02-10-2025 12:00:00 AM
బెల్లంపల్లి అర్బన్, అక్టోబర్ 1 : బెల్లంపల్లిలో మూతపడిన సౌత్ క్రాస్ కట్ గని స్థలం ఆక్రమణ ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. అక్రమార్కులు దొడ్డిదారికి అర్ధరాత్రి మరో మోసానికి తెర తీశారు. సమీపాన ఉన్న ఓ ఫంక్షన్ హాల్ ప్రహరీగోడకు హడావుడిగా గని స్థలం దిశగా అక్రమంగా రాత్రికి రాత్రే గేటు అమర్చారు. ఈ సంఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
‘సింగరేణి భూముకి రక్షణ కరువు’ అనే శీర్షికతో బుధ వారం విజయక్రాంతిలో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన సింగరేణి అధికారులు ఓ వైపు ఆక్రమణ ప్రయత్నాలను అడ్డుకునే చర్యలకు పదును పెడుతున్నారు. సింగరేణి స్థలం దిశగా ఈ నేపథ్యంలో బుధవారం ఫంక్షన్ హాల్ ప్రహారీగోడకు గేటు నిర్మాణం సింగరేణి అధికారులకు సవాల్‌గా మారింది. కబ్జాదారులు అంతకు ముందే గని స్థలం చదును చేసి అనుమతి లేకుండా ఆధీనంలోకి తెచ్చుకున్నారు.
దానికి తోడు ఏకంగా ఆక్రమించిన స్థలం నుంచి నడిచేందుకు హక్కు లేకున్నా ప్రహరీ గోడకు కొత్తగా దారి కోసం గేటు నిర్మించారు. సింగరేణి అధికారులు నిజాయితీగా ఆక్రమణలను అడ్డుకుంటుంటే రోజుకు కబ్జాదారుడు వాళ్ల విధులకు ఆటంకం కలిగిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలని స్థానిక యువకులు సిద్ధమవు తున్నట్టు తెలిసింది. సింగరేణి ఆస్తుల పరిరక్షణ విషయంలో కంపెనీ చర్యలను అటు ఉంచితే, కార్మిక సంఘాలు ఈ విషయంలో ఎట్లా స్పందిస్తాయని స్థానిక ప్రజ లు చర్చించుకుంటున్నారు.