11-09-2025 12:00:00 AM
అవినీతి, బంధుప్రీతితో పీకల్లోతు కూరుకుపోయిన నేపాల్ రాజకీయ వ్యవస్థపై మరోసారి ప్రజావిప్లవం వచ్చింది. జెన్ యువత రాజరాని ఖాట్మాండ్‌తో సహా ప్రధాన నగరాల్లో విధ్వం సం సృష్టించింది. యువత ఆగ్రహ జ్వాలల్లో దేశాధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్, ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ నివాసాలు, సుప్రీం కోర్టు భవనం, మంత్రుల నివాసాలు, ప్రభుత్వ భవనాలు, పార్టీ ఆఫీసులు బుగ్గిపాలయ్యాయి.
భగ్గుమన్న నిరసనలతో ప్రధాని ఓలీ తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. క్యాబినెట్‌లోని మంత్రులనే కాగా, మాజీ ప్రధాన మంత్రులనూ నిరసనకారులు వదలలేదు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఏడాది క్రితం హసీనాను పదవీచ్యుతురాలిని చేసినప్పుడు జరిపిన ఘటనలే ఖాట్మాండ్‌లోనూ పునరావృతమయ్యాయి. పెచ్చుపెరిగిన అవినీతి, ఉపాధి అవకా శాలు సన్నగిల్లడం యువకులను తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేసింది.
అటు బంగ్లాదేశ్‌లో, ఇటు నేపాల్‌లో కన్పించింది. దక్షిణాసియా దేశాల్లో తలసరి ఆదాయం అతి తక్కువ వున్న దేశం నేపాల్. ఉద్యోగావశాలు లేక పొరుగున వున్న దేశాలకు యువత వలసవెళ్లడం చాలా ఏళ్లుగా అక్కడ సాధారణమైంది. దాదాపు ఐదేళ్లుగా ఏ రాజకీయ పార్టీ సుస్థిరపాలనను అందిచలేకపోవడంతో దేశానికి తరిగి రాచరిక పాలనే మేలన్న భావన కూడా ప్రజల్లో బలపడింది. రాచరిక పాలన తిరిగి రావాలని ఇటీవలి కాలంలో ప్రదర్శనలు కూడా జరిగాయి.
రాజకీయ నాయకుల అవినీతిపై విసిగి వేసారిన యువత ఇప్పుడు దేశ రాజ్యాంగాన్ని సవరించాలని, దేశ సంపదను కొల్లగొట్టిన నేలలపై విచారణ సాగాలని డిమాండ్ చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో మిలటరీ పాత్ర ఎంతవరకు వుంటుంది.. బంగ్లాదేశ్‌లో వలె తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, కంటి తుడుపు చర్యలతో సరిపెడుతుందా అనేది వేచిచూడాల్సిందే.
నేపాల్ రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఇది మొదటిసారి కాకపోయినా, పొరుగు దేశంలోని ఈ సంక్షోభాన్ని భారత్ జాగ్రత్తగా గమనిస్తోంది. సామాజిక మాధ్యమాలపై నిషేధం ఉన్న ఒక్క టిక్‌టాక్‌ను ఉపయోగించుకొని యువకుల్ని పెద్ద సంఖ్యలో సమీకృతి చేయడంలో పౌర సమాజ సంస్థలు సఫలీకృతులయ్యాయి. అయితే యువతను హింసకు ప్రేరేపించడం వెనుక అక్కడి రాజకీయ శక్తుల అదృశ్య హస్తం ఉన్నదా అనేది తేల్చాల్సి వుంది.
పెల్లుబికిన ఆగ్రహంతో యువకులు ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చినట్లు బయటకు కనిపిస్తున్నా, చైనా, అమెరికా మధ్య వాణిజ్యపరంగా తీవ్రస్థాయిలో వైరం నడుస్తున్న తరుణంలో నేపాల్‌లోని ఈ పరిణామాలు దేనికి సంకేతమనేది గమనించాల్సి వుంది. ఓలీ నాయకత్వంలో నేపాల్ విధానాలపై చైనా తన పట్టును పెంచుకొంది. ఓలీ ప్రభుత్వం భారత్ వ్యతిరేక వైఖరిని అనుసరించింది.
అమెరికా పెట్టుబడులను కూడా నేపాల్ ఆహ్వానించడం, దేశంలో ఈ అల్లర్లకు కారణమై వుండవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. ఇతర దేశాల ప్రయోజనాలకు అడ్డాగా మారిన నేపాల్ ఇప్పటికైనా సొంత ప్రయోజనాల కోసం తగిన విధానాలను రచించుకోవాల్సి వుంది.