calender_icon.png 2 October, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర నిధులతోనే గ్రామాభివృద్ధి

02-10-2025 12:42:51 AM

  1. రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ దోపిడీ చేస్తే కాంగ్రెస్ పార్టీ మోసాలు చేస్తోంది
  2. స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీలకు ఓట్లు అడిగే అర్హత లేదు
  3. వార్డు మెంబర్ నుంచి జడ్పీటీసీ దాకా అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది
  4. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

కరీంనగర్, అక్టోబరు 1 (విజయక్రాంతి): గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులతోనే జరుగుతున్నవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తే, కాంగ్రెస్ పార్టీ మోసాలు చేస్తోందని విమర్శించారు. బుధవారం కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదని దుయ్యబట్టారు.

స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన పార్టీ బీఆర్‌ఎస్ అని, కేంద్ర నిధులను బీఆర్‌ఎస్ నేతలు దారి మళ్లించి గ్రామాలను దెబ్బతీశారని మండిపడ్డారు. సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి కల్పించారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ తీరుతో తాజామాజీ సర్పంచులు పడిన యాతన వర్ణణాతీతమన్నారు. పంచాయతీలకు కరెంట్ బిల్లులు కూడా కట్టలేని దుస్థితి బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చిందని ఫైర్ అయ్యారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక వాగ్ధానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరిం చిందని విమర్శించారు. రైతు భరోసా ఇవ్వడంలేదన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోందని, ఉచితంగా బియ్యం అందిస్తోందన్నారు. గ్రామాల్లో రోడ్లు, నర్సరీలు, ఇంటింటికీ నీళ్లు సహా జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే అని చెప్పారు.

బీఆర్‌ఎస్ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తే, కాంగ్రెస్ పార్టీ మోసాలు చేస్తోందని, బీజేపీ మాత్రం అభివృద్ధిపైనే మాట్లాడుతోందన్నారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీని ప్రజలు ఆదరించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో గెలిపించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా వార్డు మెంబర్ నుంచి జడ్పీటీసీ దాకా అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని, అత్యధిక స్థానాలను సాధిస్తామని అన్నారు.

బీజేపీ అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం మొదలైందని, ముందు జడ్పీటీసీ అభ్యర్థులను ఖరారు చేయాలని చెప్పారు. ఏకగ్రీవంగా ఖరారైన చోట బీఫాం ఇవ్వాలని సూచించారు. గ్రామాలకు కేంద్రంలోని బీజేపీ రూ.40 వేల కోట్లు ఎరువుల పేరుతో సబ్సిడీ ఇస్తోందని, ఎరువుల పంపిణీ చేతగాక కాంగ్రెస్ కృత్రిమ కొరత సృష్టించిందని ఆరోపించారు.

రెండు మూడు రోజుల క్రితమే లక్ష టన్నుల యూరియా రాష్ట్రానికి వచ్చిందని తెలిపారు. ఖరీఫ్ సీజన్‌లో పూర్తిస్తాయిలో ఎరువులను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. పార్టీ ఫిరాయిం పులకు బీజేపీ వ్యతిరేకమని, పార్టీని వీడేటప్పుడు రాజీనామా చేయాలన్నదే తమ అభిమతమని స్పష్టం చేశారు.