16-09-2025 12:21:00 AM
గోవిందరావుపేట, సెప్టెంబరు15 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా పేదల కోసం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను విడతల వారీగా అర్హులందరికీ మంజూరు చేయడం జరుగుతుందని, ఇంది రమ్మ ఇండ్లను నిర్మించుకునే లబ్ధిదారులు సురక్షిత ప్రాంతాల్లోనే నిర్మించుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
సోమవారం గోవిందరావు పేట మండలం మోట్లగూడెం, ఎస్.ఎస్. తాడ్వాయి మండలం వెంగలపూర్ గ్రామం లో పలు గ్రామాలకు చెందిన అర్హులైన ఇందిరమ్మ లబ్ధిదారులకు నిర్మాణ పట్టాల ను జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్ తో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలం దరికీ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని లక్ష్యంతో రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇండ్ల నిర్మాణ కార్యక్ర మాలు చేపట్టిందని, మొదటి దఫలో చేప ట్టిన ఇండ్ల నిర్మాణ కార్యక్రమాలు పూర్తి కావస్తున్నాయని తెలిపారు.
రైతులకు నష్టపరిహారం అందజేత.
ములుగు (విజయక్రాంతి): గిరిజన గోత్రాలు, పూజ ఆచారాల ప్రకారం అమ్మవార్ల పూజారుల అంగీకారం పూర్తి అయిన అనంతరమే గద్దెల ప్రాంతంలో నూతన టెక్నాలజీతో పనులను ప్రారంభించడం జరుగుతుందని, పూర్తిస్థాయిలో డీపీఆర్ పూర్తికాగానే ముఖ్యమంత్రి ముందు సమావేశమై పూర్తి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ములుగు మండలం ఇంచర్ల గ్రామంలో ఆయిల్ పామ్ పరిశ్రమ నిర్మాణం కోసం భూములు అప్పగించిన 41మంది కి ఇంచర్లలోని ఏకో పార్క్ వద్ద ప్రభుత్వ భూమి కేటాయిస్తూ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తో కలిసి పట్టాలను అందచేశారు.
ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం మండలంలోని ఇంచర్ల గ్రామ శివారులో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందజేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ మహా మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా పలు గ్రామాల గుండా రోడ్డు విస్తరణ పనులు చేయడమే కాకుండా డైవర్షన్ రోడ్లను ఏర్పాటు చేయబోతున్నా మని,
దీనికి సంబంధించిన నివేదికలను సంబంధిత అధికారులు తయారు చేస్తున్నారని తెలిపారు. గిరిజన పూజారులు, భక్తుల విశ్వాసం దెబ్బ తినకుండా ఆలోచనలు చేస్తున్నామని, వెయ్యి సంవత్సరాలు నిలిచిపోయేలా మంచి నిర్మాణ పనులను పూర్తి చేస్తామని, పనులు ప్రారంభం ప్రారంభించక ముందే పలువులు పలు రకాల ఆరోపణ చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.
ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారని ప్రపంచవ్యాప్తంగా అమ్మవార్ల ప్రాముఖ్యత సంతరించుకున్నదని అన్నారు. ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసుకునే పనులను ప్రారంభించడం జరుగుతుందని, మేడారం ప్రాంతంలో 30పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ను కోరారు.
ములుగు జిల్లా అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కోసం భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని, ఫ్యాక్టరీ ఏర్పాటుతో పాటు ఇంటిగ్రేటెడ్ పాఠశాల, అటవీ శాఖ వారు ఏకో పార్కును ఏర్పాటు చేయడంతో ఇక్కడి ప్రాంతం రానున్న రోజులలో అందనంత అభివృద్ధి చెందుతుందని అన్నారు.
యుద్ధ ప్రాతిపదికన గుడి నిర్మాణం
ములుగు, తాడ్వాయి సెప్టెంబరు (విజయ క్రాంతి): వనదేవతలైన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల ఆచారాలు దెబ్బ తినకుండా మేడారంలోని అమ్మవార్ల గద్దెలను సుందరంగా తీర్చిదిద్దు తామని, యుద్ధ ప్రాతిపదిక పై గుడి నిర్మాణ ఏర్పాట్లు చేసి భక్తులకు అందుబాటులో తేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
గిరిజనుల ఆచారాలు సాంప్రదాయాలు పూజార్ల అభిప్రాయం మేరకే నూతన గుడి నిర్మాణ ఏర్పాట్లు జరుగుతాయని ఆమె స్పష్టం చేశారు. సోమవారం ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారంలోని శ్రీసమ్మక్క సారలమ్మ దేవాలయం ప్రాంగణంలో గిరిజన పూజారులు, ఆర్కిటిక్, దేవాదాయ అధికారుల తో జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. ఎస్పీ డాక్టర్ శబరీష్ పూజార్ల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావులతో కలిసి మంత్రి సమావేశం నిర్వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుందిన సమ్మక్క సారలమ్మ జాతరలో సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని, గుడి ప్రాంగణాన్ని మార్పులు చేర్పులు చేయడంలో గత కొద్ది రోజులుగా పూజారులతో సమావేశం అవుతున్నామని అన్నారు. సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు, గోవిందరాజు గోత్రాల ప్రకారం గుడి నిర్మాణ ఏర్పాట్లు జరుగుతాయని,
దీనిపై గతంలోనే ముఖ్యమంత్రి సమక్షంలో సమావేశం నిర్వహించడం జరిగిందని అన్నారు. పూజార్ల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు మాట్లాడుతూ గుడి నిర్మాణం చేస్తామని పాలకులు హామీ ఇవ్వడంతోనే తాము అనుమతి ఇస్తున్నామని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిర్మాణ పనులు పూర్తి చేయడానికి సహకరిస్తామని అన్నారు. నూతన గుడి నిర్మాణం ఏర్పాట్లపై పలు సంఘాల నాయకుల ఆరోపణలు చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు.