21-04-2025 12:00:00 AM
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియంకా చోప్రా కథానాయకిగా నటిస్తుండగా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఇటీవలే ఒడిషా షెడ్యూల్ పూర్తయింది. తర్వాత మహేశ్ బాబు ఇటీవలే విహారయాత్రలు వెళ్లి, తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. మరోవైపు రాజమౌళి జపాన్ పర్యటన కూడా ముగిసింది. దీంతో ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం.. ఈ సినిమా షూటింగ్‌కు కావాల్సిన సరంజామా అంతా టీమ్ సైలెంట్‌గా సిద్ధం చేసిపెట్టడంతో రాజమౌళి, మహేశ్ విదేశాల నుంచి వచ్చీరాగానే ఏ హడావిడీ లేకుండా కొత్త షెడ్యూల్‌ను మొదలుపెట్టేసినట్టు తెలుస్తోంది.
అయితే, తాజా షెడ్యూల్‌లో భాగంగా నీటిలో ఒక భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారని వినవస్తోంది. ఈ షెడ్యూల్‌లో మహేశ్‌బాబు, ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌తోపాటు సుమారు 3 వేల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొననున్నారట. వీరంతా ఈ సన్నివేశం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారని అంటున్నారు. ఈ సీక్వెన్స్‌ను మే నుంచి జూన్ వరకు చిత్రీకరించనున్నారట.
ఇందుకోసం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ను సైతం సిద్ధం చేస్తున్నారు మేకర్స్. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ల నేతృత్వంలో ఈ పోరాట ఘట్టాన్ని చిత్రీకరించనున్నారని భోగట్టా. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా సాహసయాత్ర చేసే ఒక సాహసికుడి కథగా ఉండనుంది. ఈ పాన్ ఇండియా చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు.