17-12-2025 01:13:57 AM
ఎర్రవల్లిలో 15వ రోజుకు రిలే దీక్షలు
గోకారం ఎర్రవల్లి రిజర్వాయర్ నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన
నాగర్‌కర్నూల్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలంలో బుధవారం గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా ఎర్రవల్లి గ్రామంలో మాత్రం రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా గోకారం ఎర్రవల్లి రిజర్వాయర్ నిర్మాణానికి వ్యతిరేకంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 15వ రోజుకు చేరాయి.
తమ గ్రామాలు ముంపు బారిన పడకుండా కాపాడాలని డిమాండ్ చేస్తూ, ఎన్నికలను బహిష్కరిస్తూ గ్రామస్థులంతా ఒక్క తాటిపైకి వచ్చి ఆందోళన బాట పట్టారు. రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించాలని, ఆర్ అండ్ ఆర్ (పునరావాస) జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎర్రవల్లి, ఎర్రవల్లి తండాకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్థానిక అంబేడ్కర్ విగ్రహం ఎదుట రిలే దీక్షలు నిర్వహించారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.