calender_icon.png 19 November, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశంలో సీపీఐ చరిత్ర.. వందేళ్ల విప్లవయాత్ర

19-11-2025 12:51:54 AM

హుజూర్‌నగర్, నవంబర్ 18: దేశంలో ఎన్నో మార్పులకు కారణమైన వందేళ్ళ విప్లవ చరిత్ర సిపిఐ పార్టీదని రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యల్లావుల రాములు, పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం సిపిఐ పట్టణ సమితి సమావేశం జక్కుల రమేష్ అధ్యక్షతన నిర్వహించి వారు మాట్లాడుతూ.. సీపీఐ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాలలో భాగంగా రాష్ట్రంలో మూడు ప్రచార జాతాలు జరుగుతున్నాయన్నారు.

ఈ నెల 15న గద్వాలలో ప్రారంభమైన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ ఆధ్వర్యంలోని ప్రచార జాతా నవంబర్ 20న తిప్పర్తి నుండి హుజూర్ నగర్ కు చేరుకుంటుందన్నారు.  డిసెంబర్ 26న సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపులో భాగంగా ఖమ్మం పట్టణంలో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు.

సమానత్వం, లౌకికతత్వం, ప్రజా స్వామ్యం కాపాడుకుంటూ అట్టడుగు వర్గాల ప్రజల హక్కుల కోసం సిపిఐ నిరంతరం చేసిన పోరాటాల చరిత్రను ప్రజల ఎదుట ఉంచేందుకే బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. జడ శ్రీనివాస్, దొంతగాని సత్యనారాయణ గౌడ్, మామిడి వెంకయ్య, జక్కుల రమేష్, జడ వెంకన్న, సుందరి పద్మ, యల్లావుల సురేందర్, పాల్గొన్నారు.

సీపీఐ జాతను జయప్రదం చేయాలి సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు

సూర్యాపేట, నవంబర్ 18 (విజయక్రాంతి) : ఖమ్మంలో డిసెంబర్ 26న భారత కమ్యూనిస్టు పార్టీ 100 వసంతాల ముగింపు  ఉత్సవాలను జయప్రదం కోసం నవంబర్ 15న బాసరలో ప్రారంభమై, 24 వ తేదీన  సోమవారం సూర్యాపేటకు వచ్చు జాతను జయప్రదం చేయాలని సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పార్టీ శ్రేణులను కోరారు. మంగళవారంలో జిల్లా కేంద్రంలో ధర్మబిక్షం భవనంలో జరిగిన కార్యవర్గ సమావేశం పట్టణ కార్యవర్గ సభ్యులు బొమ్మ గాని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

భారత గడ్డపై వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ 100 వసంతాలు పూర్తి చేసుకుని దేశ స్వాతంత్రంలో ప్రాణ త్యాగాలు చేసి, అనేక ప్రజా సంఘాలను దేశవ్యాప్తంగా నిర్మించి వారి హక్కుల కోసం ముందుండి పోరాడి సాధించుకున్న చరిత్ర  కలిగిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అన్నారు. నిరంకుశ నిజాం సర్కారును తరిమి కొట్టి, తెలంగాణ కోసం నాలుగు వేల మంది అమరులై,10 లక్షల ఎకరాల భూమిని పంచి, 3000 గ్రామ స్వరాజ్యాలు సాధించిన పార్టీ సిపిఐ అన్నారు. 

ఈ జాతలో రాజన్న వారికి ఘనమైన స్వాగతం పలికి జయప్రదం చేయాలన్నారు. ఈ సమావేశంలో పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, దంతాల రాంబాబు, చామల అశోక్ కుమార్, ఎండి పాషా, రేగటి లింగయ్య, పెండ్ర కృష్ణ, దంతాల పద్మ రేఖ పాల్గొన్నారు.

సీపీఐ ప్రచార జాతను విజయవంతం చేయాలి: వెంకటేశ్వర్లు

గరిడేపల్లి, నవంబర్ 18 : సీపీఐ శత వార్షికోత్సవాల సందర్భంగా సిపిఐ పార్టీ నిర్వహిస్తున్న ప్రచార జాతను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు కోరారు. మండల కేంద్రమైన గరిడేపల్లిలో మంగళవారం ప్రచార జాతకు సంబంధించిన కరపత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 26వ తేదీన ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు ముందస్తుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచార జాతలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

దీనిలో భాగంగానే ఈనెల 20వ తేదీన గరిడేపల్లికి వచ్చే ప్రచార జాతలో అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారని ఆ బహిరంగ సభను కూడా విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కడియాల అప్పయ్య, ఎడ్ల అంజన్ రెడ్డి, ప్రధాని సైదులు, వెంకన్న, ఏఐవైఎఫ్ మండల అధ్యక్షులు పంగ సైదులు, షేక్ సైదా హుస్సేన్, వెంకన్న పాల్గొన్నారు.