calender_icon.png 2 October, 2025 | 1:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షెడ్యూల్ ఏరియాలో లంబాడాలకు ఇందిరమ్మ ఇల్లు ఎలా ఇస్తారు..?

02-10-2025 12:13:11 AM

వెంకటపురం(నూగూరు), అక్టోబర్1 (విజయక్రాంతి): లంబాడీలు  ఎస్టీలు కాదని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర  లలో ఆదివాసీలు రోడ్డు ఎక్కి పోరాటాలు చేస్తూ ఉంటే.. వలస వచ్చిన లంబాడిలకు షెడ్యూల్ ఏరియాలో ఇందిరమ్మ ఇల్లు ఎలా కేటాయిస్తారని ఆదివాసీ నవనిర్మాణ సేన ములుగు జిల్లా అధ్యక్షులు కుంజ మహేష్ మండల పరిషత్ అధికారిని ప్రశ్నించారు.

బుధవారం వెంకటాపురం మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ యందు ఆదివాసీ నవనిర్మాణ సేన ముఖ్య కార్యకర్తల సమావేశం కంతి శంకర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమం లో పాల్గొన్న కుంజ మహేష్ మాట్లాడుతూ షెడ్యూల్ ఏరియాలో రాజ్యాంగ వ్యతిరేఖంగా వలస గిరిజనేతరులకు, లంబాడిలకు పెద్ద మొత్తంలో ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం సరికాదని  అన్నారు.

అర్హత ఉన్న ఆదివాసీలకు ఇల్లు ఎందుకు కేటాయించ లేదన్నారు. వెంకటాపురం మండలం లో ఉన్న లంబాడిలకు ఇల్లు కేటాయించి ఇక్కడున్న ఆదివాసీల మనోభావాలు, ప్రయోజనాలు దెబ్బతినేలా.. హక్కులకు భంగం వాటిల్లెలా మండల పరిషత్ అధికారి వ్యవహారిస్తూ ఉన్నాడని ఆయన మండిపడ్డాడు. రాజకీయ ప్రయోజనాల కోసం స్థానిక ఎన్నికలను దృష్టి లో పెట్టుకొని కొందరు రాజకీయ నాయకులు ప్రజలను మభ్యపెట్టడం పైన తీవ్ర అసహనం వ్యక్తం చేసారు.

బర్లగూడెం గ్రామపంచాయతీకి మొదటి విడతలో మూడు ఇల్లు మాత్రమే కేటాయించారని తెలియజేశారు. పెసాచట్టం ప్రకారం షెడ్యూల్ ఏరియాలో ఓటు కోసం ఆదివాసీ లను ప్రలోభ పెట్టడం, బలవంతం పెట్టడం చేస్తే అట్రాసిటీ కేసులు పెట్టె పరిస్థితి వస్తుందని  హెచ్చరించారు. ఎన్నికల పేరుతొ ఆదివాసీ గూడెల్లో ఆదివాసీల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే వారికీ సరైన బుద్ధి చెప్తామని అన్నారు.