24-12-2025 01:13:03 AM
మేడ్చల్, డిసెంబర్ 23(విజయ క్రాంతి): అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులు ప్రభుత్వ భవనాలు వేటలో పడ్డారు. ఈనెల 31వ తేదీలోగా కచ్చితంగా ప్రభుత్వం భవనాల్లోకి మారాలని, ఫిబ్రవరి నుంచి అద్దె చెల్లించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ప్రైవేట్ భవనాల్లో కొనసాగితే సంబంధిత అధికారులే బాధ్యులని ఉత్తర్వుల్లో పేర్కొంది.
కేవలం వారం రోజులే గడువు ఉండడంతో అధికారులు ప్రభుత్వ భవనాలు ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, సౌకర్యంగా ఉన్నాయా అని పరిశీలిస్తున్నారు. ప్రైవేటు భవనాలకు అద్దె చెల్లించడం ఖజానాకు భారంగా తయారు కావడంతో ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ కార్యాలయాలకు సొంత భవనాలు లేవు కొన్నేళ్లుగా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.
ఇవే కాకుండా పలు ఇతర శాఖలకు చెందిన కార్యాలయాలు కూడా అద్దె భవనాల్లోనే ఉన్నాయి. జిల్లాలో పంచాయతీలన్నీ మున్సిపాలిటీలలో ఆ తర్వాత జిహెచ్‌ఎంసి లో విలీనంతో జిల్లా, మండల పరిషత్ భవనాలు ఖాళీ అయ్యాయి. కొన్నిచోట్ల ఈ భవనాలు అందుబాటులో ఉన్నాయి.
జడ్పి లోకి రిజిస్ట్రేషన్ కార్యాలయం
మేడ్చల్ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం, సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అద్దె భవనంలో కొనసాగుతున్నాయి. వీటికి నెలకు సుమారు రూ. 70000 చెల్లిస్తున్నారు. అయినప్పటికీ యజమాని అద్దె పెంచాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ భవనంలో కనీస సదుపాయాలు లేవు. అంతేగాక పట్టణ నడిబొడ్డున జాతీయ రహదారిని ఆనుకుని ఉంది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలోకి పెద్ద సంఖ్యలో ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం వస్తుంటారు. దీంతో ప్రతిరోజు ట్రాఫిక్ జామ్ అవుతోంది.
ఈ రెండు కార్యాలయాలను జిల్లా పరిషత్ లోకి తరలించాలని కొంతకాలంగా స్థానికులు కోరుతున్నారు. ఇటీవల కలెక్టర్ మను చౌదరి జిల్లా, మండల పరిషత్ భవనాలను పరిశీలించారు. జిల్లా పరిషత్ మొదటి అంతస్తులు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం, గ్రౌండ్ ఫ్లోర్ లో సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటుకు పరిశీలించారు.
పక్కనే ఉన్న మండల పరిషత్ కార్యాలయం కూడా పరిశీలించారు. మేడ్చల్ లో తహసిల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు పులుతుందో తెలియని పరిస్థితి ఉంది. వర్షాకాలంలో కొంత భాగం పైకప్పు కూలింది. తహసిల్దార్ కార్యాలయాన్ని మండల పరిషత్ కార్యాలయంలోకి తరలించనున్నారు.
ఎక్సైజ్ కార్యాలయాలన్నీ ప్రైవేటు భవనాల్లోనే..
జిల్లాలో రెండు ఎక్సైజ్ సూపర్ ఇండెంట్ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఎక్సైజ్ స్టేషన్లన్నీ అద్దె భవనంలోనే కొనసాగుతున్నాయి. మేడ్చల్ ఎక్సైజ్ పరిధిలో ఐదు సీఐ కార్యాలయాలు ఉన్నాయి. మేడ్చల్, దుండిగల్, కుత్బుల్లాపూర్, బాలానగర్, కొంపల్లి కార్యాలయాలన్నీ భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ ఎస్ కార్యాలయం కూడా కొంపల్లిలో ప్రైవేటు భవనంలోనే ఉంది. ప్రభుత్వ భవనాల కోసం చూస్తున్నామని మేడ్చల్ ఈఎస్ ఫయాజుద్దీన్ తెలిపారు.
అందుబాటులోకి వచ్చిన ప్రభుత్వ కార్యాలయాలు
మేడ్చల్ జిల్లా మొత్తం జిహెచ్‌ఎంసి పరిధిలో విలీనం చేయడంతో కొన్ని శాఖల భవనాలు ఖాళీ అయ్యాయి. పంచాయతీ వ్యవస్థకు అనుసంధానంగా ఉండే శాఖల కార్యాలయాలు కలెక్టరేట్లో ఖాళీ కానున్నాయి. అంతేగాక షామీర్పేట్ లోని మండల పరిషత్ కార్యాలయం కూడా ఖాళీగానే ఉంది. వీటిలోకి కొన్ని శాఖలు తరలించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.