calender_icon.png 3 November, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచవటిలో భారీ అక్రమం..

02-11-2025 08:57:27 PM

* అధికారుల ఉత్తర్వులు బేఖాతరు

* ప్రముఖ హీరో పేరుపై ఆరోపణలు

* విషయం హైకోర్టుకు చేరినా ఆగని పనులు

మ‌ణికొండ‌ (విజ‌య‌క్రాంతి): మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పంచవతి కాలనీలో ఒక భారీ అక్రమ నిర్మాణం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఈ కట్టడంపై టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్ శాఖలు ఆపివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా, నిర్మాణదారులు ఏమాత్రం లెక్కచేయడం లేదు. స్థానికుల అభ్యంతరాలను, అధికారుల ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ నిర్మాణం సాగిస్తుండటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. పంచవతి కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా ఈ నిర్మాణం జరుగుతోందని కాలనీ వాసులు మున్సిపాలిటీకి పలుమార్లు ఫిర్యాదు చేశారు. స్పందించిన టౌన్ ప్లానింగ్, నీటిపారుదల శాఖ టౌనప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్మాణాన్ని తక్షణం ఆపివేయాలని నోటీసులు జారీ చేశారు.

అయినా ఆ ఆదేశాలను పెడచెవిన పెట్టి పనులు యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణం వెనుక ఒక ప్రముఖ హీరో పేరు ఉన్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన పేరును అడ్డుపెట్టుకొని ఈ భారీ కట్టడాన్ని నిర్మిస్తున్నట్లు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులే ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై కొందరు సభ్యులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించి న్యాయస్థానంలో కేసు దాఖలు కావడం అంశం తీవ్రతను తెలియజేస్తోంది. ఉన్నత న్యాయస్థానంలో కేసు నడుస్తున్నా, శాఖాపరమైన ఆదేశాలు ఉన్నా నిర్మాణం ఆగకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అధికార యంత్రాంగం అండదండలతోనే ఈ అక్రమం సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ అక్రమ నిర్మాణంపై ఉక్కుపాదం మోపాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పంచవతి కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.