10-09-2025 12:00:00 AM
ఒక్కోసారి మనం చేసే వ్యాపారం లాభాల్లోకి తీసుకురావచ్చు.. అదే సమయంలో అందఃపాతాళానికి పడేసే అవకాశమూ ఉంటుంది. అలాగే కొన్నిసార్లు మన ప్రభుత్వాలు వాణిజ్యపరంగా తీసుకునే తప్పుడు నిర్ణయాలు దేశ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంటుంది. ప్రస్తుతం భారత్ అదే సమస్యలో చిక్కుకున్నట్లుగా అనిపిస్తుంది.
రష్యాతో చమురు వ్యాపారం కొనసాగిస్తున్న వేళ భారత్‌కు నష్టమే ఎక్కువ అనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తుంది. రష్యాతో వ్యాపారం ఇవాళ దేశంలో 4 కోట్ల 50 లక్షల మంది ప్రజల జీవితాలను సంక్షోభంలోకి నెట్టేసిందంటే నమ్ముతారా? కానీ ఇది వాస్తవం. ఎప్పుడైతే రష్యాతో చమురు వ్యాపారం కొనసాగిస్తామని భారత్ చెప్పిందో.. అప్పుడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అప్పటికే భారత్‌పై విధించిన 25 శాతం సుంకాలను గత నెల ౨౭న 50 శాతానికి పెంచేశారు.
దీనివ్ల భారత్ నుంచి ఎగుమతయ్యే వస్త్రాలు, రొ య్యలు, జెమ్స్ , లెథర్ ఇతర వస్తువులపై అధిక భారం పడనుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ దేశ వ్యాపారంలో అతిపెద్ద పరిశ్రమ ఆధారిత రంగాలు. రోజుకు కొన్ని వేల కోట్ల వ్యాపారం జరిగే ఈ రంగాలు అమెరికా సుంకాల ప్రభావం కారణంగా ఆర్థికంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశముంది. తిరుప్పూర్ నేత కార్మికుల నుంచి సూరత్ వజ్రాల వ్యాపారులు దాకా.. తీర ప్రాంతాల్లో రొయ్యల వ్యాపారం చేసే రైతుల నుంచి లెదర్ పారిశ్రామిక రంగం వరకు నష్టాలు చవిచూసే పరిస్థితి ఏర్పడనుంది. అయితే ఇది మారాల్సిన అవసరం ఉంది.
ఇక్కడ ఒక విషయాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. అదేంటంటే భారత్‌తో వ్యాపారాన్ని మానేస్తున్నట్టు అమెరికా ఎప్పుడూ, ఎక్కడా ఎవరితో చెప్పలేదు. కేవలం తమ ఆర్థిక వనరులను మెరుగుపరచుకోవడం కోసమే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాల రూపంలో ఆంక్షలు విధిస్తున్నట్టు మాత్రమే చెప్పింది. తమ ఆర్థిక స్వావలంబన, ప్రజా జీవనం మెరుగదల కోసమే తాము దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాల నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
రెండింటిదే అధిక వాటా
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు భారత్ వంతు కూడా వచ్చింది. అయితే ప్రస్తుతం అమెరికాతో భారత్ అంటీముట్టినట్టుగా వ్యవహరించడం, రష్యాతో చమురు వ్యాపార బంధం మరింత దృఢంగా మారడం యాదృశ్చికంగా ఒకేసారి జరిగిపోయాయి. ప్రస్తుతం రష్యన్ చమురుపై భారత్ ఎక్కువగా ఆధారాపడుతున్నట్టుగా కనిపిస్తుంది.
ప్రభుత్వ రంగ చమురు శుద్ధి సంస్థలు కొనుగోళ్ల విషయంలో కాస్త వైవిధ్యత చూపిస్తున్నప్పటికీ.. దేశంలో రెండు ప్రైవేటు చమురు కొనుగోలు కంపెనీలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ కంపెనీలు రష్యా వద్ద చమురు కొనుగోలును మరింత పెంచాయి. ఇది ఎంతలా పెరిగిందంటే.. 2021లో రష్యా నుంచి 3 శాతం చమురు కొనుగోలు చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 2025 వచ్చేసరికి అది దాదాపు 50 శాతానికి చేరుకోవడం గమనార్హం.
ప్రస్తుతం రిలయన్స్ కంపెనీ రష్యా నుంచి రోజుకు 746,000 బ్యారెల్స్ చొప్పున చమురు కొనుగోలు చేస్తుంది. ఇక రష్యన్ సంస్థకు అనుబంధంగా ఉన్న నయారా ఎనర్జీ కూడా రోజుకు కొన్ని లక్షల బ్యారెళ్ల చమురును కొనుగోలు చేస్తూ వ్యాపారం కొనసాగిస్తుంది. మరి ఇంత వ్యాపారం జరుగుతున్నా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఏమైనా తగ్గాయా అంటే ఇసుమంతైనా మార్పు కనిపించడం లేదు. అదే సమయంలో అమెరికా సుంకాలు పెంచిందనే కారణంతో ఆ దేశానికి దిగుమతయ్యే వస్తువులను భారత్ తగ్గించుకోవడం వల్ల ఎగుమతులపై రోజుకు 37 నుంచి 42 బిలియన్ డాలర్ల నష్టాలను చవిచూడాల్సి వస్తుంది.
ఇది భారత్‌లోని చాలా మంది వ్యాపారులు, కార్మికులు, రైతుల జీవితాలను పూర్తిగా సంక్షోభంలోకి నెట్టేసింది. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం సుంకాల విషయంలో పదే పదే భారత్‌ను దెప్పిపొడుస్తూనే ఉంది. వాణిజ్య చర్చల కోసం భారత్ ఎప్పటికైనా దిగిరావాల్సిందేనని ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మరోసారి నోరు పారేసుకున్నారు. ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యా ఆక్రమించకముందు ఆ దేశంతో భారత్ చమురు కొనుగోలు తక్కువగానే ఉండేదన్నారు. యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్, ఇండోనేసియా వంటి దేశాలు అమెరికాతో వాణిజ్య పరంగా గొప్ప ఒప్పందాలు కుదుర్చుకున్నాయన్నారు.
అమెరికా నుంచి లాభం పొందామని, అమెరికా మార్కెట్లు తమకు అవసరమనే విషయాన్ని ఆ దేశాలు గుర్తించాయన్నారు. అలా కాకుండా రష్యా, చైనాలతో పొత్తు పెట్టుకోవాలనుకుంటే భారత్‌కు మంచి ముగింపు ఉండదని పీటర్ హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం మానేయడమే అన్నింటికి పరిష్కారమని సూచించారు. ఇదొక్కటే ఇరు దేశాల మధ్య శాంతి మార్గానికి దారి అని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నప్పటికీ రష్యాతో చమురు వ్యాపారం విషయంలో భారత్ మరోసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
లాభం కంటే నష్టమే ఎక్కువ
అమెరికాతో ట్రేడ్ వార్ వల్ల భారత్‌కు లాభం కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఆదాయంలోని ప్రతి రూపాయి ఇవాళ వినియోగంలోకి వచ్చేసరికి రూ.2.5 తగ్గుదలతో నష్టాన్నే చవిచూస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీనివల్ల భారత్ ఆర్థికంగానూ దెబ్బతినే అవకాశముంది. అమెరికా సుంకాల నేపథ్యంలో దాదాపు 60 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోమే ప్రమాదముంది. భారత వ్యాపార రంగంలో అధిక లాభాలు గడించే రొయ్యలు, రత్నాలు, ఆభరణాలు, వస్త్రాలు, లెథర్ పరిశ్రమ రంగాలు ఇప్పుడు నష్టాల బాటలో పయనిస్తున్నాయి.
ఆంధ్ర, ఒడిశా ప్రాంతాల నుంచి అమెరికాకు ఎగుమతయ్యే రొయ్యలు వెళ్లకపోవడం వల్ల దాదాపు 2.4 బిలియన్ డాలర్లు, సూరత్, ముంబై నుంచి ఎగుమతయ్యే వజ్రాలు, ఆభరణాలు అక్కడికి చేరుకోకపోవడం వల్ల దాదాపు 10 బిలియన్ డాలర్లు కోల్పోయినట్లే. గతంలో అమెరికాకు 35 శాతం ఎగుమతయ్యే వస్త్రరంగం పూర్తిగా నలిగిపోతుంది. మీర్జాపూర్, శ్రీనగర్ నుంచి వెళ్లే తివాచీల ఎగుమతులు 58.6 శాతం మేర దెబ్బతిన్నాయి. ఆగ్రా, కాన్పూర్ నుంచి ఎగుమతయ్యే తోలు, పాదరక్షలు సుంకాల సుడిలో చిక్కుకొని విలవిల్లాడిపోతున్నాయి. బాస్‌మతి రైస్, సుగంధ ద్రవ్యాలు, టీ ఎగుమతులు తగ్గడంతో వ్యవసాయరంగం 6 బిలియన్ డాలర్ల నష్టాలను చవిచూస్తుంది.
పరిస్థితి ఇలాగే కొనసాగితే భారతదేశ ఎగుమతులకు పెద్ద దెబ్బ పడినట్లే. నిరుద్యోగం పెరిగిపోయి దేశం మరింత పేదరికానికి దిగజారిపోయే ప్రమాదముంది. అధిక కొనుగోలు, శక్తి, సమానత్వం (పీపీపీ) అన్ని దేశాలకు అవసరమే. కానీ దీనివల్ల మన దేశంలో మాత్రం ధనికులే ఎక్కువగా లాభపడుతున్న దాఖలాలు ఉన్నాయి. మరి భారత్ రష్యాతో అధిక చమురు వ్యాపారం కొనసాగించడం వల్ల లాభం ఏదైనా ఉందా అంటే చమురుపై 2.5 నుంచి 3 బిలియన్ డాలర్లను మాత్రమే ఆదా చేయగలిగింది. కానీ ఎగుమతులు లేకపోవడం వల్ల 42 బిలియన్ డాలర్ల వ్యాపారం నష్టపోతున్న విషయాన్ని గ్రహించాలి.
తక్షణ కర్తవ్యం
అమెరికా తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం కోసం ఇతర దేశాలపై సుంకాల చర్యలకు దిగింది. ఇప్పుడు భారత్ కూడా తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరముంది. సార్వభౌమత్వం అంటే ధిక్కారం ఒక్కటే కాదు.. ఆలోచన, జ్ఞానం, పరిష్కార మార్గాలు కూడా ఉండాలి. ప్రస్తుతం భారత్ తక్షణ కర్తవ్యం ఏమిటం టే.. రష్యన్ చమురుపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాల్సిందే. అదే సమయంలో విదేశీ దిగుమతులను కాపాడుకుంటూనే జీవనోపాధిని రక్షించుకోవాలి.
మరింత ఆలస్యం చేస్తే మాత్రం ఆర్థిక వ్యవస్థ నాశనమవ్వడమే గాక ఏళ్లుగా భారత్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న పరిశ్రమ రంగాలు మూతపడే ప్రమాదముంది. దీనివల్ల నిరుద్యోగం పెరిగిపోయి భారత్ మళ్లీ ఆకలి కేకలతో అలమటిస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేల్కొని ఆర్థిక వ్యవస్థను బలపరిచే వ్యూహాలను అమలు చేయాలి. దేశ ప్రజల జీవన విధానాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదే.
వ్యాసకర్త: కేఎస్‌వై