24-05-2025 01:00:51 AM
-గురువారం రాత్రి కురిసిన వానతో నీటమునిగిన దుకాణాలు
-హైవే నిర్మాణంలో లోపాలతో మరింత పెరిగిన ముప్పు
-ఊసేలేని కట్టుకాల్వ డైవర్షన్
-పరిస్థితిని సమీక్షించిన మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, మే 23 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు వరద ముంపు ముప్పు తప్పడంలేదు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇండ్లలోకి వరద నీరు చేరింది. గురువారం రాత్రి కురిసిన వానతో మెయిన్ రోడ్డులోని దుకాణాలలోకి నీరు చేరింది.
ఇక్కడ జరుగుతున్న హైవే నిర్మాణ పనులు నాణ్యత లేకుండా, ప్రజల అవసరాలను పూర్తిగా విస్మరించి చేపట్టడంతోనే సమస్య మరింత పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకోకుండా, రోడ్డు వెడల్పును పెంచకుండా నిర్మాణం జరుగుతుండడంతోనే మునుపటి సమస్య ఇంకా పెద్దగా మారుతోందంటున్నారు.
ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో భారీ వర్షాలతో వరదల సమయంలో పట్టణం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. పోతారం(ఎస్) వైపు నుంచి వచ్చే వరద నీటిని మళ్లించడానికి సరైన ఏర్పాట్లు లేకపోవడంతో పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంటోంది.
పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు వరద నీటితో మునిగిపోగా మెయిన్ రోడ్డు, బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, మల్లె చెట్టు చౌరస్తాలో రోడ్డుకు ఇరువైపులా మోకాళ్లలోతు నీరు నిలిచిపోవడం సాధారణంగా మారింది. పట్టణంలోని శివాజీనగర్, సాయినగర్, నాగారం, హనుమకొండ రోడ్డు, మల్లెచెట్టుచౌరస్తా, హనుమాన్ నగర్, సాయినగర్ కాలనీ, స్నేహనగర్, వినాయకనగర్, టీచర్స్ కాలనీల్లో ఇండ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరి తీవ్ర నష్టాన్ని చేకూర్చుతోంది.
కట్టు కాల్వ వరదతో సమస్య
పోతారం (ఎస్) సమీపంలోని కట్టుకాల్వ ఉప్పొం గడంతో హుస్నాబాద్ పట్టణానికి ముంపు సమస్య ఏర్పడింది. గతంలో తీగలకుంట స్థానంలో వ్యవసాయమార్కెట్ యార్డు నిర్మించడంతో పాటు కుంట పరిధిలో ఇండ్ల నిర్మాణాలు జరగడం వరద ముంపునకు కారణమవుతోంది. ప్రతీఏటా వానకాలంలో కట్టుకాల్వ ఉప్పొంగడంతో హుస్నాబాద్ మునిగిన సంఘటనలు జరుగుతున్నా వరద మళ్లింపు చర్యలు తీసుకోవడంలేదు. గతంలో కట్టుకాల్వ నుంచి వచ్చే నీరు హుస్నాబాద్ పట్టణ శివార్లలోని తీగలకుంటలోకి చేరేది. అక్కడి నుంచి పటేల్ కుంట మీదుగా కొత్తచెరువులోకి నీరు వెళ్లేది. అయితే తీగలకుంట, పటేల్ కుంటల్లో నివాసాలు, ఇతర నిర్మాణాలు వెలియడంతో హుస్నాబాద్ వరద ముంపునకు గురవుతోంది.
రంగంలోకి మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్ పట్టణంలోని మెయిన్ రోడ్డులో దుకాణాలు ముంపునకు గురవడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ రంగంలోకి దిగారు. శుక్రవారం ఉదయం అధికారులతో కలిసి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. మల్లెచెట్టుచౌరస్తా, అనబేరిచౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, సిద్దిపేట రోడ్డు, పోతారం(ఎస్) రోడ్డు వంటి సమస్యాత్మక ప్రాంతాల్లోని డ్రైనేజీ కాల్వలు, కల్వర్టులను పరిశీలించారు.
జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా డ్రైనేజీ పనులు ఆలస్యం కావడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని ఆయన అన్నారు. పాత డ్రైనేజీ కాల్వలు మూసుకుపోవడం, జాతీయ రహదారి పనుల్లో డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి కాకపోవడంతోనే ఈ సమస్య ఉత్పన్నమైందని గుర్తించారు. ఈ పనుల ఆలస్యంపై అసహనం వ్యక్తం చేశారు. వేగంగా పనులు పూర్తి చేసి డ్రైనేజీ వ్యవస్థను క్రమబద్ధీకరించాలన్నారు. పోతారం(ఎస్) నుంచి పట్టణంలోకి వచ్చే వరద నీరు డ్రైనేజీలోకి సక్రమంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
అయితే గత ఏడాది సెప్టెంబర్ లో కురిసిన వర్షాలతో హుస్నాబాద్ పట్టణం మునిగిపోయినప్పుడు కూడా మంత్రి ఇలాగే ఆదేశాలు ఇచ్చినా పరిస్థితిలో మార్పు లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. అప్పుడు 15 రోజుల్లో మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ పనులు పూర్తిచేయాలని అధికారులకు డెడ్ లైన్ విధించారు. ఏడాది కావస్తున్నా అలాంటి మాటలకే పరిమితం కావడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.