేజస్వి స్వయంగా పర్యవేక్షించనున్నారు. అయితే తేజస్వియాదవ్ నియామకంపై ఆయన సోదరి రోహిణి ఆచార్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీలోని ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఆమె సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘శహాజాదా (యువరాజు) ఇప్పుడు తోలుబొమ్మగా మారారు’ అంటూ ఆమె విమర్శించారు. పార్టీలో చొరబాటుదారులు చేరారని ఆమె ఆరోపించారు.
లాలూవాదాన్ని నాశనం చేసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. పార్టీ పతనానికి కారణమైన వారు ఆత్మవిమర్శ చేసుకోవాలని రోహిణి సూచించారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం పాలైంది. 80 సీట్ల నుంచి పార్టీ సంఖ్య 35కు పడిపోయింది. ఈ నేపథ్యంలో పార్టీ కేడర్లో నూతనోత్సాహం నింపేందుకు తేజస్వికి ఈ బాధ్యతలు అప్పగించారు. .