24-12-2025 01:12:25 AM
నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 23, (విజయక్రాంతి):తెప్పోత్సవం, ముక్కోటి మహోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు నిత్యం వాహన తనకే లచ్చు నిర్వహించాలని ఎస్పీ రోహిత్ రాజ్ పోలీస్ అధికారులను ఆదేశించారు.మంగళవారం పోలీస్ హెడ్ క్వార్ టర్ నందు నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా పంచాయితీ ఎన్నికలలో , వర్టీకల్స్ వారీగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు,సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ నివారణా చర్యలను చేపట్టాలని సూచించారు. సంవత్సరం చివరలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా నిత్యం వాహన తనిఖీలు చేపడుతూ,మద్యం సేవించి వాహనాలను నడిపే వారిపై స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి ప్రమాదాలను నివారించడంలో ప్రతి ఒక్కరూ భాద్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు. అనంతరం అన్ని పోలీస్ స్టేషన్లలో నమోదైన పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి భాదితులకు న్యాయం చేకూర్చాలని తెలిపారు. పోక్సో కేసులలోని నిందితులకు త్వరతగతిన శిక్ష పడే విధంగా కృషిచేయాలన్నారు. గంజాయి అక్రమ రవాణా,మట్కా,క్రికెట్ బెట్టింగులు,కోడిపందాలు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు.ఈ నెల 29,30 తారీఖులలో భద్రాచలంలో జరగనున్న తెప్పోత్సవం,ముక్కోటి ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్త్ ప్రణాళికను రూపొందించా లన్నారు. పెట్రోలింగ్, బ్లూ కోలట్స్ వాహనాలతో నిత్యం రోడ్లపై సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
షీ టీమ్స్, భరోసా కేంద్రాల ఆవశ్యకత గురించి అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేసి భాధిత మహిళలకు అండగా ఉండాలన్నారు.ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామీ,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్,ఐటీ సెల్ సీఐ రాము,ఇతర అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.