02-10-2025 12:01:26 AM
42 శాతం రిజర్వేషన్లతో బీసీలకు పెద్దపీట
మహబూబాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): ప్రాదేశిక ఎన్నికలు మహబూబా బాద్ జిల్లాలో రెండు దశల్లో నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో గ్రా మాల్లో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 18 జెడ్పిటిసి స్థానాలు, 193 ఎంపీటీసీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహి స్తున్న నేపథ్యంలో జిల్లాలో ఉన్న అధికారులు, పోలీసు బందోబస్తు, ఇతర అవస రాల ప్రాతిపదికన నేపథ్యంలో రెండు విడుదల ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదటి విడతలు 9 జడ్పిటిసి స్థానాలు, వాటి పరిధిలో ఉన్న 104 ఎంపీటీసీ స్థానాలకు, రెండవ విడత 9 జడ్పిటిసి స్థానాలు, వాటి పరిధిలో ఉన్న 89 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు చేపట్టారు.
రెండు విడతల్లో జరిగే ఎన్నికలకు బందోబస్తు, సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు పూర్తి చేశారు. 18 జెడ్పిటిసి స్థానాలు, 193 ఎంపీటీసీ స్థానాలకు 1,066 పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే ఖరారు చేశారు. మొత్తం 5,56,780 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించాల్సి ఉండగా, 24 మంది రిటర్నింగ్ అధికారులను, 22 మంది అసిస్టెంట్ రిటర్న్ అధికారులను నియమించారు.
అలాగే 1,279 మంది పోలింగ్ అధికారులను, 5,858 పోలింగ్ సిబ్బందిని నియమించారు. నామినేషన్ల స్వీకరణకు క్లస్టర్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 142 మంది ఆర్వో, ఏఆర్వోలను నియమించారు. 12 మంది జిల్లాస్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించి వివిధ విభాగాల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు.
మొదటి దశలో ఎన్నికలు జరిగే మండలాలు
బయ్యారం, చిన్న గూడూరు, దంతాలపల్లి, గార్ల, గూడూరు, మహబూబాబాద్, నరసింహాలపేట, పెద్ద వంగర, తొర్రూరు ఉన్నాయి. అక్టోబర్ 10 నుండి నామినేషన్ల స్వీకరణ, 23వ తేదీన ఉదయం 7 నుండి సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహిస్తారు.
రెండో దశ ఎన్నికలు జరిగే మండలాలు
డోర్నకల్, గంగారం, ఇనుగుర్తి, కేసముద్రం, కొత్తగూడ, కురవి, మరిపెడ, నెల్లికుదురు, సిరోలు మండలాలు. అక్టోబర్ 13 నుండి నామినేషన్ల స్వీకరణ, 27వ తేదీ ఉదయం 7 నుండి సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహిస్తారు.
ఎన్నికలు నిర్వహిస్తారా?
స్థానిక పోరుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న అనుమానాలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి. రిజర్వేషన్ల అమలులో న్యాయపరమైన చిక్కులు తొలగిపోతాయా, ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అన్న అంశం ఈనెల 8న స్పష్టమయ్యే అవకాశాలు ఉన్నాయని, ఆ తరువాతే పోటీ వ్యవహారం చూద్దామని ఆలోచనలో వివిధ పార్టీల నాయకులు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
అయితే మరోవైపు ఇప్పటికే ప్రకటించిన రిజర్వేషన్ల ప్రకారం జడ్పిటిసి, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేయడానికి చాలామంది నేతలు సన్నాహాలు ప్రారంభించారు. అయితే చాలా చోట్ల తమకు అనుకూలంగా పోటీ చేయడానికి రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు.
బీసీలకు పెద్దపీట
మహబూబాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన 42 శాతం బీసీల రిజర్వేషన్ల వల్ల ఈసారి జడ్పిటిసి, ఎంపీపీ స్థానాల్లో బీసీలకు పెద్దపీట లభించింది. 2019లో 16 ఎంపీపీ, 16 జెడ్పిటిసి స్థానాలు ఉండగా బీసీలకు ఎంపీపీ స్థానాల్లో ఒక్కటి కూడా కేటాయించలేదు.
ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఆరు స్థానాలు కేటాయించారు. అలాగే 2019లో జరిగిన జెడ్పిటిసి ఎన్నికల్లో బీసీలకు ఒక్క స్థానం కూడా కేటాయించకపోగా ఇప్పుడు ఏడు స్థానాలను కేటాయించడంతో బిసి వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది.